
నవతెలంగాణ – నల్గొండ కలెక్టరేట్
నల్గొండ పార్లమెంటు ఎన్నికలను స్వేచ్ఛగా, శాంతియుతవతావరణంలో నిర్వహించేందుకు లోక సభ ఎన్నికలలో పోటీలో ఉన్న అభ్యర్థులందరూ సహకరించాలని జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకులు, సీనియర్ ఐఏఎస్ అధికారి మనోజ్ కుమార్ మాణిక్ రావు సూర్యవంశి కోరారు. సోమవారం నామినేషన్ల ఉపసంహరణ అనంతరం పోటీలో ఉన్న అభ్యర్థులతో ఆయన జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని రిటర్నింగ్ అధికారి చాంబర్లో సమావేశమయ్యారు. నల్గొండ జిల్లాలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి బాగా అమలు చేస్తున్నారని, లోక సభ ఎన్నికలలో పోటీల్లో ఉన్న అభ్యర్థులు సైతం ఎన్నికల ప్రవర్తనా నియమావళిని, నియమ నిబంధనలను తు. చ తప్పక పాటిస్తూ ఎన్నికల సంఘానికి సహకరించాలని కోరారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఎవరైనా ఉల్లంఘించినట్లు తమ దృష్టికి తీసుకువస్తే తగు చర్య తీసుకుంటామని హెచ్చరించారు.
జిల్లాలో లోక సభ ఎన్నికలు శాంతియుతంగా, నిష్పక్షపాతంగా, స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్వహించేందుకు ఎక్కువ మంది ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు వేసేలా సహకరించాలని కోరారు. జిల్లా కలెక్టర్, నల్గొండ పార్లమెంటు నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి దాసరి హరిచందన మాట్లాడుతూ.. లోక సభ ఎన్నికలలో భాగంగా నల్గొండ పార్లమెంట్ స్థానానికి మొత్తం 31 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా, సోమవారం 9 మంది అభ్యర్థులు వారి నామినేషన్లను ఉపసంహరించుకున్నారని, 22 మంది పోటీలో ఉండగా, వారికి గుర్తులు సైతం కేటాయించినట్లు తెలిపారు. అభ్యర్థులు నామినేషన్ వేసిన రోజు నుండి వారి ఎన్నికల ఖర్చులను నమోదు చేయడం జరుగుతుందని అభ్యర్థులు పూర్తిగా ఖర్చులకు సంబంధించిన అంశాలను అవగాహన కలిగి ఉండాలని కోరారు. అదేవిధంగా అభ్యర్థుల ఎన్నికల ఏజెంట్లను సైతం నియమించడం జరుగుతుందని వారందరికీ గుర్తింపు కార్డులు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్ నల్గొండ పార్లమెంటు నియోజకవర్గం డిప్యూటీఆర్ఓ, స్పెషల్ కలెక్టర్ నటరాజ్ తదితరులు హాజరయ్యారు.