
నవతెలంగాణ – నల్గొండ కలెక్టరేట్
పార్లమెంటు ఎన్నికల నిర్వహణలో భాగంగా అభ్యర్థులు చేసే ఖర్చు లను జాగ్రత్తగా నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం ద్వారా జిల్లాకు నియమించబడిన వ్యయ పరిశీలకులు కళ్యాణ్ కుమార్ దాస్ అన్నారు. సోమవారం ఆయన నల్గొండ జిల్లా కేంద్రంలోని రోడ్లు, భవనాల అతిథి గృహంలో సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. నల్గొండ పార్లమెంటు స్థానంలో ఎన్నికల ఖర్చు, వ్యయానికి సంబంధించిన విషయాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటివరకు ఆయా పార్టీలు ఖర్చు చేసిన విషయాలు,ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, సోషల్ మీడియాలో వస్తున్న ప్రకటనల ఖర్చు వివరాలు అడిగి తెలుసుకున్నారు. అభ్యర్థుల ఖర్చుల విషయంలో ఏరోజు కారోజు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.నామినేషన్ కు ముందు అభ్యర్థులు, పార్టీలు చేసిన ఖర్చు వివరాలను ఎప్పటికప్పుడు సంబంధిత ఖాతాలో పొందుపరిచామని, నామినేషన్ తర్వాత అభ్యర్థి ఖాతాలో ఆ ఖర్చు వివరాలు నమోదు చేయడం జరుగుతుందని నోడల్ అధికారులు వివరించారు. ఈ సమావేశంలో ఎక్స్పెండిచర్ నోడల్ ఆఫీసర్ కిరణ్ కుమార్, జిల్లా ఆడిట్ ఆఫీసర్ జి. శ్రీనివాస్, ఎక్సైజ్ నోడల్ ఆఫీసర్ సతీష్, మీడియా నోడల్ అధికారి జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ కోటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.