ములుగులో గంజాయి స్వాధీనం

Cannabis seized in Mulugu–  ములుగు ఎస్‌ఐ అప్పాని వెంకటేశ్వర్లు
నవతెలంగాణ – ములుగు
ములుగు జిల్లా శ్రీనగర్‌ క్రాస్‌ రోడ్‌ వద్ద ఐదు కిలోల గంజాయిని పట్టుకున్నట్టు ములుగు ఎస్‌ఐ ఏ.వెంకటేశ్వర్‌ తెలిపారు. ఆదివారం ములుగు పరిధిలో తన సిబ్బందితో వాహనాల తనిఖీ చేపట్టగా.. రామచంద్రాపురం వైపు నుంచి వస్తున్న తవేరా వాహనంలో నుంచి ఇద్దరు పోలీసులను చూసి పారిపోతుండగా వెంటపడి ఇద్దరిలో ఒకరిని (మహిళ) పట్టుకున్నారు. మరో వ్యక్తి పరారయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒడిశాలోని మల్కాజిగిరి జిల్లా నిమ్మలపల్లికి చెందిన దసరా సత్యబతి, ములుగు మండలం మాన్‌సింగ్‌ తండాకు చెందిన మాలోత్‌ రవితో కలిసి కొంతకాలంగా గంజాయి వ్యాపారం చేస్తోంది. కాగా, ఒడిశా నుంచి కిలో గంజాయికి వెయ్యి రూపాయిల చొప్పున కొని వరంగల్‌లో రూ.25,000 అమ్ముతున్నారు. కాగా, కొన్ని రోజుల క్రితం రవి ఫోన్‌ చేసి 31 డిసెంబర్‌ రాత్రి నూతన సంవత్సర వేడుకల్లో గంజాయిని విక్రయించేందుకు ఆర్డర్‌ ఇచ్చాడు. దాంతో డిసెంబర్‌ 28న సత్యబతి సుమారు 6 కిలోల ఎండు గంజాయిని తీసుకొని రవి ఇంటికి వెళ్లింది. 30న మధ్యాహ్నం సత్యబతి, రవి కలిసి గంజాయి తీసుకొని రవికి చెందిన తవేరా వాహనంలో గంజాయి విక్రయానికి వెళ్లారు. ఈ క్రమంలో శ్రీనగర్‌ క్రాస్‌ రోడ్‌ వద్ద పోలీసులకు పట్టుబడ్డారు. మహిళ వద్ద లభ్యమైన 5.670 కిలోల గంజాయితో పాటు సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. సత్యబతిని రిమాండ్‌కు తరలించారు. పట్టుకున్న గంజాయి విలువ విలువ సుమారు రూ.1,50,000 విలువ ఉంటుందని సీఐ ఎం రంజిత్‌ కుమార్‌ తెలిపారు.