– ఫైర్ సేఫ్టీ ఎన్వోసీ సమర్పించాల్సిందే : జూనియర్ కాలేజీలకు హౌంశాఖ ఆదేశం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ఫైర్ సేఫ్టీకి సంబంధించి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ (ఎన్వోసీ) సమర్పించాలనీ, అప్పటివరకు తాత్కాలిక ఏర్పాట్లను చేసుకోవాలని జూనియర్ కాలేజీలను హౌంశాఖ ఆదేశించింది. ఈ మేరకు బుధవారం హౌంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రవి గుప్తా ఉత్తర్వులు జారీ చేశారు. జూనియర్ కాలేజీల్లో ఫైర్ సేఫ్టీకి సంబంధించి ఎన్వోసీకి సంబంధించిన ప్రొసీజర్లను 2020లోనే హౌంశాఖ ఉత్తర్వులిచ్చిందని గుర్తుచేశారు. అయితే ప్రత్యేక కేసుగా గుర్తించి 2021-22 వరకు, తిరిగి 2022-23, 2023-24లో రెండేండ్ల పాటు పొడిగించిందని గుర్తుచేశారు. 2024లో తెలంగాణ ప్రయివేటు జూనియర్ కాలేజీల యాజమాన్యాల సంఘం ప్రత్యేక కేసుగా మరో రెండేండ్లు పొడిగింపునివ్వాలని కోరిన విషయాన్ని గుర్తుచేశారు.
అన్ని ప్రతిపాదనలను పరిశీలించిన ప్రభుత్వం, తెలంగాణ ఫైర్ డిజాస్టర్ రెస్పాన్స్ ఎమర్జెన్సీ అండ్ సివిల్ డిఫెన్స్ డైరెక్టర్ జనరల్, తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కార్యదర్శిని సంప్రదించి 2024-25 ఒకే ఏడాదికి మాత్రమే మినహాయింపునివ్వాలని నిర్ణయించిందని పేర్కొన్నారు. మరో ఏడాది పొడిగించేది లేదని స్పష్టం చేశారు. ఆయా కళాశాలల యాజమాన్యాలు తరగతి గదుల్లో అగ్నిమాపక పరికరాలను అందుబాటులో ఉంచుకుని తాత్కాలిక ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. సంబంధించి ఫొటోలను ఆన్‌లైన్ పోర్టల్‌లో అప్‌లోడ్ చేయడంతో పాటు సంబంధిత కళాశాలలు అఫిడవిట్‌ను సమర్పించాల్సి ఉంటుంది.