విద్యార్థులకు మంచి భోజనం పెట్టలేరా?

– ప్రభుత్వానికి మాజీమంత్రి హరీశ్‌రావు ప్రశ్న
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
గురుకుల పాఠశాలల్లో వరుసగా ఫుడ్‌ పాయిజన్‌ ఘటనలు జరగడంపై మాజీ మంత్రి టీ హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. వాంకిడి ఆశ్రమ పాఠశాలలో కలుషిత ఆహారం తిని 60 మంది విద్యార్థులు ఆస్పత్రి పాలైన ఘటన మరువకముందే, తాజాగా మంచిర్యాల గిరిజన ఆశ్రమ పాఠశాలలో మరో ఘటన జరగటం దారుణమని విమర్శించారు. 12 మంది విద్యార్థులు అస్వస్థతకు గురై ఆస్పత్రి పాలైన ఘటన బాధ కలిగిస్తున్నదని చెప్పారు. వరుసగా ఇలాంటి ఘటనలు జరుగుతున్నా ప్రభుత్వం మొద్దు నిద్ర వీడకపోవడం శోచనీయ మన్నారు. విద్యార్థుల ప్రాణాలంటే ప్రభుత్వానికి పట్టింపు లేదా అని ప్రశ్నించారు. పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించడం కూడా ప్రభుత్వానికి చేతకావడం లేదని ఆరోపించారు. చదువుకోవడానికి పాఠశాలలకు వెళ్తే ప్రాణాలు కోల్పోయే పరిస్థితులు రావడం అత్యంత హేయమని తీవ్రంగా ఆక్షేపించారు.