– హైదరాబాద్, గుజరాత్ మ్యాచ్ వర్షార్పణం
– ప్లే ఆఫ్స్‌లో అడుగుపెట్టిన సన్‌రైజర్స్
వరుణుడి ఖాతాలో మరో మ్యాచ్. ఉప్పల్ స్టేడియంలో కుండపోత వర్షంతో సన్‌రైజర్స్, టైటాన్స్ మ్యాచ్ రద్దుగా ముగిసింది. సాయంత్రం నుంచే భారీ వర్షం ఉండగా.. మ్యాచ్ సమయంలోనూ ఎడతెగని వర్షం కురిసింది. కనీసం 5 ఓవర్ల మ్యాచ్ అయినా సాధ్యపడదా? అని మైదాన సిబ్బంది ఎదురుచూసినా వరుణుడు విడువలేదు. టైటాన్స్‌తో మ్యాచ్ వర్షార్పణంతో 13 మ్యాచుల్లో 15 పాయింట్లతో సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లే ఆఫ్స్ బెర్త్ సొంతం చేసుకుంది.
నవతెలంగాణ-హైదరాబాద్
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ 17 సీజన్ ప్లే ఆఫ్స్‌లో అడుగుపెట్టింది. ఉప్పల్ స్టేడియంలో గురువారం గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్ వర్షార్పణం కావటంతో ఇరు జట్లు చెరో పాయింట్ పంచుకున్నాయి. గ్రూప్ దశలో 13 మ్యాచుల్లో ఏడు విజయాలు సహా 15 పాయింట్లు సాధించిన సన్‌రైజర్స్ హైదరాబాద్ టాప్-4లో చోటు పదిలం చేసుకుంది. గ్రూప్ దశలో చివరి మ్యాచ్‌లో ఏకంగా టాప్-2పై కన్నేసి సన్‌రైజర్స్ హైదరాబాద్ బరిలోకి దిగనుంది. గుజరాత్ టైటాన్స్ గ్రూప్ దశలో చివరి రెండు మ్యాచులు వర్షార్పణంగా ముగిశాయి. అహ్మదాబాద్‌లో కోల్‌కత నైట్‌రైడర్స్‌తో మ్యాచ్ సైతం వర్షం కారణంగా రద్దు అయిన సంగతి తెలిసిందే. 14 మ్యాచల్లో ఐదు విజయాలతో గుజరాత్ టైటాన్స్ 12 పాయింట్లు సాధించింది. ఇందులో రెండు మ్యాచుల్లో గుజరాత్ టైటాన్స్ ప్రత్యర్థి జట్టుతో సమానంగా పాయింట్లు పంచుకుంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ గ్రూప్ దశ చివరి మ్యాచ్‌లో ఆదివారం ఉప్పల్ స్టేడియంలోనే పంజాబ్ కింగ్స్‌తో తలపడనుంది.
ఇదే ప్రథమం : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) చరిత్రలో ఉప్పల్ స్టేడియంలో ఓ మ్యాచ్ రద్దు కావటం ఇదే ప్రథమం. 2008 ఐపీఎల్ సీజన్ నుంచి ఉప్పల్ స్టేడియంలో 78 మ్యాచులు జరిగాయి. అందులో 77 మ్యాచుల్లో ఫలితం తేలింది. కేవలం ఈ మ్యాచ్‌లోనే ఫలితం రాలేదు. కనీసం ఐదు ఓవర్ల మ్యాచ్ సాగేందుకు రాత్రి 10.56 గంటలు డెడ్‌లైన్. ఆ సమయానికి మ్యాచ్ ఆరంభం కావాలంటే కనీసం 10.15 నిమిషాలకు అంపైర్లు పిచ్‌ను పరిశీలించి టాస్ సమయం వెల్లడించాలి. కానీ 10.15 గంటల వరకు సైతం మైదానంలో వర్షం కురుస్తూనే ఉంది. దీంతో అంపైర్లు ఇరు జట్ల కెప్టెన్లతో చర్చించి మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. దీంతో కనీసం టాస్ కూడా పడకుండానే సన్‌రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్ మ్యాచ్ రద్దు అయ్యింది.
అభిమాన సంద్రం : సన్‌రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్ మ్యాచ్‌కు సైతం ఉప్పల్ స్టేడియం నిండిపోయింది. మ్యాచ్‌ను వీక్షించేందుకు 33781 మంది అభిమానులు స్టేడియానికి వచ్చారు. అందులో సుమారు 20000 మంది వరకూ మ్యాచ్ రద్దు ప్రకటన వరకూ స్టేడియంలోనే ఓపిగ్గా ఎదురుచూశారు. గతంలో భారత్, ఆస్ట్రేలియా టీ20 మ్యాచ్ వర్షం పడకపోయినా తడి అవుట్‌ఫీల్డ్ కారణంగా రద్దు అయ్యింది. టైటాన్స్, సన్‌రైజర్స్ మ్యాచ్‌లో ఎడతెరపి లేని వర్షం కారణంగా ఆట సాధ్యపడలేదు.