అధికార హింసను అరికట్టాలేమా

Can't stop the violence of power?దాదాపు 1920 వరకూ దేశ స్వాతంత్య్రం కోసం అందరూ ఒకతాటిపై నడిచిన భారతీయులు, తరువాత తలెత్తిన రాజకీయ నాయకుల మధ్య ఆలోచనా ధోరణులు, ప్రత్యేక మతాధారిత నియోజకవర్గాలు, పార్టీలు, అగ్గికి ఆజ్యం పోశాయి. బ్రిటిష్‌ వారి ”విభజించు – పాలించు” విధానాలు కూడా దేశ విభజనకు దారి తీశాయి. అప్పటి నుంచి నేటి వరకూ అనేక రూపాల్లో హింసాత్మక సంఘటనలు దేశంలో చోటు చేసుకుంటూనే ఉన్నాయి. అనేక మంది ప్రాణాలు కోల్పోవడం, అదే సందర్భంలో అనేక కోట్ల రూపాయల ఆస్తి బుగ్గిపాలవడం జరుగుతోంది… దీనికి పరాకాష్టగా దేశ విభజన సందర్భంగా దేశంలో చెలరేగిన హింసాత్మక ఘటనలు దేశ చరిత్రలో నల్లటి మచ్చలుగా నేటికీ, మున్ముందు కదలాడుతూనే ఉంటాయి. దేశ స్వాతంత్య్రం అనంతరం దేశంలో జరుగుతున్న అత్యధిక హింసాత్మక ఘటనలు మతపరమైనవే… 1960లో గుజరాత్‌ అల్లర్లు, 1984లో సిక్కు అల్లర్లు, 2002లో దేశాన్ని కుదిపేసిన గుజరాత్‌, గోద్రా అల్లర్లు, ఇక ఇటీవల యావత్‌ దేశాన్ని ఆ మాటకొస్తే ప్రపంచ దేశాలు చర్చిస్తున్న అవమానకరమైన ”మణిపూర్‌ హింసాత్మక సంఘటనలు” ఆ కోవకు చెందినవే.
ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా, లౌకికదేశంగా పరిగణిస్తున్న మనదేశంలో ఇటీవల కాలంలో మతపరమైన హింసాత్మక ఘటనలు తరచూ దేశవ్యాప్తంగా సంభవిస్తున్న వేళ దేశమంతటా ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా దేశంలో శాంతి భద్రతలు కాపాడవలసిన కేంద్ర ప్రభుత్వం, హింసలు చెలరేగుతున్న రాష్ట్రాల్లో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రజల మధ్య శాంతి భద్రతలు కాపాడాల్సినది పోయి, ఉదాసీనతతో వ్యవహరించి, హింసలను ప్రోత్సహించేటట్లు చేయటం అత్యంత బాధాకరమైన విషయం. అంతేకాదు రాజ్యాంగం ప్రకారం ప్రమాణం చేసిన ప్రభుత్వ పాలకులు ఒక వర్గ ప్రజానీకానికి కొమ్ము కాయడం క్షమించరాని నేరం. ప్రస్తుతం ఇటువంటి పరిస్థితి మణిపూర్‌ ఘటనల్లో స్పష్టంగా కనిపిస్తుంది. అందుచేతనే ”సుప్రీంకోర్టు” కూడా తీవ్రంగా పరిగణిస్తున్న విషయం మనం గమనించాల్సిన అంశం.
మోడీ అధికారంలోకి వచ్చిన 2014 నుంచి నేటి వరకూ కేంద్రంలో ఉన్న ప్రభుత్వం, డబుల్‌ ఇంజన్‌ సర్కారు ఉన్న వివిధ రాష్ట్రాల్లో ఈ కమ్యునల్‌ అల్లర్లు ఎక్కువగా చేసుకున్నాయి. 2016 నుంచి 2020 మధ్య కాలంలో దేశంలో నమోదైన మతపరమైన అల్లర్లు 3400 అని సమాచారం. యన్‌.సి.ఆర్‌.బి నివేదికల ప్రకారం గత ఐదేండ్లుగా దేశవ్యాప్తంగా నమోదైన కమ్యునల్‌ అల్లర్లు 2017లో 723, 2018లో 512, 2019లో 438, 2020లో 857, 2021లో 378 ఈ విధంగా అధికారికంగా గణాంకాలు యూనియన్‌ మినిస్టర్‌ ఆఫ్‌ స్టేట్‌ ఫర్‌ హోం కేంద్ర మంత్రి నిత్యానంద రారు కూడా వెల్లడించారు. ఇక అనధికార హింసలు, దాడులు, దోపిడీలు మనం ఊహించవచ్చు. ముఖ్యంగా దేశంలో అధికారంలో ఉన్న పాలకులు ఒక మతం వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో మైనారిటీలు, గిరిజనులు, బడుగు బలహీన వర్గాల ప్రజలపై అధికార పక్షం అండదండలతో కొందరు రెచ్చిపోయి, హింసాత్మక సంఘటనలు పెచ్చుమీరుతున్నాయి అని అనేక మంది మేధావులు, విశ్లేషణకర్తల అభిప్రాయం. అదే సమయంలో ఎన్‌ఆర్‌సీ, సిఏఏ అనే పేరుతో కొంతమంది ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా దేశంలో ఇటీవల కాలంలో మతపరమైన, కుల, ప్రాంతీయ, భాషా, లింగ వివక్షతల ఆధారంగా అనేక చోట్ల అలజడులు జరుగుతున్నాయి.
ఇకనైనా దేశ ప్రజల్లో ప్రస్తుతం ఉన్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజాస్వామ్య పద్ధతిలో, రాజ్యాంగ ప్రకారం పరిపాలన అందరికీ పారదర్శకంగా అందివ్వాలి. ప్రతిపక్ష పార్టీల నాయకుల సూచనలు సలహాలు తీసుకోవాలి. కానీ అదేమి పట్టించుకోకపోగా మందబలంతో చట్టాలను చేసి ప్రజల మీద రుద్దడం ఏలికలకు సమంజసం అనిపించుకోదు. ప్రజల చేత ఎన్నుకోబడిన పాలకులు ప్రజలకు రక్షణ, భద్రత కల్పించాలి. కానీ వారు ఏమాత్రం ఈ అంశాలను పరిగణనలోకి తీసుకోవడం లేదని మణిపూర్‌ను చూస్తే అర్థం చేసుకోవచ్చు. సమస్యలు శాంతియుతంగా పరిష్కరించాలి. రక్షణ వ్యవస్థ, న్యాయ వ్యవస్థ రాజ్యాంగం ప్రకారం సమన్యాయం అందించాలి. అంతేకాని, అధికారాన్ని ఆసరాగా చేసుకుని, రాజ్యాంగ సంస్థలను, ప్రభుత్వ సంస్థలను తమ ఆధీనంలో ఉంచుకుని, వారికి అనుకూలంగా పాలన చేయరాదు. అలా వ్యవహరించడం వల్లనే ప్రస్తుతం మణిపూర్‌ ఆందోళన పాలకుల స్థాయి దాటి, న్యాయం కోసం సుప్రీంకోర్టుకు చేరింది. ప్రభుత్వాల పనితీరు, డొల్లతనం బయటపడింది. ఇకనైనా పాలకులు రాజ్యాంగ పరిపాలన అందరికీ పారదర్శకంగా అందివ్వాలి. లేనట్లయితే న్యాయస్థానాలే ప్రజలకు ఆశాదీపంగా, హక్కులను కాపాడే దారిదీపాలుగా వెలుగొందుతాయి…
– ఐ.పి.రావు