‘యుద్ధ అనాథ’ల్ని అక్కున చేర్చుకోలేమా?

'యుద్ధ అనాథ'ల్ని అక్కున చేర్చుకోలేమా?కుటుంబ పెద్దను జాతి హితం కోసం కోల్పోయిన కుటుంబాల అనాథలే అసలైన దేశభక్తులుగా పూజించబడాలి. అనాథల్ని అలక్ష్యం చేసిన సమాజంలో అశాంతి నెలకొనవచ్చని మరువరాదు. అనాథó బాలల బంగారు భవిష్యత్తును ఆదిలోనే తుంచరాదు. పిల్లలు దేవుళ్లతో సమానమని నమ్మిన సమాజంలో అనాథóల వెతలకు తావుండ కూడదు. అనాధల ఆక్రందనలు జాతికి శాపాలు, అమానవీయతకు సాక్ష్యాలని గుర్తుంచుకోవాలి. దేశాభివృద్ధిలో యుద్ధ అనాథóల్ని భాగస్వాములు చేస్తూ, మానవీయతను వికసింపచేయాలి.
యుద్ధాలు ఏ స్థాయిలో జరిగిన అది మిగిల్చే విషాదాలు మాత్రం దీర్ఘకాలం పాటు మాన వాళి వెంటాడుతూ పీడిస్తూనే ఉంటాయని నేడు జరుగుతున్న ఇజ్రాయిల్‌ – పాలస్తీనా, ఉక్రెయిన్‌ – రష్యా యుద్ధాలు రుజువు చేస్తున్నాయి. గెలుపోట ములు ఎలా ఉన్నా యుద్ధం ఇరు పక్షాలకు ఆర్థిక నష్టాలను కాకుండా జవాన్లు, సామాన్య జనాలు, పిల్లల మరణాలు, దీర్ఘకాల జబ్బులు, తీవ్ర గాయాలను తలుచుకొని భావోద్వేగ దెబ్బలతో దు:ఖించాల్సిందే. యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన వీరుల కుటుంబాలు అనాధాశ్రమాలుగా మారిపోతున్నాయి. అమరవీరుల కుటుంబాలు పెద్ద దిక్కును కోల్పోయి ఒడువని దు:ఖంతో కన్నీటి సాగరంలో జీవచ్ఛవాల్లా బతుకులు ఈడుస్తుంటారు. కరోనా లాంటి మహావిపత్తుల సమయంలో యుద్ధ అనాథల బతుకులు పుండుపై కారం చల్లినట్లు అవడం చూసాం. యుద్ధాలు, జాతి వివక్ష పోరాటాలు, అంతర్గత సంఘర్షణల్లో ప్రాణాలు కోల్పోయిన వ్యక్తుల కుటుంబాల పిల్లలు అనాథలుగా మిగిలిపోతున్నారు. యుద్ధాలు మిగిల్చిన అనాథలకు చేయూతను ఇవ్వడానికి ప్రతి యేటా జనవరి 6న ‘ప్రపంచ యుద్ధ అనాథల దినం (వరల్డ్‌ డే ఫర్‌ వార్‌ ఆర్ఫన్స్‌)’ నిర్వహిస్తున్నారు. యూనిసెఫ్‌ వివరణ ప్రకారం 18 ఏండ్ల లోపు వయస్సు కలిగిన పిల్లలు తల్లితండ్రులను లేదా ఎవరో ఒక్కరిని కోల్పోయినపుడు వారు అనాథóలుగా పరిగణించబడతున్నారు.
ఫ్రెంచ్‌ సంస్థ ఆలోచనలతో ప్రారంభమైన ప్రపంచ యుద్ధ అనాథల దినం వేదికగా అనాథó కుటుంబాలకు మేమున్నామనే ధైర్యాన్ని నూరి పోయడం, ఆర్థిక చేయూతను అందించడం, ఉద్యోగ ఉపాధుల్లో ప్రాధాన్యత ఇవ్వడం లాంటి సేవలను అందించాలి. రెండు ప్రపంచ యుద్ధాలు మిగిల్చిన విషాదాలు అనంతమైనవి. చరిత్ర చవి చూసిన ఈ యుద్ధాల్లో మిలియన్ల పిల్లలు అనాథలయ్యారు. ప్రతి యేటా యుద్ధ అనాథóల సంఖ్య క్రమంగా తగ్గుతూ నేడు ఏడాదికి 0.7 శాతానికి చేరింది. ప్రపంచవ్యాప్తంగా 1990లో 146 మిలియన్ల అనాథóలు ఉండగా, 2000లో 155 మిలియన్లు, 2015లో 140 మిలియన్ల యుద్ధ అనాథలు (ఆసియాలో 61 మిలియన్లు, ఆఫ్రికాలో 52 మిలియన్లు, లాటిన్‌ అమెరికాలో 10 మిలియన్లు, యూరెప్‌లో 7.3 మిలియన్ల అనాథóలు) ఉన్నారని తేలింది. యుద్ధ అనాథలను సమాజం చిన్న చూపు చూడడం, శ్రమ దోపిడీ చేయడం, సామాజిక భావోద్వేగ వివక్షలకు గురిచేయడం, మానసికంగా కుంగిపోయేలా ప్రవర్తించడం, లైంగిక హింసలకు గురి చేయడం, బడులకు దూరంగా వెట్టి చాకిరీలో ముంచడం లాంటి అమానవీయ చర్యల్లో చిక్కుకొని దుర్భర బతుకులు అనుభవిస్తున్నారు. ‘వార్‌ జోన్ల’లోని అసంఖ్యాక యుద్ధ అనాథల కష్టాలు మరింత వర్ణణాతీతం.
నేడు పాలస్తీనా జనావాసాలపై ఇజ్రాయిల్‌ దాడుల్లో 20వేలకుపైగా పిల్లలు, పౌరులు ప్రాణాలు కోల్పోయారు. యుద్ధ అనాథల్ని అక్కున చేర్చుకోవడం, ఉచిత విద్య వైద్య సదుపాయాలు కల్పించడం, అర్హత కలిగిన అనాథóలకు ఉద్యోగాల్లో ప్రాధాన్యత ఇవ్వడం, మానవీయ కోణంతో వారి కుటుంబాలకు రక్షణ కల్పించడం ప్రభుత్వ, ప్రభుత్వేతర, పౌర సమాజ కనీస బాధ్యతగా భావించాలి. అనాథల వ్యధలున్న సమాజం నరక సమానమని భావిస్తూ అనాథలకు అమ్మనాన్నలుగా, ఆర్థిక వనరులుగా పౌరసమాజం గొడుగు పట్టడానికి వెనకడుగు వేయరాదు. కుటుంబ పెద్దను జాతి హితం కోసం కోల్పోయిన కుటుంబాల అనాథలే అసలైన దేశభక్తులుగా పూజించబడాలి. అనాథల్ని అలక్ష్యం చేసిన సమాజంలో అశాంతి నెలకొనవచ్చని మరువరాదు. అనాథ బాలల బంగారు భవిష్యత్తును ఆదిలోనే తుంచరాదు. పిల్లలు దేవుళ్లతో సమానమని నమ్మిన సమాజంలో అనాథóల వెతలకు తావుండ కూడదు. అనాథల ఆక్రందనలు జాతికి శాపాలు, అమానవీయతకు సాక్ష్యాలని గుర్తుంచుకోవాలి. దేశాబివృద్ధిలో యుద్ధ అనాథల్ని భాగస్వాములు చేస్తూ, మానవీయతను వికసింపచేయాలి.
(06 జనవరి ‘ప్రపంచ యుద్ధ అనాథóల దినం’ )
– బుర్ర మధుసూదన్‌రెడ్డి, 9949700037