కుల దురహంకారాన్ని అంతం చేయలేమా?

ఓవైపు శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ఆకాశమెత్తుకు ఎదుగుతుంటే మరోవైపు సాటి మనిషిని మనిషిలా చూడలేని నీచపు పరిస్థితి సమాజంలో నెలకొంది. ఇంకా కులవివక్ష ఎక్కడుంది? అనేవాళ్లకు ఇటీవల రాష్ట్రంలో జరిగిన ఘటనలే సజీవ సాక్ష్యాలు. బతకడానికి వచ్చి మనల్ని బానిసలుగా చేసిన బ్రిటిషోళ్లపై ఏండ్లుగా పోరాడి సాధించుకున్న దేశం 75ఏండ్ల స్వాతంత్య్రాన్ని కూడా పూర్తి చేసుకుంది. అది దేశ ప్రజల అతిపెద్ద విజయం. ప్రపంచంలోనే అన్ని దేశాలకంటే గొప్పదని చాటుతున్న మన రాజ్యాంగం ఆవిర్భావించి 73ఏండ్ల కు చేరుకుంది. ప్రజల సమైక్య స్ఫూర్తి అభినందనీయం. కానీ అవధులు దాటిన కులవివక్ష, అంటరానితనం, కుల దురహం కారాన్ని నేటికీ అంతం చేయలేక పోవడం శోచనీయం. పల్లె, పట్నం అని తేడాలేకుండా చాపకింద నీరులా వేళ్లూనుకుంటున్న వివక్షను అరికట్టలేమా? అగ్రకుల ఆధిపత్య పెత్తందారీ దుశ్చర్యలను ఐక్యంగా ప్రతిఘటించలేమా? మానవ మనుగడకు ఆటంకంగా నిలుస్తున్న ఈ అస్పృశ్యతను ఎదుర్కోలేమా? ఈ ప్రశ్నలన్నీ పౌరులుగా మనకు మనం వేసుకోవాల్సిన ప్రశ్నలు. కుల దురహంకార దాడులు, హత్యలు, పండుగల్లో వివక్షలు, అంబేద్కర్‌ విగ్రహ నిర్మాణాల్లో అడ్డగింపులు, బానామతి పేరుతో హింసలు. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ మూడునెలల్లోనే వరుస సంఘటనలు. ఇవన్నీ ఎవరు నిరోధించాలి? వీటికి అడ్డుకట్ట వేసేదెవరు? ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం1989, పౌరహక్కుల పరిరక్షణ చట్టం 1955 ఉన్నా అవి పేరుకు మాత్రమేనని ఈ ఘటనలు రుజువు చేస్తున్నాయి.
జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం పొచ్చన్నపేట గ్రామానికి చెందిన దళిత విశ్రాంత ఎంపీడీఓ నల్ల రామకృష్ణయ్య మండలంలో గోపాల్‌నగర్‌ సర్వే నెం.174లో అక్కడి సీపీఐ(ఎం) నాయకత్వంలో పేదలు గుడిసెలు వేసుకున్నారు. ప్రభుత్వ భూమి అన్యాక్రాంత మవుతుంటే సమాచార హక్కు కార్యకర్తగా ఆ భూముల పరిరక్షణ కోసం ఆయన నికరంగా నిలబడ్డాడు. ఆ భూములను కబ్జా చేస్తున్న అక్కడి అధికార పార్టీ జెడ్పీటీసీ గిరబోయిన అంజయ్య రూ.10లక్షలు సుఫారీ ఇచ్చి రామకృష్ణయ్యను కిడ్నాప్‌ చేయించి అతికిరాతకంగా హత్యచేయించి కాలువగట్లల్లో పడేశాడు. చంపిన రోజు సాయంత్రం బాణాసంచా కాల్చి పండుగ చేసుకున్నారు. జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి కుడిభుజం లాగా ఉండే జెడ్పిటీసీ చేసిన ఈ హత్య వెనుక ఎమ్మెల్యే హస్తం ఉందని సర్వత్రా చర్చ జరుగుతున్నది. మరో ఘటనలో వరంగల్‌ జిల్లా నర్సంపేట మండలం ఇటుకాలపల్లి గ్రామంలో రజక యువకుడు ముదిరాజ్‌ యువతిని ప్రేమించి వివాహమాడినందుకు ఆ వివాహానికి సహకరించిన తన నలుగురు స్నేహితుల ఇండ్లకు నిప్పుపెట్టి ద్వంసం చేశారు. మారణాయుధాలతో వెళ్లిన వారిలో గ్రామ అధికార పార్టీకి చెందిన సర్పంచ్‌ కీలకపాత్ర పోషించాడు. ఇద్దరు బీసీల మధ్య జరిగిన కులాంతర వివాహమైనప్పటికీ ఇంతటి దౌర్జన్యం జరగడం గమనార్హం.
సిద్దిపేట జిల్లా జగదేవ్‌పూర్‌ మండలం తిమ్మాపూర్‌ గ్రామంలో దశాబ్ది ఉత్సవాలలో భాగంగా చెరువుల పండుగలో దళితులు తమతో కలిసి భోజనం చేయొద్దని గ్రామ పెత్తందారులు హుకుం జారీచేశారు. అక్కడ జరిగిన వివక్షపై దళిత యువకులు ప్రతిఘటించారు. దాంతో కక్ష పెంచుకున్న పెత్తందారులు గ్రామంలోని మంగలి షాపు వ్యక్తిని ‘ఎస్సీలకు షాపులో కటింగ్‌ చేయొద్దు నీకు టైం ఉంటే చెట్టు కింద చేయి’ అని సదరు గ్రామపెద్దలు ఆదేశించారు. దీంతో కటింగ్‌ కోసం సెలూన్‌ వద్దకు వెళ్లిన దళిత యువకులు నిలదీసి ‘కటింగ్‌ ఎందుకు చెయ్యవు’ అని గట్టిగా వాదించారు. దీంతో సెలూన్‌ వ్యక్తి గ్రామపెద్దలు నిర్ణయించారని బదులిచ్చాడు. దీనిపై గ్రామంలో కేవీపీఎస్‌ మరికొన్ని సంఘాలు కలిసి దళితులను సమీకరించి దశలవారి పోరాటాలు నిర్వహించారు. జిల్లా కలెక్టర్‌, జిల్లా ఎస్పీ, ఆర్‌డీఓ, స్థానిక పీఎస్‌లో కూడా ఫిర్యాదు చేశారు. ‘చలో తిమ్మాపూర్‌’ కార్యక్రమం నిర్వహించారు. ఫలితంగా 8మందిపై కేసు నమోదు చేసి వారిని రిమాండ్‌ చేశారు. ఏసీపీ, ఆర్డీవో, సీఐ మరికొంత అధికారులు గ్రామంలోకి వచ్చి అందరిని కూర్చోబెట్టి కేసులు ఉంటాయి, భవిష్యత్‌లో వివక్ష జరగదని హామీ ఇవ్వడంతో ఆందోళనలు విరమించబడ్డాయి.
సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం కొల్కూరు గ్రామంలో మంత్రాల నెపంతో ఇద్దరు దళిత దంపతులను గ్రామం నడిబొడ్డున చెట్లకు కట్టేసి కొట్టడమే కాకుండా హత్య చేయడానికి ప్రయత్నించారు. మరో ముదిరాజ్‌ కుటుంబానికి చెందిన వ్యక్తులను కూడా ఇదే విధంగా చేయడానికి ప్రయత్నించగా వారు పరారయ్యారు. పోలీసులకు కంప్లైంట్‌ చేయవద్దని, ఎవరు ఫొటోలు, వీడియోలు తీయొద్దని గ్రామంలో కొంతమంది పెత్తందారులు హుకుం జారీ చేశారు. ఇది సామాజిక మాధ్యమాలలో ప్రసారం కావడంతో కెవిపిఎస్‌ నాయకత్వం జోక్యం చేసుకొని గ్రామంలో పర్యటించి ఆ బాధితులను హాస్పిటల్‌లో చేర్పించి జిల్లా అధికారులకు వినతి పత్రాలిచ్చి, గ్రామంలో మండల కేంద్రంలో దశలవారి పోరాటాలు చేయగా 11మందిని అరెస్టు చేశారు. బాధితులు ధైర్యంగా ప్రస్తుతం అదే గ్రామంలో నివసిస్తున్నారు. మేడ్చల్‌ జిల్లా మేడ్చల్‌ మండలం రావెల్‌ కోల్‌ గ్రామంలో బోనాల పండుగ సందర్భంగా దళితులు బోనం చెల్లించ డానికి రాగా గ్రామ పెత్తందారులు అడ్డుకున్నారు. ‘మీరు అన్ని కులాల తర్వాత ఆఖరిలో బోనం చెల్లించుకోవాలి. మీ బోనమిక్కడ చెల్లించనీయం’ అంటూ అడ్డుకున్నారు. దీనిపై గ్రామ దళిత యువకులు తిరుగుబాటు చేశారు. పత్రికల్లో రావడంతో మరుసటిరోజే గ్రామ పెత్తందారులు దళితులకు క్షమాపణలు చెప్పి భవిష్యత్తులో జరగనీయబోమని రాజీ కుదుర్చుకున్నారు.
ఇవన్నీ కూడా ప్రసార, సామాజిక మాధ్యమాల ద్వారా వెలుగులోకి వచ్చినవే. ఇంకా వెలుగులోకి రానివి మరెన్నో. ఇంతటి వివక్ష సమాజాన్ని పట్టిపీడిస్తుంటే ప్రభుత్వం, పోలీసు ఉన్నతాధికారులు పట్టించుకున్న దాఖలాలు లేవు. కేవీపీఎస్‌ జోక్యం చేసుకుని పోరాడితే తప్ప బాధితులకు సరైన న్యాయం జరగట్లేదు. చట్టం ముందు అందరూ సమానులేనని, రాజ్యాంగం ప్రకారం పౌరులు స్వేచ్ఛగా జీవించాలని హక్కులు చెబుతున్నా అవి కాలరాయబడిపోతున్నాయని చెప్పడానికి పైన జరిగిన ఘటనలే ఉదాహరణలు. ఆధునికయుగంలోనూ ఆటవిక చర్యలు పెరగడం, దాన్ని కులదురహంకారం ప్రేరేపించడం పట్ల పౌరసమాజం ఇప్పటికైనా స్పందించాలి. అవసరమైన చోట ప్రతిఘటించాలి. ‘మనమంతా హిందువులం, గంగా జల బిందువులం, బంధువులం’ అని రోజు బాకా ఊదే సంఫ్‌ు పరివారం, మతోన్మాద శక్తులు ఏ ఒక్కనాడు వీటిని ఖండించిన పాపాన పోలేదు. వీరికి మద్దతుగా నిలిచిన దాఖలాలు అంతకన్నా లేవు. పైగా తిమ్మాపూర్‌లో కులవివక్ష, అంటరానితనం జరిగితే ప్రతిఘటించిన దళిత యువకులకు వ్యతిరేకంగా సామాజిక మాధ్య మాలలో ఏబీవీపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్తలు తప్పుడు వీడియోలు ప్రసారం చేశారు. కాషాయ పరివారమంటే అగ్రకుల పెత్తందారుల పక్షమేనని వారు రుజువు చేశారు. ఇలాంటి ఘటనలపై ప్రభుత్వం దృష్టి సారించాలి. కులవివక్ష జరగకుండా గ్రామాల్లో సామాజిక చైతన్య సభలు నిర్వహించాలి. ప్రజల్లో సమానత్వ భావనను పెంపొందించాలి. మనుషులందరూ సమానమేనని చాటాలి. కులవివక్షను అరికట్టిన రాష్ట్రంగా దేశంలో మన తెలంగాణ ముందు వరుసలో నిలవాలి.

టి. స్కైలాబ్‌బాబు
9177549646