– భవిష్యత్తు కమ్యూనిజానిదే
– సీపీఐ(ఎం) సీనియర్ నేత కాసాని ఐలయ్య
నవతెలంగాణ-కొత్తగూడెం
పెట్టుబడిదారి విధానం విజయాలు తాత్కాలికమని, అవి ఎల్లకాలం ప్రజల అభివృద్ధికి ఉపయోగపడదని, అంతిమంగా భవిష్యత్తు కమ్యూనిజానిదేనని సీపీఐ(ఎం) సీనియర్ నేత, కొత్తగూడెం నియోజకవర్గ కన్వీనర్ కాసాని ఐలయ్య అన్నారు. శుక్రవారం స్థానిక మంచి కంటి భవన్‌లో కొత్తగూడెం టౌన్ కమిటీ నిర్వహిస్తున్న రాజకీయ శిక్షణా తరగతులను ప్రారంభిస్తూ ఆయన మాట్లాడారు. కమ్యూనిస్టు పార్టీల బలం ఎన్నికల్లో వచ్చిన ఓట్లు, సీట్లు ఆధారంగా ఉండదని కమ్యూనిస్టు పార్టీ నిర్వహించే పోరాటాలు అందులో పాల్గొనే ప్రజలు, ప్రజా సమస్యలపై సాధించిన విజయాలు కొలబద్దగా కమ్యూనిస్టు పార్టీ బలం ఉంటుందన్నారు. ఎన్నికలు, ఎన్నికల్లో వచ్చే సీట్లు కమ్యూనిస్టులకు పోరాట సాధనాలు మాత్రమేనని అవే సర్వస్వంగా కమ్యూనిస్టులు పనిచేయరని, అంతిమంగా దోపిడీ వ్యవస్థను నాశనం చేసి కష్టజీవుల రాజ్యం తీసుకురావడమే కమ్యూనిస్టుల లక్ష్యమని, ఆ లక్ష్యం కోసం అనేక త్యాగాలు చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. ప్రజల తరఫున పోరాడటానికి, త్యాగాలు చేయడానికి కమ్యూనిస్టు కార్యకర్తలు సిద్ధం కావాలని కాసాని పిలుపు నిచ్చారు. బూర్జువా రాజకీయ పార్టీలకు అధికారం పదవుల మీద ఉన్న ధ్యాస ప్రజల మీద ఉండదని, ఏ విధంగానైనా ఎన్నికల్లో గెలవాలని ఆలోచన తప్ప ప్రజలు ప్రజా సమస్యలు వారికి పట్టవని ఆయన అన్నారు. తాత్కాలికంగా బూర్జువ రాజకీయాలు విజయం సాధించిన అంతిమంగా ప్రజల తరఫున ప్రజా సమస్యలపై నికరంగా పోరాడేది కమ్యూనిస్టులు మాత్రమేనని ఆయన గుర్తు చేశారు. తాత్కాలిక అపజయాలు ఎదురైనప్పటికీ అంతిమ విజయం కమ్యూనిస్టులదేనని, అదే విశ్వాసంతో కార్యకర్తలు పనిచేయాలని ఆయన పిలుపు నిచ్చారు. అనంతరం ”మతం-మతోన్మాదం సీపీఐ(ఎం) వైఖరి అనే అంశంపై పార్టీ రాష్ట్ర రాజకీయ, విద్యా విభాగం సబ్ సమిటీ సభ్యులు బండారు రమేష్ క్లాస్ బోధించారు. ”పార్టీ నిర్మాణం-పనిపద్ధతులు అనే అంశం క్లాస్‌ను పట్టణ కార్యదర్శి లిక్కి బాలరాజు బోధించారు. ప్రిన్సిపల్‌గా భూక్యారమేష్ వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో టౌన్ కార్యదర్శి లిక్కి బాలరాజు, జిల్లా కమిటీ సభ్యులు భూక్య రమేష్, టౌన్ కమిటీ సభ్యులు డి.వీరన్న, సందకూరి లక్ష్మి, నందిపాటి రమేష్, కూరపాటి సమ్మయ్య, గాజుల రాజారావు, వై.వెంకటేశ్వరరావు, రజిత, విజయలక్ష్మి, సువర్ణ, మీనా, రమా, నాగదుర్గ తదితరులు పాల్గొన్నారు.