క్యాపిటల్స్‌ జోరు సాగేనా?

క్యాపిటల్స్‌ జోరు సాగేనా?– నేడు కోల్‌కతతో ఢిల్లీ పోరు
– పంత్‌, పృథ్వీ షాలపై ఫోకస్‌
నవతెలంగాణ-విశాఖపట్నం
ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) 17వ సీజన్‌లో అజేయంగా నిలిచిన జట్లు రాజస్థాన్‌ రాయల్స్‌, కోల్‌కత నైట్‌రైడర్స్‌. ఇక ఈ సీజన్లో ప్రత్యర్థి గడ్డపై విజయ ఢంకా మోగించిన జట్లు సైతం ఈ రెండే. కోల్‌కత నైట్‌రైడర్స్‌ తొలి రెండు మ్యాచుల్లో విజయాలతో జోరుమీదుండగా.. తొలి రెండు మ్యాచుల్లో నిరాశపరిచినా బలమైన చెన్నై సూపర్‌కింగ్స్‌పై అదిరే విజయంతో ఢిల్లీ క్యాపిటల్స్‌ బోణీ కొట్టింది. ప్రత్యామ్నాయ సొంతగడ్డ విశాఖపట్నంలో చివరి మ్యాచ్‌ ఆడనున్న ఢిల్లీ క్యాపిటల్స్‌ ఇక్కడ అజేయ రికార్డుతో ఫిరోజ్‌ షా కోట్లకు చేరుకోవాలని రిషబ్‌ పంత్‌ సేన తపిస్తోంది. కోల్‌కత నైట్‌రైడర్స్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌ మ్యాచ్‌ నేడు రాత్రి 7.30 గంటలకు ఆరంభం కానుంది.
ఆ ఇద్దరిపై ఫోకస్‌ : రోడ్డు ప్రమాదంలో ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడి రిషబ్‌ పంత్‌ పునరాగమనంలో సూపర్‌కింగ్స్‌పై మెరుపు అర్థ సెంచరీతో కదం తొక్కాడు. యువ బ్యాటర్‌ పృథ్వీ షా సైతం డెవిడ్‌ వార్నర్‌ జతగా దంచి కొట్టాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌ విజయంలో రిషబ్‌ పంత్‌, పృథ్వీ షా కీలక పాత్ర పోషించారు. తొలి రెండు మ్యాచుల్లో పృథ్వీ షా బెంచ్‌కు పరిమితం అయ్యాడు. చైనామన్‌ స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌, అక్షర్‌ పటేల్‌ మాయజాలం తో నైట్‌రైడర్స్‌ను కట్టడి చేస్తారనే నమ్మకం క్యాపిటల్స్‌ శిబిరంలో ఉంది. కానీ కోల్‌కత డ్రెస్సింగ్‌రూమ్‌లోఅండ్రీ రసెల్‌ ఉన్నాడనే నమ్మకం ఎక్కువగా కనిపిస్తోంది. వెంకటేశ్‌ అయ్యర్‌, ఫిల్‌ సాల్ట్‌లకు తోడు సునీల్‌ నరైన్‌, శ్రేయస్‌ అయ్యర్‌ సైతం ఫామ్‌ అందుకోవటం కోల్‌కత నైట్‌రైడర్స్‌కు శుభ పరిణామం. ఇక వేలంలో రికార్డు ధర దక్కించుకున్న మిచెల్‌ స్టార్క్‌ వరుస మ్యాచుల్లో విఫలమయ్యాడు. రూ.24 కోట్ల పేసర్‌ నుంచి కోల్‌కత మెరుగైన ప్రదర్శన ఆశిస్తోంది. డెవిడ్‌ వార్నర్‌, మిచెల్‌ మార్ష్‌లు ఢిల్లీ క్యాపిటల్స్‌కు.. రింకూ సింగ్‌, వరుణ్‌ చక్రవర్తిలు కోల్‌కత నైట్‌రైడర్స్‌కు కీలకం కానున్నారు.