– బారీకేడ్లు ధ్వంసం.. కారులో మాజీ ఎమ్మెల్యే కుమారుడు..!
– సమగ్ర విచారణకు సీపీ ఆదేశం
నవతెలంగాణ-బంజారాహిల్స్
హైదరాబాద్ పంజాగుట్టలోని ప్రజాభవన్ ముందు ఓ కారు బీభత్సం సృష్టించిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఈ నెల 24న తెల్లవారుజామున కారు అతి వేగంతో వచ్చి ప్రజాభవన్ బారీకేడ్లను ఢకొీట్టింది. దాంతో బారీకేడ్లు ధ్వంసం కాగా కారు ముందు భాగం కూడా దెబ్బతింది. ఈ మేరకు కారును నిర్లక్ష్యంగా నడిపినందున అబ్దుల్ ఆసిఫ్ అనే యువకుడిని పంజాగుట్ట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ సమయంలో కారులో ముగ్గురు అమ్మాయిలు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ప్రమాదం సమయంలో బోధన్‌కు చెందిన మాజీ ఎమ్మెల్యే కుమారుడు కారు నడిపినట్టు ఆరోపణలు వస్తున్నాయి. కారు ఆగగానే అతను పారిపోయినట్టు తెలుస్తోంది. అయితే ఈ కేసులో అతన్ని తప్పించి మాజీ ఎమ్మెల్యే ఇంటి పనిమనిషి అబ్దుల్ ఆసిఫ్‌ను నిందితుడిగా చేర్చినట్టు పోలీసులపై విమర్శలు వస్తున్నాయి. దాంతో ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేసి నివేదిక ఇవ్వాలని పంజాగుట్ట పోలీసులను నగర సీపీ శ్రీనివాస్‌రెడ్డి ఆదేశించారు. కాగా, అబ్దుల్ ఆసిఫ్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు. రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు పేర్కొన్నట్టు తెలిసింది. కాగా, చివరకు ఈ కేసులో బోధన్ మాజీ ఎమ్మెల్యే కుమారుడు సోహెల్ అలియాస్ రహేలిని ప్రధాన నిందితుడిగా చేర్చినట్టు సమాచారం. ర్యాష్ డ్రైవింగ్ చేసి బారీకెడ్లను ఢకొీట్టింది సోహెల్ అని పోలీసులు తేల్చారు. ఈ కేసు నుంచి తప్పించుకునేం దుకే అబ్దుల్ ఆసిఫ్‌ను లొంగిపోవా ల్సిందిగా సోహెల్ మొదటగా ఆదేశించాడు. సోహెల్ ఆదేశాలతో పోలీస్ స్టేషన్‌లో అబ్దుల్ ఆసిఫ్ లొంగిపో యాడు. పంజాగుట్ట వద్ద ప్రమాదం జరగానే మరొక కారుని తెప్పించుకొని సోహెల్ అక్కడి నుంచి పారిపోయాడు. పారిపోయిన సోహెల్ కోసం పంజాగుట్ట పోలీసులు గాలిస్తున్నారు. సోహెల్‌పై కేసు నమోదు చేసినట్టు తెలిసింది.
పంజాగుట్ట ఇన్‌స్పెక్టర్‌కు అస్వస్థత
ఇదిలా ఉండగా, పంజాగుట్ట ఇన్‌స్పెక్టర్ దుర్గారావు అస్వస్థతకు గురికావడంతో అతన్ని బంజారాహిల్స్‌లోని కేర్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్టు సమాచారం. మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు కేసు వ్యవహారంలో సీఐ పాత్రపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలోనే అతను తీవ్ర మానసిక ఒత్తిడికి గురైనట్టు తెలుస్తోంది.