సన్‌సిటీ వద్ద కారు బీభత్సం

– వాకింగ్‌కు వెళ్లిన తల్లీకూతురిని ఢకొీట్టిన కారు
– అక్కడికక్కడే ఇద్దరు మృతి
– మరో ఏడుగురికి తీవ్ర గాయాలు
నవతెలంగాణ-గండిపేట్‌
రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం బండ్లగూడ సన్‌సిటీ వద్ద కారు బీభత్సం సృష్టించింది. కారు డ్రైవర్‌ నిద్రమత్తులో అతివేగంగా డ్రైవ్‌ చేయడంతో మార్నింగ్‌ వాకింగ్‌కు వెళ్లిన తల్లీకూతుళ్లను కారు బలంగా ఢకొీట్టింది. దాంతో వారు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. నార్సింగి ఎస్‌ఐ సతీష్‌, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదర్షాకోట్‌లోని శాంతినగర్‌కు చెందిన తల్లీ కూతుళ్లు అనురాధ (48), మమత (26) ఇద్దరూ మంగళవారం ఉదయం వాకింగ్‌కు వెళ్లారు. లంగర్‌హౌజ్‌ నుంచి ఆప్పా వైపు వెళ్తున్న కారు.. అప్పా రేడియల్‌ రోడ్డుపై టర్నింగ్‌ వద్ద అదుపు తప్పి వాకింగ్‌ చేస్తున్న తల్లీకూతుళ్లను ఢకొీట్టింది. ఈ ఘటనలో తల్లీకూతురు అక్కడికక్కడే మృతిచెందారు. ఏడుగురు గాయపడగా వారిని స్థానిక ప్రయివేట్‌ ఆస్పత్రికి తరలించారు. కారు డ్రైవర్‌ నిద్రమత్తులో ఉండటంతో ఈ ఘటన జరిగినట్టు పోలీసులు గుర్తించారు. మృతుల్లో అనురాధ గృహిణి కాగా ఆమె కూతురు మమత బెంగుళూరులో సాప్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేస్తోంది. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియాకు తరలించారు. ఘటనా స్థలం నుంచి పరారైన కారు డ్రైవర్‌ను పోలీసులు సాయంత్రం పట్టుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.