గుండె జబ్బుల నివారణకు కార్డియాక్‌ రిహాబ్‌

– రిస్క్‌ గ్రూపునకు ఉపయోగపడుతున్న వైనం
– జబ్బుకు గురైనా రిహాబ్‌తో మళ్లీ సాధారణ జీవితం
– దేశంలోనే హైదరాబాద్‌ కేంద్రంగా…
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
గుండెను పదిలంగా చూసుకోవాలని పెద్దలు చెబుతుంటారు. శరీరంలో కీలకమైన ఈ అవయవం లబ్‌ డబ్‌ శబ్దానికి బదులుగా పదే పదే ఆటుపోటులకు గురవుతుంటుంది. మారిన జీవనశైలి, ఒత్తిడి గుండెపై పెను ప్రభావం చూపిస్తున్నదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా హృద్రోగాలపై ప్రజలకు అవగాహన కల్పించే ఉద్దేశంతో ప్రతి ఏడాది సెప్టెంబర్‌ 29న ప్రపంచ గుండె దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఈ ఏడాదికిగాను ‘గుండెను ఉపయోగించుకో… గుండెను తెలుసుకో’ అనే అంశాన్ని ఎంపిక చేశారు. ప్రపంచవ్యాప్తంగా నాన్‌ కమ్యూనికేబుల్‌ డిసీజెస్‌ (అసాంక్రమిత వ్యాధులు) పెరిగిపోతుండగా అందులో గుండెపోటుతో మరణిస్తున్న వారి సంఖ్య అధికంగా ఉంటున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం ఈ జబ్బులు వచ్చిన తర్వాత దానికి చికిత్స, రకరకాల శస్త్రచికిత్సలు అందుబాటులో ఉన్నాయి. గుండె జబ్బులు రాకుండా నివారణకు జీవనశైలిని, ఆహారపు అలవాట్లను మార్చుకోవడం, తగిన వ్యాయామం వంటివి నిపుణులు సూచిస్తున్నారు. అయితే గుండె పంపింగ్‌ సామర్థ్యాన్ని పెంచడం ద్వారా భవిష్యత్తులో గుండె జబ్బులు రాకుండా నివారించడం, ఇది వరకే గుండె జబ్బుల బారిన పడి ఉంటే వారి గుండె బలాన్ని పెంచేందుకు కార్డియాక్‌ రిహాబ్‌ దోహదం చేస్తున్నది. భారతదేశంలో ఉన్న ఒకే ఒక్క కార్డియాక్‌ రిహాబ్‌ హైదరాబాద్‌లో ఉండడం గమనార్హం. ప్రస్తుతం ప్రయివేటుగా అందుతున్న ఈ సేవలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సహించి పేద ప్రజలకు అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని కార్డియాక్‌ రిహాబ్‌ ఫిజిషియన్‌ డాక్టర్‌ మురళీధర్‌ బాబీ కోరారు. కార్డియాక్‌ రిహాబ్‌ దాదాపు మూడు నెలల పాటు కొనసాగుతున్నది. కొన్ని సందర్భాల్లో కొద్ది కాలం ఎక్కువ కూడా రిహాబ్‌ చేస్తుంటారు. ఇప్పటికే గుండెపోటుకు గురైన వారికి, శస్త్రచికిత్స చేసుకున్న వారికి రిహాబ్‌ ఇచ్చిన తర్వాత ఇంటికి పరిమితం అయిన స్థితి నుంచి ఏకంగా పరుగుపందాల్లో కూడా పాల్గొంటుండటం విశేషం. ప్రస్తుతం గుండె జబ్బులు వయస్సుతో నిమిత్తం లేకుండా అందరిని భయపెడుతున్న తీరు తెలిసిందే. ఈ నేపథ్యంలో రిహాబ్‌ కూడా అన్ని వయస్సుల వారికి ఉపయోగపడుతుండటం గమనార్హం. గుండె మార్పిడి చేయించుకోవాలని సూచించిన రోగులు మొదలు బైపాస్‌ సర్జరీ, ఇతరత్రా గుండె సంబంధిత వ్యాధులు కలిగిన వారు కూడా రిహాబ్‌ చేసుకుంటూ కొత్త జీవితాన్ని గడుపుతున్నారు. జబ్బు రాకమునుపు మాదిరిగా తమ విధులకు వెళుతూ ఆశ్చర్యం కలిగిస్తున్నారు. సాధారణంగా మధుమేహం, హైపర్‌ టెన్షన్‌, అధిక కొలెస్ట్రాల్‌, గుండె జబ్బులు కలిగిన కుటుంబ చరిత్ర, ఒత్తిడితో కూడిన జీవితాన్ని గడిపే వారు ఎక్కువగా గుండెపోటుకు గురయ్యే ప్రమాదంలో ఉంటారు. ఇలాంటి వారు హార్ట్‌ ఆటాక్స్‌ బారిన పడకుండా ముందస్తు జాగ్రత్తగా రిహాబ్‌ చేసుకుంచే మంచిది. తద్వారా వారి భవిష్యత్‌ గుండె జబ్బులను నివారించుకోవడమే కాకుండా ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడే అవకాశమున్నది.

డాక్టర్లు అర్థం చేసుకోవాలి డాక్టర్‌ మురళీధర్‌ బాబీ
కార్డియాక్‌ రిహాబ్‌ ఇస్తున్న ఫలితాలను కార్డియాలజిస్టులు, కార్డియో థొరాసిక్‌ సర్జన్లు, ఫిజిషియన్లు, ఇతర డాక్టర్లు అర్థం చేసుకోవాలని కార్డియాక్‌ రిహాబ్‌ స్పెషలిస్ట్‌ డాక్టర్‌ మురళీధర్‌ బాబీ సూచించారు. హృద్రోగుల్లో వస్తున్న మార్పును గమనించాలని కోరారు. రిహాబ్‌ గుండె జబ్బులతో పాటు ఇతర జబ్బుల తీవ్రతను తగ్గిస్తున్న విషయాలు ఆయా కేసుల విషయంలో గమనించినట్టు తెలిపారు. మరిన్ని వివరాల కోసం https://cardiacrehab.com/ లో సంప్రదించాలని సూచించారు.