– రైల్వేలో మొబైల్ అప్లికేషన్ ప్రారంభం
నవతెలంగాణ -హైదరాబాద్
ప్రయాణికుల భద్రత కోసం తీసుకొంటున్న చర్యలలో భాగంగా గురువారం పాన్-ఇండియా ‘సంరక్ష’ మొబైల్ అప్లికేషన్ ప్రారంభించారు. భారతీయ రైల్వేలోని ఫ్రంట్‌లైన్ భద్రతా కేటగిరీ సిబ్బంది సామర్థ్యాన్ని పెంచడం ద్వారా రైల్వే భద్రతను మెరుగుపరచడం ఈ మొబైల్ అప్లికేషన్ యొక్క ముఖ్య ఉద్దేశంగా దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఆపరేషన్స్ బిజినెస్ డెవలప్‌మెంట్ సభ్యులు రవీందర్ గోయల్ భారతీయ రైల్వేలోగల అన్నిప్రధాన కార్యాలయాలకు సంబంధించిన ప్రిన్సిపల్ చీఫ్ ఆపరేషన్స్ మేనేజర్లు, ప్రిన్సిపల్ చీఫ్ కమర్షియల్ మేనేజర్లు, డివిజనల్ రైల్వేమేనేజర్లు ఇతర అధికారుల సమక్షంలో న్యూఢిల్లీ నుంచి వీడియోకాన్ఫరెన్స్ ద్వారా సంరక్ష మొబైల్ అప్లికేషన్‌ను ప్రారంభించారు. ఈ అప్లికేషన్‌ను 2013 బ్యాచ్ ఐఆర్‌టీఎస్ ఆఫీసర్ దిలీప్‌సింగ్ రూపొందించారు. ఈ సందర్భంగా నాగ్‌పూర్ డివిజన్ రైల్వే మేనేజర్ నమితా త్రిపాఠి పైలట్ ప్రాజెక్ట్‌ను నాగ్‌పూర్ డివిజన్‌లో అమలు చేస్తూ ఈ ప్రాజెక్టు పనితీరుపై మిగతా అధికారులకు అవగాహన కల్పించారు. ఈ ప్రాజెక్టును ప్రస్తుతం రైల్వే బోర్డు భారతీయ రైల్వేలోని అన్నిజోన్లల్లో మొదట ఎంపిక చేసిన 16 డివిజన్లల్లో ఈ యాప్‌ను ప్రారంభించాలని నిర్ణయించింది. దక్షిణ మధ్య రైల్వేలో ఈ సంరక్ష మొబైల్ అప్లికేషన్ ఉపయోగించి భద్రతా కార్యక్రమాలను పటిష్టంగా అమలు చేయడానికి హైదరాబాద్ డివిజన్ ఎంపిక చేశారు. ఈ అప్లికేషన్ సమాచార సాంకేతికత మేళవింపుతో భవిష్యత్తులో రైల్వే ఉద్యోగుల శిక్షణ, సామర్థ్యం పెంపునకు సమర్థవంతమైన కత్రిమ మేధస్సు(ఏఐ) డేటా అనలిటిక్స్ భారతీయ రైల్వే యొక్క డొమైన్ పరిజ్ఞానాన్ని అనుసంధానిస్తుంది. ఇది స్మార్ట్ లెర్నింగ్, ఫీడ్‌బ్యాక్ మెకానిజంను కలిగి ఉంటుందని అధికారులు తెలిపారు.