– సంరక్షణ చర్యలతోనే పంటల సాగు సాధ్యం
– తాండూరు వ్యవసాయ కంది పరిశోధన కేంద్రం శాస్త్రవేత్త సుధారాణి
నవతెలంగాణ-తాండూరు
పంటల సాగులో రైతులు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలని తాండూరు వ్యవసాయ కంది పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్త సుధారాణి అన్నారు. ప్రస్తుతం కురుస్తున్న అధిక వర్షాల నుంచి పంటల సంరక్షణకు చేపట్టాల్సిన యాజమాన్య పద్ధతులు వివరించారు. భారీ వర్షాలు కురిసిన ప్రాంతాల్లో పొలం నుంచి మురుగు నీటిని తీసివేయాలని సూచించారు. రాబోవు మూడు రోజులలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున పంట పొలాల్లో మందులను పిచికారి చేయడం తాత్కాలికంగా వాయిదా వేయాలన్నారు. ఉరుములు, మెరుపులతో కూడిన వర్ష సూచనలున్నందున రైతులు విద్యుత్ స్థంబాలు, విద్యుత్ తీగెలు, చెరువులు, నీటి కుంటలకు దూరంగా ఉండాలన్నారు. రాష్ట్రంలో అక్కడక్కడ వివిధ జిల్లాలలో వర్షాలు పడే సూచన ఉన్నందున రైతులు చెట్లకింద నిలబడొద్దని సూచించారు. పశువులు, గొర్రెలు, మేకలను చెట్ల కింద ఉంచవ్దదని తెలిపారు.
వరినీరు సంవృద్ధిగా ఉన్న ప్రాంతాల్లో రైతులు స్వల్పకాలిక (120-125 రోజుల) వరి రకాల నారుమళ్లు జులై 31వ తేదీ వరకు పోసుకోవడానికి అనువైన సమయమన్నారు. 30 నుంచి 25 రోజుల వయస్సు ఉన్న మధ్యకాలిక స్వల్పకాలిక వరి రకాలను నాటు పెట్టుకోవాలని తెలిపారు. దీర్ఘకాలిక వరి రకాల నారు భాగా ముదిరి (50రోజుల వయస్సు) ఆలస్యంగా నాటినప్పుడు ఆకు చివరలను తుంచి వేసి కుదురుల సంఖ్యను పెంచి కుదురుకు 6 నుంచి 8 మొక్కల చొప్పున నాటువేయాలని తెలిపారు. నత్రజని ఎరువులను సిఫారసు కంటే 25శాతం పెంచి మూడు దఫాలుగా గాక రెండు దఫాలుగా అంటే 70శాతం నాటేసమయంలో మిగతా 30శాతం అంకురం దశలో వేసుకోవాలన్నారు. వరి నాట్లు వేసుకునే వారం రోజుల ముందు ఎకరాకు సరిపోయే నారుమడికి 800 గ్రా. కార్బోఫ్యూరాన్ 3సిజి గుళికలను ఇసుకలో కలిపి చల్లి నట్లయితే ప్రధాన పొలంలో పంటను 15-20 రోజుల వరకు కొన్ని రకాల పురుగుల నుంచి కాపాడుకోవచ్చన్నారు. ఇప్పటివరకు నార్లు పోయని రైతాంగం, వర్షాలను సద్వినియోగించుకుని, పొలాలను దమ్ము చేసి వరి పంటను నేరుగా విత్తే పద్ధతలో విత్తుకోవడంతో సమయం, పెట్టుబడి ఆదా చేసుకోవచ్చన్నారు. నాటు పెట్టిన తర్వాత ప్రతీ 2మీటర్లకు కాలిబాటను తీయటం వలన గాలి వెలుతురూ బాగా ప్రసరించడంతో బాటు సుడిదోమ ఉదృతిని నివారించవచ్చన్నారు. అదేవిధంగా రైతులు ఎరువులు, పురుగు మందులు పంటకు అందించడానికి సులువుగా ఉంటుందన్నారు. ముందస్తు చర్య నివారణ భాగంగా ఎకరానికి 10 కిలోల కార్బోఫ్యూరాన్ 3 సీజి గుళికలను నాటిన 10 నుంచి 15 రోజుల మధ్య వేసుకోవడం ద్వారా కాండం తొలుచు పురుగు, ఉల్లి కోడును నివారించుకోవచ్చన్నారు. పత్తి ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు తగ్గిన తరువాత ఎకరాకు 25 కిలోల యూరియా, 20కిలోల మ్యూరేట్ ఆఫ్ పోటాష్ రసాయనిక ఎరువులను పైపాటుగా 20 నుంచి 40 రోజుల వయసున్న పంటకు మొక్కల మొదళ్లలో 7-10 సెం.మీ దూరంలో పాదులు తీసి రసాయనిక ఎరువులను వేసి మట్టితో కప్పాలని సూచించారు. ముంపునకు గురైన పంట త్వరగా కోలుకోవడానికి 19:19:19 లేదా 13-0-45 లేదా 10 గ్రా. యూరియా లీటరు నీటికి కలిపి వారం రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారి చేయాలన్నారు. పత్తి పంటలో వచ్చే గడ్డి జాతి కలుపు మొక్కలను నివారించడానికి (2 నుంచి 3 ఆకుల దశలో ఉన్న కలుపు మొక్కలు) 2 మి.లీ. క్విజలోఫాప్ ఇథైల్ ం 1.25 మి.లీ. పైరిథాయోబ్యాక్ సోడియం కలుపు మందులను లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలన్నారు.
మొక్కజొన్న పంటను మొక్కజొన్న శాకీయ దశలో ఎక్కువ నీటిని తట్టుకోలేదనీ, పొలం నుంచి నీటిని వెంటనే తీసివేయాలన్నారు.
జొన్న పంటకు ముందస్తు నివారణ చర్యల భాగంగా జొన్నలో కాండం తొలుచు పురుగు నివారణకు, పంట విత్తిన 30-35 రోజుల దశలో ఎకరాకు 4 కిలోల కార్బోఫ్యూరాన్ 3సిజి గుళికలను కాండం, సుడులలో వేయాలన్నారు. కంది పంట ప్రస్తుత వాతావరణ పరిస్థితులు పంటలో ఫైటాప్తోర ఎండుతెగులు ఆశించుటకు అనుకూలమన్నారు. తెగులు గమనించినచో, నివారణకు 2 గ్రా. మెటలాక్సిల్ మందును లీటరు నీటికి కలిపి నేల బాగా తడిచేటట్లు పిచికారి చేయాలన్నారు. సోయాచిక్కుడు పంటకు ప్రస్తుత వాతావరణ పరిస్థితులు పంటలో వేరుకుళ్ళు తెగులు ఆశించుటకు అనుకూలమన్నారు. తెగులు గమనించినచో, నివారణకు 3 గ్రా. కాపర్-ఆక్సి-క్లోరైడ్ మందును లీటరు నీటికి కలిపి నేల బాగా తడిచేటట్టు పిచికారి చేయాలన్నారు.
సోయాచిక్కుడు పంటలో కాండం కుళ్ళు తెగులు గమనించినట్లయితే 2.5 గ్రా కార్బండాజిమ్ ం మ్యాంకోజేబ్ మందును లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలన్నారు. కూరగాయలు పంటలు టమాట, వంగ, మిరప, బంతి పంటల నారుమళ్లలో నారు కుళ్లు తెగులు నివారణకు 3 గ్రా. కాపర్-ఆక్సి-క్లోరైడ్ మందును లీటరు నీటికి కలిపి నేల పూర్తిగా తడిచేటట్లు పిచికారి చేయాలన్నారు. చెరకు పంట ముంపునకు గురైయ్యే ప్రాంతాల్లో ప్రతీ 25 మీటర్లకు ఊటకాలువలు ఏర్పాటు చేసుకుని తోటలో నీరు నిలువకుండా మురుగు నీటి కాలువల ద్వారా నీటిని తీసివేయాలన్నారు.