నవతెలంగాణ-బోనకల్
పొలాలలో వర్షపానీరు నిల్వ లేకుండా రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు అంటున్నారు. మండలంలో ప్రధానంగా పత్తి పంటను 15 వేల ఎకరాలలో అన్నదాతలు సాగు చేశారు. గత ఐదు రోజులుగా ఎడ తెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పంట పొలాల్లో నీరు నిలుస్తుంది. ఇలాంటి ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో వర్షాధార పంటలైన పత్తి, వరి పండిస్తున్న రైతులు జాగ్రత్తలు పాటించాలని మండల వ్యవసాయ శాఖ అధికారిని సర్వశుద్ధి సరిత తెలిపారు. వర్షం నీరు ఎక్కువ రోజులు నిల్వ ఉండటం వలన మొక్కల వేర్లకు గాలి, సూర్యరస్మి, అందక ఎర్రబారి చనిపోతాయని వ్యవసాయ శాఖ అధికారులు అంటున్నారు. చీడ పీడలు, తెగుళ్లు బారిన పడే అవకాశం ఉందని చెబుతున్నారు. పొలాలలో వర్షపు నీరు నిలవకుండా మురుగు కాలువలు ఏర్పాటు చేసుకోవాలని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. వాతావరణంలో అధిక తేమ వలన పంటలకు తెగుళ్లు సోకే ప్రమాదం ఉందని తెలిపారు. ఎప్పటికప్పుడు సస్య రక్షణ చర్యలు పాటించాలని సూచించారు. ప్రధానంగా ఈ జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. భారీ వర్షాలు కురిసే సమయంలో పంట పొలాలలో ఎరువులు, కలుపు నివారణ మందులు వేయకూడదు. గాలిలో అధిక తేమ వల్ల ఇప్పటికే విత్తుకున్న పత్తి పంటకు రసం పీల్చే పురుగులు ఆశించే ఆస్కారం ఉందన్నారు. వీటిని గుర్తించి నివారణకు రెండు మిల్లీమీటర్ల ఫ్రీ పోనిల్ లేదా 0.2 గ్రాముల అసిటామీఫ్రిడ్ లేదా లేదా 0.25 మిల్లీ లీటర్ల ఇమిడాక్లోప్రిడ్ మందును లీటర్ నీటిలో కలిపి చల్లుకోవాలని సూచించారు. వరి పొలాలలో నిలిచిన వర్షం నీటిని కాలువల ద్వారా బయటికి పంపించాలి. నీటిలో మునిగి ఉంటే గాలి, సూర్యరస్మి అందక పంట ఎర్రబారి చనిపోయే ప్రమాదం ఉంది. మిరప నారు దశలో ఉంటే నారుమళ్ళల్లో నీరు నిలవకుండా చూడాలి. నీరు నిల్వ ఉంటే మొక్కలకు ఎండు నారుకుళ్ళు తెగులు సోకవచ్చు. మిరప తెగుల నివారణకు లీటర్ నీటికి మెటలాక్సిల్ రెండు గ్రాములు లేదా కాపర్ ఆక్సి క్లోరైడ్ మూడు గ్రాములు కలిపి తెగులు సోకిన మొక్క మొదల చుట్టూ పిచికారి చేయాలి. భారీ వర్షాల సమయంలో పిడుగులు పడే ఆస్కారం ఉంది. పశువులను బయటకు పంపకుండా పాకలోనే కట్టేసి మేతను అందించాలని వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు సూచించారు. ఎప్పటికప్పుడు వ్యవసాయ శాఖ అధికారులు సూచనలతో ముందుకు సాగటం వలన రైతులకు పెద్దగా నష్టం ఉండదని తెలిపారు.