గోదావరి నదిలో ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి

– కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌
– గోదావరిలో మునిగి ఒకరు మృతి
– నలుగురిని కాపాడిన జాలర్లు
నవతెలంగాణ-భద్రాచలం రూరల్‌
సుదూర ప్రాంతాల నుంచి భద్రాచలం సీతారామచంద్ర స్వామి వారిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులు తప్పనిసరిగా గోదావరిలో స్నానం చేసి స్వామివారిని దర్శించుకుంటారని భక్తులు స్థానాలు చేసే ప్రదేశాలలో ప్రమాదాలు జరగకుండా సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అధికారులను ఆదేశించారు. శనివారం భద్రాచలం గోదావరిలో సరదాగా ఈతకు వెళ్లి ఐదుగురు బాలురు అనుకోకుండా గోదావరిలోకి మునిగిపోవడంతో దగ్గరే ఉన్న జాలర్లు నలుగురిని కాపాడారు. అయినా ఒక బాలుడు చనిపోవడంతో ఆ ప్రదేశాలను ఆయన పరిశీలించి ప్రమాదానికి గల కారణాలను సంబంధిత అధికారులని అడిగి తెలుసుకున్నారు. గోదావరిలోకి భక్తులు స్నానానికి వెళ్ళినప్పుడు తప్పనిసరిగా లోతుకి వెళ్లకుండా ప్రమాద సూచికలు ఏర్పాటు చేయడమే కాక, భక్తులకు తప్పనిసరిగా సమాచారం అందించడానికి ప్రత్యేక సిబ్బందిని నియమించాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఇటువంటి ప్రమాదాలు ఇకముందు జరగకుండా చూడవలసిన బాధ్యత అధికారులపై ఉందని, 24 గంటలు గోదావరి పరిసరాలలో ప్రత్యేకమైన నిఘా ఏర్పాటు చేయాలని ఆయన ఆదేశించారు. భక్తులు గాని ఇంకా ఎవరైనా గోదావరిలోకి దిగేటప్పుడు అక్కడ విధులు నిర్వహించే సిబ్బంది వారు ఎక్కువ లోతుకి వెళ్లకుండా జాగ్రత్తలు చెప్పుతూ ఉండాలని ఆయన అన్నారు. రాత్రి సమయంలో భక్తులు గాని ప్రజలు గాని ఎవరూ గోదావరి పరిసరాలలో తిరగకుండా సంబంధిత పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి పర్యవేక్షణ పగడ్బందీగా ఉండాలని, ఆయన పోలీసు అధికారులకు సూచించారు. జరిగిన సంఘటన ఇకముందు పునరావృతం కాకుండా అధికారులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో భద్రాచలం ఆర్డీవో దామోదర్‌ రావు, ఇరిగేషన్‌ ఈఈ రాంప్రసాద్‌, సీడబ్ల్యూసీ అధికారులు పోలీస్‌ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.