నవతెలంగాణ – ఆదిలాబాద్ టౌన్
ఇటీవల మధ్యాహ్న భోజనం అమలులో అక్కడక్కడ కొన్ని దురదృష్టకర సంఘటనలు జరుగుతున్నందున మధ్యాహ్న భోజన సరుకులను శుభ్రం పరచడంలో గాని వంట పాత్రలు, వంటగది పరిసరాలు శుభ్రంగా ఉంచాలని జిల్లా విద్యాశాఖ అధికారిణి ప్రణీత సూచించారు. విద్యార్థులు భోజనానికి ముందు చేతులు శుభ్రంగా కడుక్కోవడంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. గురువారం పట్టణంలోని పలు ప్రభుత్వ పాఠశాలలను ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆయా పాఠశాలలో విద్యార్థుల హాజరు శాతం, విద్యార్థుల పఠనా సామర్థ్యాలను పరీక్షించడంతోపాటు మధ్యాహ్నం అమలు విధానాన్ని ప్రత్యేకంగా పరిశీలించారు. ఇందులో భాగంగా ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆర్పిఎల్ లో విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. కార్యక్రమంలో సెక్టోరల్ అధికారి జే నారాయణ, పాఠశాల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.