నగదు, బంగారు గొలుసు చోరీ

నవతెలంగాణ-కొత్తూరు
ఇంటికి తాళం పెట్టి దైవదర్శనానికి వెళ్లడంతో ఇంట్లో దొంగలు పడి ఇల్లు గుల్ల చేసిన ఘటన కొత్తూరు పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఆదివారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. ఎస్‌ఐ శంకర్‌ తెలిపిన వివరాల ప్రకారం కొత్తూరు పట్టణానికి చెందిన జెనిగా శ్రీనివాస్‌ పెంజర్ల రోడ్డులో అద్దెకు ఉంటూ స్థానిక వినైల్‌ కెమికల్‌ కంపెనీలో ప్రయివేటు ఉద్యోగం చేస్తూ జీవనోపాధి పొందుతున్నాడు. గత నెల 30వ తేదీన ఆయన భార్య పిల్లలతో కలిసి తిరుమల తిరుపతి దర్శనానికి వెళ్తూ పక్కనే మరొక పోర్షన్‌ లో అద్దెకు ఉంటున్న కత్తుల వసంతకు ఇంటి పైపు చూడమని చెప్పాడు. సోమవారం ఉదయం ఆమె శ్రీనివాస్‌ కి ఫోన్‌ చేసి ఇంటి తాళం పగలగొట్టి పడి ఉందని చెప్పింది. దీంతో అతడు తన సోదరుడు జెనిగె శివకుమార్‌కు ఫోన్‌ ద్వారా సమాచారం ఇచ్చాడు. అతని సోదరుడు ఇంట్లోకి వెళ్లి గమనించగా 20వేల రూపాయల నగదుతో పాటు నాలుగు గ్రాముల విలువగల బంగారు చైను ఎత్తుకెళ్లినట్టు గుర్తించారు. అతని సోదరుడు శివకుమార్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్టు పోలీసులు పేర్కొన్నారు.