నవతెలంగాణ- విలేకరులు
ఎన్నికల షెడ్యూల్ ప్రకటన తరువాత పోలీసులు తనిఖీలను వేగవంతం చేశారు. నగదు, బంగారం పట్టుబడుతోంది. సూర్యాపేట జిల్లా కోదాడ మండల పరిధిలోని రామాపురం ఎక్స్ రోడ్ చెక్‌పోస్టు వద్ద వాహనాల తనిఖీల్లో బుధవారం నాగారం మండలం ఈటూరుకు చెందిన చేపల వ్యాపారి నర్ల నరేష్ కుమార్ మారుతి వాహనంలో రూ.1.50లక్షలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పడవలు కొనుగోలు చేసేందుకు ఆ డబ్బులు తీసుకెళ్తున్నట్టు ఆయన చెప్పారు. మరో ఘటనలో నాగపూర్‌కు చెందిన అతావుల్లా ఖాన్ గ్రానైట్ కొనుగోలు చేసేందుకు ప్రకాశం జిల్లా మార్టూరుకు 1.96 లక్షలు తీసుకెళ్తుండగా పోలీసులు స్వాధీనం చేసుకొని ఫ్లయింగ్ స్క్వాడ్‌కు అందజేశారు. అనంతగిరి మండల పోలీస్ స్టేషన్ పరిధిలోని తమ్మరబండపాలెం చెక్ పోస్ట్ వద్ద తనిఖీల సందర్భంగా హుజూర్‌నగర్ మండలం కరక్కాయల గూడెం గ్రామానికి చెందిన చింతకుంట్ల కోటేశ్వర్ రావు నుంచి రూ.7 లక్షల 30 వేలు స్వాధీనం చేసుకున్నారు. నగదును సీజ్ చేసి ఫ్లయింగ్ స్క్వాడ్‌కు అందించనున్నట్టు ఎస్‌ఐ అనిల్ రెడ్డి తెలిపారు. మంచిర్యాల జిల్లా నస్పూర్ మండలం కువనపెల్లి గంగారం వద్ద పోలీసుల తనిఖీల్లో రూ.5 లక్షలను పట్టుకున్నారు. నిర్మల్ జిల్లా లక్ష్మణచాంద మండల కేంద్రంలో రూ.44లక్షల విలువ చేసే మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలంలోని కలికోట గ్రామ శివారులో చెక్ పోస్ట్ వద్ద రూ.6.60లక్షలు పట్టుబడింది.హైదరాబాద్ దిలీసుఖ్‌నగర్ మెట్రో స్టేషన్ వద్ద చైతన్యపురి పోలీసుల తనిఖీల్లో భాగంగా కారులో రూ.60లక్షలు లభ్యమైంది. వాటికి ఎలాంటి ధ్రువపత్రాలూ లేకపోవడంతో రెవెన్యూ అధికారుల సమక్షంలో సీజ్ చేసినట్టు పోలీసులు తెలిపారు.