గొర్రెల పంపిణీలో నగదు బదిలీ చేయాలి

– 9న పశుసంవర్ధక శాఖ డైరెక్టర్‌ కార్యాలయం ముట్టడి :జీఎంపీఎస్‌ కార్యదర్శి ఉడుత రవీందర్‌
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
గొర్రెలపంపిణీకి తగినన్ని నిధులు కేటాయించి, నగదు బదిలీ చేయాలని గొర్రెల మేకల పెంపకందార్ల సంఘం (జీఎంపీఎస్‌) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉడుత రవీందర్‌ గురువారం ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. 9న రాష్ట్ర పశుసంవర్థక శాఖ కార్యాలయాన్ని ముట్టడి చేయనున్నట్టు పేర్కొన్నారు. రెండో విడుత గొర్రెల పంపిణీ ప్రారంభించినట్టు నమ్మిస్తున్నారని తెలిపారు. 1,16,370 మందితో డీడీలు కట్టారని పేర్కొన్నారు. కేవలం 27వేల మందికి మాత్రమే పంపిణీ చేశారనీ, గొల్ల కురమలను అప్పులపాలు చేశారని విమర్శించారు. ప్రభుత్వం కేవలం రూ. 50కోట్లు మాత్రమే విడుదల చేసిందనీ, ఆ డబ్బులు 3, 800మందికి మాత్రమే సరిపోతాయని తెలిపారు. మిగతా వారికి ఎలా ఇస్తారని ప్రశ్నించారు. ఎన్నికల నోటిఫికేషన్‌ వస్తే నిధులు విడుదల చేసే అవకాశం లేనందున మిగిలిన 85వేల మందికి ప్రభుత్వం ఎగనామం పెడుతుందని తెలిపారు. ఎక్కువ చోట్ల ముసలి గొర్లు, చిన్నపిల్లలనే ఎక్కువగా ఇచ్చారని ఆరోపించారు. పక్క రాష్ట్రాలకు తీసుకుపోయి అక్కడ గొర్రెలు లేకుండానే తిప్పి తిప్పి ఇబ్బందులకు గురిచేస్తున్నారని పేర్కొన్నారు. డీడీలు కట్టిన వాళ్లను కాకుండా ఎమ్మెల్యేలు సూచించిన లబ్దదారులకు మాత్రమే ఇస్తున్నారని తెలిపారు. కొన్నిచోట్ల అధికార పార్టీ మండల నాయకలు, ప్రజాప్రతినిధులు డబ్బులు తీసుకొని పంపిస్తున్నారని ఆరోపించారు. ఎన్సీడీసీ అప్పు ఇవ్వలేమని చేతులెత్తేసినందున, రాష్ట్రంలో ఇంకా మిగిలిన 3.5లక్షల మందికి కావల్సిన రూ.6వేల కోట్ల నిధుల్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఇచ్చి, నగదు బదిలీ చేసీ, గొర్లకాపరులకు నచ్చినచోట ఇష్టమొచ్చిన గొర్రెలు కొనుగోలు చేసుకునే అవకాశం కల్పించాలని డిమాండ్‌ చేశారు.