తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్య శ్రీ పథకం కింద వైద్య ఖర్చులకు రూ.5 లక్షల నుండి 10 లక్షలకు పెంచింది. ముఖ్య మంత్రి ఎ.రేవంత్ రెడ్డి, ఇతర మంత్రులు అనేక సందర్భాల్లో తెలంగాణలో ఇందిరమ్మ పాలన తెస్తామని, విద్య, వైద్య రంగాలకు ప్రాధాన్యతనిస్తామని చెబుతున్నారు. అయితే రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధ్యాయ, పదవీ విరమణ చేసిన రిటైర్డ్ ఉద్యోగులకు, వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యుల కోసం నగదు రహిత వైద్యాన్ని అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎన్నికలకు ముందు అన్ని ప్రభుత్వ, పంచాయతీ రాజ్ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపా ధ్యాయులకు, ఉద్యోగులకు, రిటైర్డ్ ఉద్యోగులకు నగదు రహిత వైద్యాన్ని అందించడానికి కృషి చేస్తామని చెప్పి ఇప్పుడు హెల్త్ కార్డులడిగితే స్పందించడం లేదంటే కొత్త ప్రభుత్వం ఆంతర్య మేమిటో అర్థం కావడం లేదు. తన సర్వీసులో ఎంతో కష్టపడి కూడబెట్టిన డబ్బులు చిన్నపాటి ఆరోగ్య సమస్యలకి మొత్తం ఖర్చవుతుందని రిటైర్ట్ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగులు ఆరోగ్యవంతంగా ఉంటే ప్రభుత్వ పథకాలు ప్రజల వద్దకు తీసుకుపోవడానికి అవకాశం ఉంటుంది. అందుకు ఉద్యోగుల సంక్షేమం చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపైన ఉన్నది.కొన్ని రోగాలకు అధిక మొత్తాల్లో ఫీజులు చెల్లించాల్సి వస్తుంటంతో అప్పుల కోసం పర్సనల్ లోన్, బంగారం, ఆస్తులు తాకట్టు పెట్టాల్సి వస్తుంది. ఉద్యోగుల సంక్షేమార్థం నగదు రహిత వైద్యమందించాల్సిన అవసరముంది.
– ఎస్.విజయభాస్కర్, 9290826988