దేశంలో కుల, మత రాజకీయాలు చెల్లవు

Caste and religious politics are not valid in the country– మతోన్మాద, అవినీతి పార్టీలను ఓడించండి
– భువనగిరిలో సీపీఐ(ఎం)ను గెలిపించాలి : చేర్యాలలో సీపీఐ(ఎం) కేంద్ర కమిటి సభ్యులు చెరుపల్లి సీతారాములు, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు చుక్క రాములు
నవతెలంగాణ-చేర్యాల
దేశంలో కులం, మతం పేరుతో ప్రజలను విభజించే రాజకీయాలు చెల్లవని సీపీఐ(ఎం) కేంద్ర కమిటి సభ్యులు, మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు, సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు చుక్కరాములు అన్నారు. భూమికోసం భుక్తి కోసం వెట్టి చాకిరి విముక్తి కోసం దొరలు, భూస్వాములకు వ్యతిరేకంగా పోరాడి దున్నేవానికి భూమి కావాలని కమ్యూనిస్టు పార్టీ ప్రాణత్యాగాలు చేసిందని, అలాంటి పోరాటాలకు నిలయమైన భువనగిరి పార్లమెంటు స్థానంలో సీపీఐ(ఎం) పార్టీ పోటీ చేస్తుందన్నారు. మే 13వ తేదీ జరిగే పార్లమెంట్‌ ఎన్నికల్లో మతోన్మాద శక్తులను, అవినీతికర పార్టీలను ఓడించి అనునిత్యం ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాడుతున్న సీపీఐ(ఎం) పార్టీ అభ్యర్థిని గెలిపించి ప్రజా పోరాటాలను బలపరచాలని తెలిపారు. గ్రామ గ్రామాన కార్యకర్తలు పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు.
సిద్దిపేట జిల్లా చేర్యాల మండల కేంద్రంలోని వాసవీగార్డెన్‌లో సోమవారం చేర్యాల, కొమురవెల్లి, మద్దూరు, దూల్మిట్ట మండలాల సీపీఐ(ఎం) పార్టీ కార్యకర్తల సమావేశం ఆ పార్టీ జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిధులుగా చెరుపల్లి సీతారాములు, చుక్కరాములు హాజరయ్యారు. సీతారాములు మాటాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ ప్రభుత్వం ఎలక్టోరల్‌ బాండ్ల రూపంలో వేలకోట్ల రూపాయలు కార్పొరేట్‌ శక్తుల నుంచి అక్రమంగా పోగేసుకొని మళ్ళీ ఆ అవినీతి సొమ్ముతో గెలవాలని ప్రయత్నిస్తోందని అన్నారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని ఒక ఉద్యోగం కూడా ఇవ్వకుండా నిరుద్యోగులను మోసం చేసిందన్నారు. పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌, నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెంచి ప్రజలపై మోయలేని భారాలు మోపిందన్నారు. కార్పొరేట్‌ శక్తులకు ప్రయోజనాలు చేకూర్చే విధంగా పేదలపై భారాలు వేస్తూ పేదలను మరింత పేదలుగా, ధనవంతులను మరింత ధనవంతులుగా మార్చారే తప్ప చేసిన అభివృద్ధి ఏమీ లేదన్నారు. సిఏఏను అమలు చేయాలని కేంద్రం నిర్ణయించడంతో పౌరుల పౌరసత్వానికే ప్రమాదం ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. చుక్క రాములు మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం రైతాంగానికి ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మళ్లీ కార్పొరేట్‌ శక్తులకు ఊడిగం చేసే విధానాలను ముందుకు తీసుకు వస్తోందన్నారు. దీనికి వ్యతిరేకంగా మళ్లీ దేశవ్యాప్తంగా రైతాంగం, కార్మిక వర్గం, వ్యవసాయ కూలీలు, పేదలు పెద్ద ఎత్తున పోరాడుతున్నారని తెలిపారు. స్వాతంత్రానికి పూర్వమే పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను, రాజ్యాంగంలో పొందుపరిచిన చట్టాలను రద్దుచేసి కేంద్రంలోని మోడీ నాయకత్వంలో ఉన్న బిజెపి ప్రభుత్వం కార్పొరేట్‌, పెట్టుబడుదారుల అడుగులకు మడుగులోత్తే విధంగా కార్మిక హక్కులను కాల రాస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దేవుడు, మతాన్ని అడ్డుపెట్టుకొని ఓట్లు అడిగే రాజకీయాలను ఎదిరించాలన్నారు. ఈ సమావేశంలో పార్టీ సీనియర్‌ నాయకులు నక్కల యాదవ రెడ్డి, పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రాళ్ల బండి శశిధర్‌, శెట్టిపల్లి సత్తిరెడ్డి, చేర్యాల,మద్దూరు మండలాల పార్టీ కార్యదర్సులు కొంగరి వెంకట మావో, ఆలేటి యాదగిరి, చేర్యాల పట్టణ కార్యదర్శి రాళ్ల బండి నాగరాజు, దూల్మిట్ట మండల ఇంచార్జ్‌ చొప్పరి రవికుమార్‌, పార్టీ జిల్లా కమిటీ సభ్యులు బద్దిపడగ కృష్ణారెడ్డి, బండ కింది అరుణ్‌ కుమార్‌, అత్తిని శారద, దాసరి ప్రశాంత్‌, మాజీ సర్పంచ్‌ తాడూరి రవీందర్‌, నాలుగు మండలాల శాఖ కార్యదర్శులు, మండల కమిటీ సభ్యులు, ప్రజాసంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.