– మీ తాతలు రాలేదు.. మీరూ రావొద్దంటూ బెదిరింపులు
– అంటరానివారు, తక్కువ కులస్తులంటూ దూషణ
– ఎంత దమ్ముంటే గుడిలోకి వస్తారంటూ నిలదీత
– చొక్కాతో ఆలయ గేటు కట్టి మూసివేసిన వైనం
– అడ్డుకున్న అగ్రకుల వ్యక్తులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు
నవతెలంగాణ -సిద్దిపేటరూరల్
దళిత సామాజిక తరగతికి చెందిన కొంతమంది వ్యక్తులు హనుమాన్ మాల ధరించి గుడిలో పూజ చేసుకోవడానికి వెళ్లగా అగ్ర కులస్తులు అడ్డుకున్నారు. అంతేకాదు, వారిని కులంపేరుతో దూషించారు. దాంతో వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసిన ఘటన బుధవారం సిద్దిపేట రూరల్ మండలంలోని సీతారాం పల్లి గ్రామంలో జరిగింది. సిద్దిపేట రూరల్ ఎస్‌ఐ అపూర్వ రెడ్డి తెలిపిన వివరాల మేరకు.. ఎస్సీ సామాజికి తరగతికి చెందిన మిట్టపల్లి కిషన్‌తో పాటు ఐదుగురు వ్యక్తులు కొన్ని రోజుల క్రితం హనుమాన్ మాల ధరించారు. కాగా, మంగళవారం హనుమాన్ పూజ చేసుకోవడానికి గ్రామంలో ఉన్న హనుమాన్ ఆలయంలోకి వెళ్ళగా.. అదే గ్రామానికి చెందిన అగ్రకుల వ్యక్తులు దొంగల శ్రీకాంత్ రెడ్డి, గుర్రం భూమిరెడ్డి, చింతల మహేష్ గౌడ్.. ఎస్సీ కులానికి చెందిన మీరు గుడిలోకి రావొద్దంటూ బెదిరించి వారిని గుడి బయటనే నిలబెట్టారు. అంతేకాదు, మాదిగ కులానికి చెందిన మీరు.. మీ తాత ముత్తాతల నుంచి గుడిలోకి రావడం లేదు.. ఇప్పుడు మీరూ రావడానికి వీల్లేదు అంటూ అనుచిత వ్యాఖ్యలతో దూషించారు. చింతల మహేష్ గౌడ్ తన చొక్కాతో గుడి గేటును కట్టి లోపలికి రానివ్వకుండా మూసి వేశాడు. దొంగల శ్రీకాంత్ రెడ్డి ఫోన్ చేసి మీరు అంటరానివారు, తక్కువ కులానికి చెందినవారు, మీకు ఎంత దమ్ముంటే మా గుడిలోకి వస్తారు.. మీరు గుడిలోకి రావాలంటే మీ ఇంటి, కులం పేరు మార్చుకోవాలంటూ.. బూతులు తిడుతూ బెదిరించాడు. ఆలయంలోకి ప్రవేశం లేదని అడ్డుకున్న వ్యక్తులపై మిట్టపల్లి కిషన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో కేసు నమోదు చేసిన పోలీసులు.. వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని ఎస్‌ఐ తెలిపారు.
కులం, వ్యక్తిగత దూషణలు చేస్తే కఠిన చర్యలు : సిద్దిపేట రూరల్ సీఐ ఎం. శీను
హనుమాన్ గుడిలోకి రానివ్వడం లేదన్న ఫిర్యాదు మేరకు వెంటనే స్పందించిన సీఐ శ్రీను, ఎస్‌ఐ అపూర్వ రెడ్డితో కలిసి సీతారాం పల్లి గ్రామంలో సంఘటనపై విచారణ చేపట్టారు. అనంతరం గ్రామస్తులతో మాట్లాడుతూ.. కులం పేరుతో వ్యక్తిగత దూషణలు చేసినా, వారి పనులకు ఆటంకపరిచినా చట్టం ప్రకారం కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.