కులాల కంపుతో కునారిల్లుతున్న రంగమే లేదంటే అది అతిశయోక్తే కాదు! పుట్టిన నుండి చావువరకు కులగజ్జే! చివరికి తప్పు చేసి జైలులో ఉన్న ఖైదీలను కూడా ఈ కులజాడ్యం వదల్లేదు. దేశానికి ఇదోశాపంగా మారింది. నేటికీ సంస్కృతి, నాగరికత పెరిగినప్పటికీ మన సమాజంలో ఇది ప్రధాన పాత్ర పోషిస్తోంది. దేశ అభివృద్ధిని నిరోధిస్తుంది. మనదేశంలో శిశువుకు పుట్టిన వెంటనే లభించే మొట్టమొదటి గుర్తింపు పత్రం కులం. వాళ్లు పెద్దయ్యాక నచ్చితే మతం మార్చుకోవచ్చేమో గాని కులం మాత్రం మార్చుకోడానికి వీల్లేదు డబ్బుకంటే ఎక్కువ విలువ కులానికి ఇస్తున్న రోజులివి. డబ్బు సంపాదించి కోటీశ్వరుడు కావచ్చు. కానీ ఏమీచేసినా కులం మాత్రం మారలేము. కారణం సమా జంలో ప్రతీ దాంట్లో కులం కూరుకుపోయింది. పాఠశాలలో ప్రవేశ దరఖాస్తులో అధికారికంగా కులం నమోదు మొదలవుతుంది. ఆ సమ యంలో ఏమీ తెలియని పసిపిల్లలు ”కులం అంటే ఏమిటి ?” అని అడిగితే సమాధానం మనదగ్గర ఉండదు. సరే ఎవరి ఇష్టం వాళ్లది. కానీ కులం పేరుతో ఏ భారతీయుడూ వివక్షతకు గురికాకూడదు. కుల వివక్షతకు గురికాకుండా మన రాజ్యాంగం మనలను రక్షిస్తుంది. కొంతమంది తమ స్వార్థం కోసం కుల వివక్షతను పెంచి పోషిస్తున్నారు. రాజ్యాంగం మనకు ఎంత రక్షణ ఇస్తున్నా కూడా అనధికారంగా కొన్ని కులాలు ఇప్పటికీ వివక్షకు గురవుతూనే ఉన్నాయి. జైలు బ్యారక్‌లలో కుల ఆధారిత వివక్షపై జర్నలిస్టు సుకన్య శాంత దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పే దీనికి తార్కాణం.
రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పటినుండి కులవివక్షతను తొలగించినప్పటికీ జైళ్లలో ఇంకా కులవివక్ష కొనసాగుతోందని ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్, న్యాయమూర్తులు జెబి పార్దివాలా, మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం ఈ నెల మూడో తేదీన ఇచ్చిన తీర్పులో ఆందోళన వ్యక్తం చేసింది. ఖైదీల గౌరవం, సమానత్వం వివక్షతలేని హక్కును ఉల్లంఘించినందుకు వివిధ జైలు మాన్యువల్స్‌లోని నిబంధనలను ”రాజ్యాంగ విరుద్ధం” అని పేర్కొంటూ, జైళ్లలో కుల ఆధారిత వివక్షకు సుదీర్ఘకాలంగా ఉన్న ఆచారానికి ముగింపు పలికి చారిత్రాత్మకమైన తీర్పునిచ్చింది. తక్షణ సంస్కరణలకు పిలుపునిచ్చింది. జైలు ప్రాంగణాల్లో కుల ఆధారిత వివక్షను తొలగించేందుకు పలు ఆదేశాలు జారీ చేసింది. ఖైదీలకు గౌరవం ఇవ్వకపోవడం వలసవాదులు, వలసవాద పూర్వ యంత్రాంగాల అవశేషాలని మండిపడింది. ”వలస వాదశకంలోని క్రిమినల్ చట్టాలు స్వాతంత్య్రం అనంతరం ప్రభావితం చేస్తూనే ఉన్నాయి” అని పేర్కొంది. అగ్రకులాలకు వంటచేసే పనులు, అట్టడుగు వర్గాల వారికి క్లీనింగ్, స్వీపింగ్ పనులు, మురుగు కాలువలు, ట్యాంకులను శుభ్రపరచడానికి బలవంతం చేసే పద్ధతులు, అవాంఛనీయమైన పనులను చేయమని బలవంతం చేయడం లాంటి కుల ఆధారిత కేటాయింపుల జైలు మాన్యువల్లు నేరుగా వివక్ష చూపు తున్నాయని, ఇవి రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 15 ఉల్లంఘన కిందకు వస్తాయని పేర్కొంది. ఇది అట్టడుగు వర్గాలను దోపిడీ చేయడం లాంటిదని, ఖైదీలెవరూ వారి కులాన్ని బట్టి పని కేటాయింపులు, వారి బ్యారక్‌లు ఏర్పాటు చేయకుండా అందరికీ సమానం గా చూసుకోవాలని సూచించింది. అండర్ ట్రయల్, శిక్ష పడిన ఖైదీల రిజిస్టర్లలోని కులకాలమ్ను తొలగించాలని, రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతా ల్లోని జైళ్ల సిబ్బందిని ఆదేశించింది. ఇది మానవ గౌరవానికి స్పష్టమైన ఉల్లంఘన అని పేర్కొంది.
వివక్షతవారి రాజ్యాంగ హక్కులను స్పష్టంగా ఉల్లంఘించడమేనని కోర్టు పేర్కొంది.కులాల ప్రాతిపదికన బ్యారక్‌లలో ఖైదీలను వేరు చేయడం, కులాల శ్రేణిలో వారి స్థానం ఆధారంగా వారికి పనిని కేటాయించడం వివక్షతో కూడుకున్నదని, ఇది బలవంతపు శ్రమతో సమా నమని పేర్కొంటూ సుప్రీంకోర్టు పద్ధతులన్నింటికీ స్వస్తి పలికింది. కుల ఆధారిత వివక్షను పరిష్కరించడంలో అనేక అంతరాలను గుర్తిస్తూ 2016 మోడల్ ప్రిజన్ మాన్యువల్‌ను కూడా ఈ తీర్పు లక్ష్యంగా చేసుకుంది. మాన్యువల్ కొన్ని రకాల వివక్షను నిషేధించినప్పటికీ జైళ్లలో కుల ఆధారిత విభజన కార్మిక విభజనను పూర్తిగా తొలగించడంలో విఫలమైందని కోర్టు పేర్కొంది. సమగ్ర సంస్కరణను కోరుతూ మాన్యువల్ స్కావెంజింగ్ను నిషేధించే 2013 చట్టాన్ని మాన్యు వల్లో పొందుపరచలేదని విమర్శిం చింది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు తమ జైలు మాన్యువల్ లను మూడు నెలల్లో వివక్షాపూరిత నిబంధనలను సవరిం చాలని అన్ని రాష్ట్రాలను ఆదేశించింది. భారత రాజ్యాంగం లోని ఆర్టికల్ 14, 15, 17, 21, 23లను ఉల్లంఘిస్తున్నా రనే కారణంతో రాష్ట్ర జైలు మాన్యువల్స్ లోని వివిధ నిబంధ నలను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై ఈ తీర్పు వచ్చింది. కుల ప్రాతిపదికన ఖైదీలను వేరు చేయడం కుల భేదాలు లేదా శత్రుత్వాన్ని బలోపేతం చేస్తుందని, వీటిని మొదట నిరోధిం చాల్సిన అవసరం ఉందని, జైళ్లలో క్రమశిక్షణను కొనసాగించడానికి ఖైదీలను కుల ప్రాతిపదికన వేరుచేయాలని చేసిన అభ్యర్థనను తిరస్కరించింది. కుల ఆధారిత వివక్ష వ్యక్తిగత ఎదుగుదలకు, అభివ అద్ధికి ఆటంకం కలిగిస్తుందని పేర్కొంటూ సుప్రీంకోర్టు ఆర్టికల్ 21 పరిధిని విస్తరించింది. అట్టడుగు వర్గాలకు చెందిన వ్యక్తులు కుల దురభి మానాలను అధిగమించేందుకు జైలు వ్యవస్థలు తప్పనిసరిగా అనుమతించాలని, సమాన త్వం, గౌర వించే వాతావరణాన్ని అందించాలని తీర్పు చెప్పింది.
ఈ తీర్పు భారతదేశంలోని జైళ్లలో షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, డినోటిఫైడ్ తెగలు (డిఎన్టిలు) సహా అట్టడుగు వర్గాల పట్ల వేళ్లూను కున్న వివక్షాపూరిత పద్ధతులను ప్రత్యేకంగా ప్రస్తావించింది. కుల ఆధారిత పక్షపాతాలను ఎదుర్కోవడానికి, డీనోటిఫైడ్ తెగ సభ్యుల ఏకపక్ష అరెస్టులను నిరోధించడానికి అర్నేష్ కుమార్ వెర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ (2014), అమానతుల్లా ఖాన్ వర్సెస్ పోలీస్ కమీషనర్ ఢిల్లీ (2024) కేసులలో నిర్దేశించిన మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాల ని బెంచ్ పిలుపునిచ్చింది. డీనోటిఫైడ్ తెగల సభ్యులు పుట్టుకతోనే నేరస్తులుగా పరిగణించబడే వర్గీకరణ వారి గౌరవానికి భంగం కలిగిస్తుందని, ఇది వారి గౌరవంగా జీవించే హక్కుకు హామీ ఇచ్చే ఆర్టికల్ 21 స్థూల ఉల్లంఘన అని పేర్కొంది.
అట్టడుగు వర్గాల రక్షణ విధానాలను రూపొం దించడానికి, వనరుల సమాన పంపిణీని ప్రోత్సహిం చడానికి రాజ్యాంగం కొన్ని కులాలు, తెగలను ఎస్సీ, ఎస్టీలుగా గుర్తిస్తుందని, అయితే ఆర్టికల్ 15(1)లో స్పష్టంగా కనిపిస్తున్నట్లుగా, అట్టడుగు వర్గాల సభ్యులపై వివక్ష చూపడానికి కులం కారణం కాదు” అని ధర్మాసనం పేర్కొంది. ఈ తీర్పులో సూచించిన విధంగా కుల ఆధారిత వివక్ష లేదా వివక్షాపూరిత పద్ధతులు ఇప్పటికీ జైళ్లలో జరుగుతున్నాయో లేదో గుర్తించేందుకు 2016 మోడల్ ప్రిజన్ మాన్యువల్ కింద ఏర్పడిన జిల్లా లీగల్ సర్వీసెస్ అధికారులు, సందర్శకుల బోర్డు సంయుక్తంగా క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించాలని కోర్టు కోరింది. దానికి స్థితి నివేదిక అందజేయాలని తెలిపింది.
జనక మోహన రావు
8247045230