– పదవికి రాజీనామా చేసిన చందిర ప్రియాంగ
– బీజేపీ-ఏఐఎన్‌ఆర్‌సి సంకీర్ణ ప్రభుత్వంపై విమర్శలు
యానాం : కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో అఖిల భారత ఏఐ ఎన్‌ఆర్ కాంగ్రెస్-బీజేపీ సంకీర్ణ ప్రభుత్వంలో మహిళా మంత్రికి అవమానం ఎదరైంది. తనపై కుల, లింగ వివక్ష చూపుతున్నారని పుదుచ్చేరి రవాణా శాఖ మంత్రి ఎస్. చందిర ప్రియాంగ తన పదవికి రాజీనామా చేశారు. 30 మంది సభ్యుల పుదుచ్చేరి అసెంబ్లీలో ఏకైక మహిళా శాసనసభ్యురాలు చందిర ప్రియాంగ. ఈమె దళిత సమాజిక తరగతికి చెందినవారు. దీంతో దళిత సామాజిక వర్గానికి చెందిన ఒక మహిళపై ఇలాంటి వివక్ష చూపటం పట్ల రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది. ఆమె తన రాజీనామా లేఖను తన కార్యదర్శి ద్వారా ముఖ్యమంత్రి ఎన్. రంగసామి కార్యాలయానికి పంపారు. లేఖ తమకు అందిందనీ, అయితే అది ఆమోదించబడిందా లేదా తిరస్కరించబడిందో వెల్లడించలేదని సీఎంఓలోని వర్గాలు తెలిపాయి.
పుదుచ్చేరిలోని కారైకల్ ప్రాంతంలోని నెడున్‌కాడు రిజర్వ్‌డ్ నియోజకవర్గం నుంచి ఎన్నికైన చందిర ప్రియాంగ సోషల్ మీడియాలో తన రాజీనామాను ప్రకటిస్తూ ఒక ప్రకటనను పోస్ట్ చేశారు. ఆమె గత 40 ఏండ్లలో పుదుచ్చేరిలో మొదటి మహిళా మంత్రి. 2021 జులైలో మంత్రివర్గంలో ఏకైక మహిళా సభ్యురాలిగా ప్రమాణ స్వీకారం చేశారు. కాగా, చందిర ప్రియాంగపై వివక్ష చూపటం పట్ల ఏఐఎన్‌ఆర్‌సీ-బీజేపీ సంకీర్ణ ప్రభుత్వంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.