– సావిత్రభాయిలా ముందుకెళ్లాలి : పెద్దపల్లి డీసీపీ చేతన
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
అందరికి విద్య అందకుండా కులం అడ్డుపడుతున్నదనీ, ఆ కుల నిర్మూలన కోసం పోరాడాలని పెద్దపల్లి డీసీసీ చేతన పిలుపునిచ్చారు. సావిత్రి భాయి ఫూలే జయంతి సందర్భంగా దళిత స్త్రీ శక్తి (డీఎస్‌ఎస్) అధ్యక్షురాలు గెడ్డెం ఝాన్సీ అధ్యక్షతన బుధవారం హైదరాబాద్ లకిడీకాపూల్ సమీపంలోని అంబేద్కర్ రిసోర్స్ సెంటర్‌లో ”పేదలకు అందని నాణ్యమైన విద్య” అనే అంశంపై నిర్వహించిన సదస్సులో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా చేతన మాట్లాడుతూ, నాడు సావిత్రభాయి ఫూలే పోరాటం లేకుంటే నేడు మహిళా విద్య అనేదే ఉండేది కాదని గుర్తుచేశారు. ఇప్పటికీ పరిస్థితిలో పూర్తిస్థాయిలో మార్పు రాలేదని అభిప్రాయపడ్డారు. సమాజంలో అట్టడుగున ఉన్నవారు విద్య, ఉద్యోగం, సామాజికంగా, రాజకీయంగా ఎదగడం అవసరమనీ, అందరూ సమానమని చెప్పే విద్య నేటి సమాజానికి అవసరమన్నారు. ప్రజలకు విద్య, వైద్యం ఉచితంగా దక్కాలన్నారు. అలాంటి హక్కుల కోసం పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. కులవివక్ష తట్టుకోలేక బడి మానేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కుల నిర్మూలనే సమస్యలకు పరిష్కారమని స్పష్టం చేశారు. ఇంటర్నేషనల్ స్కూళ్లు విద్యార్థులను రోబోలుగా తయారు చేస్తున్నాయని విమర్శించారు. విద్యావ్యవస్థలో మార్పులు రావాలనీ, రాజకీయాల్లో నిలకడగా ఏండ్ల తరబడి నిలబడగలిగిన దళిత నాయకత్వం రావాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. సావిత్రిభాయి ఫూలే ఆశయాలను కొనసాగించాలని పిలుపునిచ్చారు.
సామాజిక కార్యకర్త సజయ మాట్లాడుతూ అందరూ చదువుకోకుండా ఆధిపత్య కులాలు కుట్రలు చేస్తున్నాయని విమర్శించారు. మనిషికి సహజంగానే తెలివి ఉంటుందనీ, చదువుకుంటే ఆ తెలివి పెరుగుతుందన్నారు. దాడులను ఎదుర్కొనే ధైర్యం వస్తుందన్నారు. మొదట్లో కొందరికే చదువును పరిమితం చేశారని గుర్తుచేశారు. నేర్చుకోవడం, సాధించుకోవడమే సావిత్రభాయి ఫూలేకు ఇచ్చే నిజమైన నివాళి అని తెలిపారు. ఇంటర్నేషనల్ ఫోర్డ్ ఫెల్లో (యుఎస్‌ఏ) డాక్టర్ ఎన్. సిద్ధోజీరావు మాట్లాడుతూ సావిత్రభాయి ఎదిగిందనీ, అలాగే సమాజం ఎదిగేందుకు పాటుపడిందని గుర్తుచేశారు. ప్రతి ఒక్కరు తమ బాధ్యతలు గుర్తెరిగితే హక్కులు సాధించుకోగలుగుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎఫ్ డైరెక్టర్ గిరిజ, ఆటమిక్ ఎనర్జీ సైంటిస్ట్ చారులత, ఎస్సీ, ఎస్టీ అసోసియేషన్ సెక్రెటరీ జనరల్ శంకర్, డిక్కీ మెంటార్ వనజాక్షి, డిక్కీ అరుణ తదితరులు పాల్గొన్నారు.
చదువుకు కులం అడ్డు కులనిర్మూలన కోసం పోరాడాలి
3:21 am