నవతెలంగాణ – కంఠేశ్వర్
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో వీధి కుక్కల నియంత్రణలో భాగంగా మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది శుక్రవారం నగరంలోని పులాంగ్ ప్రాంతంలో వీధి కుక్కలను పట్టుకున్నారు. జిల్లాలో వీధి కుక్కల వరుస దాడులతో ప్రజలను ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో సంబంధిత నిజామాబాద్ మున్సిపల్ అధికారులు స్పందించారు. ఏబీసీ (యానిమల్ బర్త్ కంట్రోల్) ఇన్ఛార్జి నటరాజ్ గౌడ్, సూపర్వైజర్ సునీల్ నేతృత్వంలో పలు కాలనీల్లో కుక్కలను పట్టుకున్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో వీధి కుక్కలను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు ప్రతిరోజూ ఒక్కో ఏరియాలో తిరుగుతారని తెలిపారు. నగరవాసులకు కుక్కలతో ఇబ్బందులు ఉంటే కంట్రోల్ రూం (08462-220234) కు ఫోన్ చేయాలని సూచించారు.