పశువుల అక్రమ రవాణా

పశువుల అక్రమ రవాణా– ఊపిరాడక కంటైనర్‌లోని 15 ఎద్దులు మృత్యువాత
– పోలీసుల అదుపులో ఇద్దరు వ్యక్తులు
నవతెలంగాణ-మఠంపల్లి
కంటైనర్‌లో ఎద్దులను అక్రమంగా తరలిస్తుండగా ఊపిరాడక 15 ఎద్దులు మృత్యువాత పడ్డాయి. ఈ ఘటనలో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన బుధవారం సూర్యాపేట జిల్లా మట్టపల్లి చెక్‌పోస్ట్‌ వద్ద జరిగింది. ఎస్‌ఐ రామాంజనేయులు తెలిపిన వివరాల ప్రకారం.. తమిళనాడుకు చెందిన ఇద్దరు ఈనెల 28న సాయంత్రం సూర్యాపేట నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని సత్యసాయి జిల్లా కదిరికి కంటైనర్‌లో అక్రమంగా 26 ఎద్దులను తరలిస్తుండగా మట్టపల్లి చెక్‌పోస్ట్‌ వద్ద పోలీసులు పట్టుకున్నారు. కంటైనర్‌ ఓపెన్‌ చేసి పరిశీలించగా అందులో 15 ఎద్దులు ఊపిరి ఆడక అప్పటికే మృత్యువాతపడ్డాయి. కాళ్లు విరిగాయి. ప్రాణంతో ఉన్న 9 ఎద్దులను నల్లగొండ గోశాలకు తరలించారు. గాయపడిన వాటికి చికిత్స అందించారు. ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.