– మణిపూర్ హింస
ఇంఫాల్ : ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో చెలరేగిన జాతి హింసలో నాగా మహిళ హత్య కేసులో సీబీఐ చార్జిషీట్‌ను దాఖలు చేసింది. ఈ ఏడాది జులై 15న 55 ఏండ్ల నాగా మహిళను హత్య చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎనిమిది మంది పేర్లను సీబీఐ చార్జిషీట్‌లో పేర్కొన్నది. ఇంఫాల్ తూర్పు జిల్లా సావోంబంగ్ గ్రామంలో మహిళ హత్యకు గురైంది. మెయిటీ మిలిటెంట్ గ్రూప్ అరంబై టెంగోల్ సభ్యులు ఆమెను హత్య చేశారని యునైటెడ్ నాగా కౌన్సిల్ ఆరోపించింది. మరేమ్‌ను మీరా పైబిస్ అనే మెయిటీ మహిళల సంఘం పట్టుకుని, ఉరిశిక్ష కోసం అరంబై టెంగోల్‌కు అప్పగించిందని కూడా వెల్లడించింది. ఈ కేసులో ఛార్జిషీట్‌ను గువహతిలోని ప్రత్యేక సీబీఐ జడ్జి ముందు దాఖలు చేసినట్టు సీబీఐ ఒక ప్రకటనలో తెలిపింది. ”జులై 15 న మధ్యాహ్నం 12.10 గంటలకు సావోంబంగ్ గేట్ వద్ద సాయుధ దుండగులతో సహా 100 మంది వ్యక్తులతో కూడిన గుంపు బలవంతంగా ఒక మహిళను నిర్బంధించింది. అదే రోజు మహిళ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో నిందితుల ప్రమేయం ఉన్నట్టు సీబీఐ విచారణలో తేలింది. ఇతర నిందితులను గుర్తించేందుకు దర్యాప్తు కొనసాగిస్తున్నాం” అని సీబీఐ పేర్కొన్నది. మణిపూర్‌లో మెయిటీలు మెజారిటీగా ఉండగా.. తర్వాత నాగాలు రెండో అతిపెద్ద సమూహంగా ఉన్నారు. మణిపూర్‌లో ఈ ఏడాది మే 3 నుంచి మెయిటీలు, కుకీల మధ్య జాతి సంఘర్షణ జరుగుతున్నది. ఈ హింసాకాండలో 200 మందికి పైగా మరణించగా.. దాదాపు 60,000 మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు.