సైబర్‌ నేరగాళ్లపై సీబీఐ

– 11 రాష్ట్రాల్లో 76 చోట్ల సోదాలు
– క్రిప్టో మోసాలపైనా దృష్టి
న్యూఢిల్లీ : సైబర్‌ నేరగాళ్లపై సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ (సీబీఐ) మరోమారు గురి పెట్టింది. ఆర్థిక నేరాలకు పాల్పడుతున్న వారిని లక్ష్యంగా చేసుకుని జాతీయ, అంతర్జాతీయ ఎజెన్సీల సహకారంతో 11 రాష్ట్రాల్లోని 76 చోట్ల సోదాలు నిర్వహించింది. ఆర్థిక మోసాలకు సంబంధించి ఐదు వేర్వేరు కేసులు నమోదు చేసిన సీబీఐ ఆపరేషన్‌ ”చక్రా-2” పేరుతో దాడులు చేసింది. ఫైనాన్షియల్‌ ఇంటలిజెన్స్‌ యూనిట్‌ (ఎఫ్‌ఐయూ) ఇచ్చిన సమాచారంతో క్రిప్టో కరెన్సీ మోసాలకు పాల్పడుతూ దాదాపు రూ.100 కోట్ల మోసానికి సంబంధించి సీబీఐ కేసు నమోదు చేసింది. కాల్‌ సెంటర్లను ఏర్పాటు చేసుకొని సాంకేతిక సహాయ సిబ్బందిగా వ్యవహరిస్తూ విదేశీయులే లక్ష్యంగా కొందరు మోసాలకు పాల్పడుతున్నారంటూ అమెజాన్‌, మైక్రోసాఫ్ట్‌ కంపెనీలు ఫిర్యాదు చేయడంతో సీబీఐ కేసులు నమోదు చేసింది. ఎఫ్‌ఐయు, ఎఫ్‌బీఐ, ఇంటర్‌పోల్‌తోపాటు ఇతర అంతర్జాతీయ విభాగాల నుంచి అందిన సమాచారం మేరకు ఆపరేషన్‌ చక్ర-2 చేపట్టినట్టు సీబీఐ వర్గాలు తెలిపాయి.ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, కర్నాటక, హిమాచల్‌ప్రదేశ్‌, హర్యానా, కేరళ, తమిళనాడు, పంజాబ్‌, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్‌ తదితర రాష్ట్రాల్లో ఐదు కేసులకు సంబంధించి సోదాలు నిర్వహించారు.. తాజా సోదాల్లో తొమ్మిది కాల్‌ సెంటర్లపై దాడులు చేశారు. మరో రెండు కేసులకు సంబంధించిన సమాచారం వెల్లడి కావాల్సి ఉంది. ఈ ఆపరేషన్‌లో 32 మొబైల్‌ ఫోన్‌లు, 48 ల్యాప్‌టాప్‌లు, హార్డ్‌ డిస్క్‌లు, రెండు సర్వర్లను, 33 సిమ్‌ కార్డులు, పెన్‌ డ్రైవ్‌లను స్వాధీనం చేసుకున్నారు. పెద్ద సంఖ్యలో బ్యాంకు ఖాతాలు కూడా స్తంభింపజేసింది. 15 ఇమెయిల్‌ ఖాతాల డంప్‌ను స్వాధీనం చేసుకుంది. ఇందులో నిందితులకు సంబంధించిన మోసాల కీలక సమాచారం లభ్యం అయ్యిందని సమాచారం. నిందితుల కాల్స్‌ను గుర్తించకుండా తప్పించుకోవడానికి వాయిస్‌ ఓవర్‌ ఇంటర్నెట్‌ ప్రోటోకాల్‌ టెక్నాలజీని ఉపయోగించారని అధికారులు గుర్తించారు. ఈ సోదాల్లో సీబీఐ అధికారులకు అనేక రాష్ట్రాల పోలీసు సైబర్‌ మోసాల విభాగాలు సహకరించాయి.