– లోక్‌సభ ఎన్నికలకు ముందు ప్రతిపక్షాలపై కేంద్రం దాడులు
న్యూఢిల్లీ : లోక్‌సభ ఎన్నికలకు కౌంట్‌డౌన్ సమీపిస్తున్న తరుణంలో..ప్రతిపక్షాలపై కేంద్రం దాడులకు దిగుతోంది. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఎనిమిది సార్లు సమన్లు జారీ చేసింది. జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌ని కూడా అవినీతి ఆరోపణలపై అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా అక్రమ మైనింగ్ కేసులో సమాజ్ వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) బుధవారం సమన్లు జారీ చేసింది. సాక్షిగా విచారణకు హాజరుకావాలని సమన్లలో పేర్కొంది. గురువారం దర్యాప్తు సంస్థ ప్రశ్నించే అవకాశం ఉన్నట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. అఖిలేశ్ యాదవ్ 2012 నుంచి జూన్, 2013 మధ్య మైనింగ్ శాఖను నిర్వహించారు. ఉత్తరప్రదేశ్‌లోని ఏడు జిల్లాలు, షామ్లీ, కౌశాంబి, ఫతేపూర్, డియోరియా, సహరాన్‌పూర్, హమీర్‌పూర్ , సిద్ధార్థనగర్ ప్రాంతాల్లో అక్రమ మైనింగ్ కేసులు నమోదయ్యాయి. 2012 నుంచి 2016 మధ్య కాలంలో నిబంధనలను పాటించకుండా ప్రభుత్వ అధికారులు కొన్ని అక్రమ మైనింగ్ స్థలాలను కేటాయించారని ఆరోపణలు ఉన్నాయి. ఎన్‌జీటీ ఆదేశాలను ఉల్లంఘించి మైనింగ్ హక్కులు కూడా ఇచ్చారని సీబీఐ పేర్కొంది.