– మార్కెట్‌లోకి పాత, కొత్త పత్తి
– దళారులు, సిండికేట్ వ్యాపారుల కుమ్మక్కు
– కొనుగోళ్లు ప్రారంభించని జిన్నింగ్ మిల్లులు
– కేంద్రం ప్రకటించిన ఎంఎస్పీ రూ.7020 మాత్రమే
– పత్తికి గిట్టుబాటు ధర కల్పించాలి:రైతు సంఘం
నవతెలంగాణ-మెదక్ ప్రాంతీయ ప్రతినిధి
ఈ ఏడాది ఖరీప్ సీజన్‌లో వర్షాభావ పరిస్థితులెదురైనా ఒకటికి రెండు సార్లు విత్తనాలు విత్తుకుని రైతులు పత్తిని సాగు చేశారు. తెల్ల బంగారం సాగు కలిసొస్తే తమ రెక్కల కష్టానికి ఫలితం దక్కుతుందన్న ఆశతో పత్తి సాగుపై రైతులు ఆసక్తి చూపుతున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా సుమారు ఐదున్నర లక్షల ఎకరాల్లో పత్తి సాగైంది. గతేడాది పత్తి కొంత నిల్వ ఉంది. ఈ సీజన్ పత్తి కూడా చేతికొస్తుండటంతో మార్కెట్‌కు తీసుకెళ్తున్నారు. కాగా, కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) మాత్రం జాడలేదు. బహిరంగ మార్కెట్‌లో దళారుల జోక్యం, సిండికేట్ వ్యాపారుల కుమ్మక్కు చర్యల వల్ల పత్తి రైతులు నిలువు దోపిడికి గురవుతున్నారు. కేంద్రం ప్రకటించిన కనీస మద్దతు ధర నామమాత్రంగా ఉండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
ఉమ్మడి మెదక్ జిల్లాలో పత్తి సాగు గణనీయంగా పెరుగుతోంది. సంగారెడ్డి జిల్లాలో 3,58,690 ఎకరాలు, సిద్దిపేట జిల్లాలో 1,09,430 ఎకరాలు, మెదక్ జిల్లాలో 48,500 ఎకరాల్లో పత్తి సాగైంది. మూడు జిల్లాల్లో కలిపి 5.16 లక్షల ఎకరాల్లో పత్తి సాగైంది. సగటు దిగుబడుల్ని బట్టి 51 లక్షల క్వింటాళ్ల పత్తి దిగుబడులు వచ్చే అవకాశముందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. అధిక వర్షాలు పడకపోవడంతో పత్తి దిగుబడులు ఆశించిన మేరకు వచ్చే అవకాశముందని రైతులు పేర్కొంటున్నారు. ఇప్పటికే పలు చోట్ల ముడి పత్తి చేతికొస్తుంది. పత్తి కాయలు విచ్చుకుంటున్న దశలో పైర్లున్నాయి. పత్తి తీత పనులు షురూ అవ్వడంతో రైతులు ఈ సీజన్ పత్తితో పాటు నిల్వ చేసిన గత సీజన్ పత్తిని మార్కెట్‌కు తీసుకొస్తున్నారు. నవంబర్ మొదటి వారం నుంచి కొత్త పత్తి ఎక్కువ మొత్తంలో మార్కెట్‌కు తేనున్నారు.
ఏటేటా పెరుగుతున్న సాగు ఖర్చులు
సస్య విప్లవం పేరిట హైబ్రీడ్ విత్తనాలు వచ్చాయి. దిగుబడులు కొద్దిమేరకు పెరిగినా ఆ మేరకు తెగుళ్ల బెడద అధికమై సాగు ఖర్చులు విపరీతంగా పెరిగాయి. జూన్ చివరి వరకు వర్షాలు పడకపోయే సరికి రైతులు కొద్దిపాటి జల్లులకు విత్తనాలు వేశారు. ఆ తర్వాత జులైలో వర్షాలు పడటంతో రెండో సారి కూడా విత్తనాలు విత్తుకోవాల్సి వచ్చింది. దాంతో విత్తన ఖర్చులు పెరిగాయి. పైర్లు ఎదుగుతున్న దశలో ఏపు పురుగు, ఎర్రగులాబీ వంటి తెగుళ్ల బెడద వల్ల ఎరువులు, పురుగు మందుల్ని అధికంగా వాడాల్సి వచ్చింది. పత్తి సాగు ఖర్చులే కాకుండా కౌలు రేట్లు కూడా పెరిగాయి. దాంతో 60 శాతంగా ఉన్న కౌలు రైతులపై సాగు పెట్టుబడుల భారం పెరిగింది. ఆగస్టు, సెప్టెంబర్‌లో వాతావరణం బాగుండటంతో పత్తి పైర్లు ఏపుగా పెరిగాయి. ఎర్రనేలల్లో ఎకరానికి 7 నుంచి 8 క్వింటాళ్ల వరకు, నల్లరేగడి నేలల్లో పది క్వింటాళ్ల వరకు దిగుబడులు వచ్చే అవకాశముందని రైతులు పేర్కొంటున్నారు. పత్తి దిగుబడులు వచ్చే సమయంలో మద్దతు ధరలు ఆశించిన మేరకు లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. సీసీఐ ద్వారా కొనుగోలు చేసేందుకు ఎక్కడా కేంద్రాల్ని పెట్టలేదు. ముడి పత్తి తెంపి అమ్ముకుంటే పెట్టుబడుల భారాల నుంచి కొంత ఉపసమనం కలుగుతుందని రైతులు ఆశిస్తున్నారు.
జాడలేని సీసీఐ.. జిన్నింగ్ మిల్లులే దిక్కు
గత సీజన్ పత్తిని కొనుగోలు చేయని సీసీఐ.. కనీసం ఈ సీజన్‌లోనైనా ముందస్తుగా కొనుగోలు కేంద్రాలు పెట్టాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. గత సీజన్‌లో పత్తి ధరలు హెచ్చుతగ్గులుండటంతో ధర పెరుగుతుందన్న ఆశతో రైతులు నిల్వ చేసుకున్నారు. ఎక్కువ కాలం నిల్వ ఉంచినా ధర రాకపోవడంతో తక్కువ ధరలకే అమ్ముకున్నారు. ఇప్పటికే ఉమ్మడి మెదక్ జిల్లాలో రైతులు గత సీజన్ పత్తిని నిల్వ ఉంచారు. రాష్ట్రంలో గత సీజన్‌లో సీసీఐ 87 కొనుగోలు కేంద్రాల్ని పెట్టినట్టు చెప్పినా ఎక్కడా కొనుగోళ్లు చేయలేదు. పత్తి సాగు అధికంగా ఉన్న సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లో ఇప్పటి వరకు సీసీఐ ఎన్ని కొనుగోలు కేంద్రాల్ని ఎక్కడెక్కడ పెట్టబోతుందన్న విషయాన్ని ప్రకటించలేదు. సిద్దిపేట జిల్లాలో 23, సంగారెడ్డి జిల్లాలో 30 కాటన్, జిన్నింగ్ మిల్లులున్నాయి. వీటిల్లో కొన్ని మిల్లుల్లోనే పత్తి కొనుగోళ్లు చేయనున్నారు. ఈ సారి కూడా జిన్నింగ్ మిల్లుల్లోనే పత్తి కొనుగోలు నిర్వహిస్తామని ఇప్పటికే సంగారెడ్డి జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ ప్రకటించారు. నూలు ధారం విక్రయాలు ఆశించిన మేరకు లేనందున ఆ ప్రభావంతో అంతర్జాతీయంగా బేళ్ల కొనుగోలు తగ్గనున్నట్టు చెబుతున్నారు. అందుకే జిన్నింగ్ మిల్లుల యజమానులు కూడా పత్తి కొనుగోలు విషయంలో ఆచితూచి చేయాలని అనుకుంటున్నట్టు తెలుస్తోంది. సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లో ఏ ఒక్క జిన్నింగ్ మిల్లు కూడా పత్తి కొనుగోళ్లను షురూ చేయలేదు.
గిట్టుబాటు కాని ఎంఎస్పీ ధర
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్ధతు ధర పత్తి రైతులకు గిట్టుబాటు కాని పరిస్థితి ఉంది. ఏటేటా సాగు ఖర్చులు పెరుగుతున్నాయి. వాతావరణ మార్పుల వల్ల పంట నష్టం వాటిల్లుతుంది. నాణ్యమైన పత్తికి క్వింటాల్‌కు రూ.7020 మద్దతు ధరగా ప్రకటించారు. 8 శాతం లోపు తేమ ఉన్న పత్తికి మాత్రమే మద్దతు ధర వర్తిస్తుంది. తేమ 8 శాతానికి ఎక్కువ ఉంటే ఎంఎస్పీ ఇవ్వని పరిస్థితి ఉంది. దీన్ని ఆసరా చేసుకుని బహిరంగ మార్కెట్‌లో దళారులు రైతుల్ని నిలువు దోపిడి చేస్తున్నారు. సిండికేట్ వ్యాపారులు సైతం కుమ్మకై రైతులను మోసం చేస్తున్నారు. పత్తి ధరల్ని పరిశీలిస్తే.. మే, జూన్‌లో రూ.7 వేల నుంచి 7450 ఉండగా జులైలో రూ.7350 ఉంది. ఆగస్టులో రూ.7650 ఉండగా సెప్టెంబర్‌లో రూ.7550 పలికింది. ప్రస్తుతం రూ.8 వేలు ఉన్నప్పటికీ దళారులు, వ్యాపారులు మాత్రం ఏడు వేల లోపే కొంటామని చెబుతున్నారు. గత సీజన్‌లో రైతులు తీసుకొచ్చే పత్తికి సీసీఐ అనేక కొర్రీలు చెప్పి కొనుగోలుకు నిరాకరించింది. అదే పత్తిని జిన్నింగ్ మిల్లుల యజమానులు కొనుగోలు చేసి సీసీఐకి ఇస్తే వాళ్లకు మాత్రం మద్దతు ధర ఇచ్చారు.
గిట్టుబాటు ధర కల్పించాలి
పత్తి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి. కేంద్రం ప్రకటించిన ఎంఎస్పీ పెట్టుబడులకు సరిపోవడంలేదు. సీసీఐ రైతుల నుంచి కాకుండా వ్యాపారులు, మిల్లుల నుంచి కొనుగోలు చేస్తుంది. మార్కెట్‌లో దళారుల చేతుల్లో రైతులు మోసపోతున్నారు. ప్రభుత్వ పత్తికి మద్దతు ధర రూ.10 వేలు ప్రకటించాలి. దళారులు, వ్యాపా రుల దోపిడిని అరికట్టాలి.
: గొల్లపల్లి జయరాజు, రైతు సంఘం రాష్ట్ర నాయకులు