– కొబ్బరి సాగుతోనూ అదనపు ఆదాయం – ఉద్యాన అధికారి సందీప్
– ఎఫ్.పి.ఒ ఏర్పాటుతో అనేక ప్రయోజనాలు – ఎం.ఒ నవీన్
– సాగుదారుల ప్రయోజనాలే ఎఫ్.పి ఒ ల ధ్యేయం – నాయకులు ఆలపాటి రామ్మోహన్ రావు
నవతెలంగాణ – అశ్వారావుపేట
తెలంగాణ లో కొబ్బరి సాగు పెంపుదలే లక్ష్యంగా కొబ్బరి అభివృద్ధి మండలి కృషి చేస్తుందని,అందుకోసం సాగు విస్తీర్ణం పధకంలో భాగంగా రైతులకు అనేక రాయితీలు,అవగాహణ శిబిరాలు,కోత కూలీలకు భీమా సౌకర్యం లాంటి సదుపాయాలు కల్పిస్తున్నామని కొబ్బరి అభివృద్ధి మండలి (సీడీబీ) ప్రాంతీయ క్షేత్రాధికారి సురేష్ తెలిపారు. తెలంగాణ కొబ్బరి సాగుదారుల,ఉత్పత్తిదారుల సమావేశం సంఘం రాష్ట్ర కార్యదర్శి కొక్కెరపాటి పుల్లయ్య అధ్యక్షతన స్థానిక రైతు వేదికలో బుధవారం నిర్వహించారు. ఇందులో ముఖ్య అతిథిగా పాల్గొన్న సురేష్ మాట్లాడుతూ 2022 – 2023 ఆర్ధిక సంవత్సరం లో 109 మంది రైతులకు,145 హెక్టార్ లకు మొక్క రాయితీ మొదటి సంవత్సరం కు గానూ రూ.4 లక్షల 71 వేయి 3 వందలు 70 లు రైతుల ఖాతాల్లో జమ చేసామని అన్నారు.రెండో సంవత్సరానికి రైతులు దరఖాస్తులు చేస్తున్నారని అన్నారు.2023 2024 ఆర్ధిక సంవత్సరంలో 55 మంది రైతులకు మొదటి సంవత్సరం మొక్కలు రాయితీ రూ. 1 లక్ష,98 వేల 5 వందల 83 లు చెల్లించామని తెలిపారు. ఉద్యాన అధికారి సందీప్ మాట్లాడుతూ అశ్వారావుపేట నియోజక వర్గంలో సుమారు నాలుగు వేల ఎకరాల్లో వేయి మంది రైతులు సాగు చేస్తున్నారని, సాగు చేసే ప్రతీ రైతు కొబ్బరి అభివృద్ధి మండలి అందజేసే రాయితీలు కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వ్యవసాయాధికారి నవీన్ మాట్లాడుతూ సాగుదారుల,ఉత్పత్తి దారుల సమాఖ్యల తో కేంద్ర ప్రభుత్వం,నాబార్డ్ లాంటి సంస్థలు ఆర్ధిక పరపతి కల్పిస్తారని,దీని ద్వారా కొబ్బరి ఉప ఉత్పత్తులతో కుటీర పరిశ్రమలు స్థాపించి రైతులు ఆర్ధికాభివృద్ధి సాధించవచ్చని ఆశాభావం వ్యక్తం చేసారు.కొబ్బరి రైతుల,ఉత్పత్తి దారులు సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఆలపాటి రామ్మోహన్ రావు (రాము) మాట్లాడుతూ కొబ్బరి సాగుదారుల ప్రయోజనం కోసమే ఎఫ్.పి.ఓ లు పని చేస్తాయని,ఎన్ని ఎక్కువ ఎఫ్.పి.ఒ లు ఏర్పాటు చేసుకుంటే రైతులకు అంత మేలు జరుగుతుందని అన్నారు. ఈ సమావేశంలో కొబ్బరి సాగు దారులు నున్నా క్రిష్ణ,తుంబూరు ఉమామహేశ్వర రెడ్డి,సీమకుర్తి వెంకటేశ్వరరావు,మోరంపుడి శ్రీనివాసరావు,దొడ్డా లక్ష్మినారాయణ లు పాల్గొన్నారు.