– 11 వరకు అభ్యంతరాల స్వీకరణ : టీజీపీఎస్సీ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖలో చైల్డ్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టు ఆఫీసర్ (సీడీపీవో) పరీక్షకు సంబంధించిన ప్రాథమిక కీని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) విడుదల చేసింది. ఈ మేరకు టీజీపీఎస్సీ కార్యదర్శి ఈ నవీన్ నికోలస్ బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈనెల మూడు, నాలుగు తేదీల్లో సీడీపీవో పరీక్షలు జరిగాయని తెలిపారు. రెస్పాన్స్ షీట్లను టీజీపీఎస్సీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచామని పేర్కొన్నారు. వచ్చేనెల ఏడో తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు అందుబాటులో ఉంటాయని వివరించారు. ఆ తర్వాత అందుబాటులో ఉండబోవని తెలిపారు. ప్రాథమిక కీపై అభ్యంతరాలను గురువారం నుంచి ఈనెల 11వ తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు స్వీకరిస్తామని పేర్కొన్నారు. టీజీపీఎస్సీ వెబ్‌సైట్‌లో లింకు ఇచ్చామనీ, దాని ద్వారా ఇంగ్లీష్‌లోనే అభ్యంతరాలను పంపాలని కోరారు. ఇతర వివరాల కోసంwww.tspsc.gov.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచించారు. సీడీపీవో పోస్టులకు రాష్ట్రవ్యాప్తంగా 19,812 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. వారిలో 15,910 (80.30 శాతం) మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరయ్యారు. 23 సీడీపీవో పోస్టుల భర్తీకి 2022 సెప్టెంబర్ ఐదున టీజీపీఎస్సీ నోటిఫికేషన్‌ను జారీ చేసిన విషయం తెలిసిందే.