నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖలో చైల్డ్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టు ఆఫీసర్ (సీడీపీవో ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్) పరీక్షను రద్దు చేస్తున్నట్టు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) ప్రకటించింది. ఈ మేరకు టీజీపీఎస్సీ కార్యదర్శి ఈ నవీన్ నికోలస్ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. సీడీపీవో పోస్టుల భర్తీకి గతేడాది జనవరి మూడు నుంచి ఎనిమిదో తేదీ వరకు నిర్వహించిన రాతపరీక్షలను రద్దు చేస్తున్నట్టు తెలిపారు. సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబోరేటరీ (సీఎఫ్‌ఎస్‌ఎల్) నివేదిక ఆధారంగా ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) చర్చించి ఈ నిర్ణయం తీసుకుందని పేర్కొన్నారు. పరీక్ష నిర్వహించే తేదీలను త్వరలో ప్రకటిస్తామని వివరించారు.