పార్లమెంట్‌లో సీఈసీ, ఈసీ నియామక బిల్లు

పార్లమెంట్‌లో సీఈసీ, ఈసీ నియామక బిల్లు

– ఈ బిల్లు ప్రజాస్వామ్య పునాదులకే ప్రమాదమన్న ప్రతిపక్షాలు
–  రాజ్యసభ నుంచి వాకౌట్‌
–  లోక్‌సభలో రెండు బిల్లులకూ ఆమోదం
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌, ఇతర ఎలక్షన్‌ కమిషనర్ల (నియామకం, సర్వీస్‌ షరతులు , పదవీకాలం) బిల్లును రాజ్యసభ ఆమోదించింది. ఈ బిల్లు ఎన్నికల సంఘం స్వతంత్రతను తొలగించి ప్రభుత్వ కమిటీగా కుదించిందని ఆరోపిస్తూ ప్రతిపక్షాలు రాజ్యసభ నుంచి వాకౌట్‌ చేశాయి. ప్రధాని, లోక్‌సభలో ప్రతిపక్ష నేత, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో కూడిన కమిటీని ఏర్పాటు చేయాలంటూ ఐదుగురు సభ్యుల సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పును అధిగమించేందుకు మోడీ ప్రభుత్వం బిల్లు తీసుకొచ్చింది. మంగళవారం రాజ్యసభలో ఈ బిల్లును కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘ్వాల్‌ ప్రవేశపెట్టారు. అనంతరం ఈ బిల్లుపై చర్చ జరిగింది. వివిధ పార్టీల నేతలు మాట్లాడిన తరువాత బిల్లు మూజువాణి ఓటుతో ఆమోదం పొందింది. కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘ్వాల్‌ మాట్లాడుతూ ఈ బిల్లు సుప్రీంకోర్టు తీర్పునకు వ్యతిరేకం కాదని, ఇది అత్యున్నత న్యాయస్థానం అందించిన సూచనలపై ఆధారపడి ఉందని అన్నారు.
బిల్లులో ఏముంది?
ప్రధానమంత్రి, లోక్‌సభలో ప్రతిపక్ష నేత, కేంద్ర మంత్రితో కూడిన కమిటీ ఎన్నికల కమిషనర్లను నిర్ణయించాలని బిల్లు నిర్దేశించింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి స్థానంలో కేంద్ర మంత్రిని పెట్టారు. ప్రధాన ఎన్నికల కమిషనర్‌, కమిషనర్‌లకు సుప్రీంకోర్టు న్యాయమూర్తులతో సమానమైన జీతం, ప్రయోజనాలు లభిస్తాయని ప్రభుత్వం బిల్లులో సవరణ తెచ్చింది. తొలిసారిగా ప్రవేశపెట్టిన బిల్లులో కేబినెట్‌ సెక్రటరీకి సమానంగా జీతం ఇవ్వాలని నిబంధన పెట్టారు. ఇది ఎన్నికల కమిషనర్ల స్థాయిని తగ్గించినట్లేనన్న విమర్శలు తలెత్తినప్పుడు ప్రభుత్వమే సుప్రీంకోర్టు న్యాయమూర్తికి జీతం చెల్లించేలా సవరణ తీసుకొచ్చింది.
ప్రధాన ఎన్నికల కమిషనర్‌, కమిషనర్లు తమ విధులను నిర్వర్తిస్తున్నప్పుడు అన్ని క్రిమినల్‌ , సివిల్‌ దావాల నుంచి రక్షణను కూడా బిల్లు అందిస్తుంది. జాబితాను సిద్ధం చేయాల్సిన సెర్చ్‌ కమిటీని కూడా మార్చారు. మొదటి ప్రతిపాదిత బిల్లులో క్యాబినెట్‌ కార్యదర్శి, మరో ఇద్దరు సీనియర్‌ అధికారులతో కూడిన సెర్చ్‌ కమిటీ ఎన్నికల కమిషనర్‌ పదవికి పరిగణించదగిన వారి జాబితాను సిద్ధం చేయాల్సి ఉంది. సెర్చ్‌ కమిటీ ఐదుగురిని సిఫారసు చేయవచ్చు. అయితే క్యాబినెట్‌ సెక్రెటరీ స్థానంలో న్యాయశాఖ మంత్రిని సెర్చ్‌ కమిటీకి అధిపతిగా నియమిస్తూ ప్రభుత్వం సవరణ తీసుకొచ్చింది.
బిల్లుపై ప్రతిపక్షాల చర్చ..
కాంగ్రెస్‌ ఎంపీ ఐమీ యాజ్నిక్‌ మాట్లాడుతూ ఎన్నికల సంఘంపై ఎవరిది అధికారమని సూటిగా ప్రశ్నించారు. ఈ బిల్లు మన ప్రజాస్వామ్య పునాదిని కదిలించేలా ఉందని టీఎంసీ ఎంపీ జవహర్‌ సిర్కార్‌ అన్నారు. ”ప్రజాస్వామ్యం స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికలపై ఆధారపడి ఉంది” అని అన్నారు. బిల్లులోని క్లాజ్‌ 8 మరింత ప్రమాదకరమని అన్నారు. ”(ఇది) ఎవరినైనా చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌, ఎలక్షన్‌ కమిషనర్‌లుగా నియమించవచ్చని చెబుతోంది. మీరు ప్రమాదకరమైన దృష్టాంతాన్ని తెరుస్తు న్నారు!” అంటూ మోడీ సర్కార్‌ పై విమర్శలు గుప్పించారు. ఈ బిల్లు రిగ్గింగ్‌ను చట్టబద్ధం చేయడానికి దారి తీస్తుందని అన్నారు.
సుప్రీంకోర్టు నిర్ణయాలను బీజేపీ ప్రభుత్వం గౌరవించడం లేదని అని ఆప్‌ ఎంపి రాఘవ్‌ చద్దా ఆరోపించారు. ”ఈ బిల్లు దేశంలో మిగిలి ఉన్న కొన్ని స్వతంత్ర సంస్థల్లో ఒకటైన ఎన్నికల కమిషన్‌ను నాశనం చేస్తుంది. తద్వారా దేశం నుంచి స్వేచ్ఛాయుతమైన, నిష్పాక్షికమైన ఎన్నికలను తరిమికొడుతుంది” అని చద్దా అన్నారు. ఈ బిల్లు , భారత ప్రధాన న్యాయమూర్తిని అగౌరవపరిచేదిగా ఉందని కూడా పేర్కొన్నారు.
లోక్‌సభలో రెండు బిల్లులు ఆమోదం
కేంద్ర పాలిత ప్రాంతాలు జమ్మూ కాశ్మీర్‌, పుదుచ్చేరి అసెంబ్లీలలో మహిళా రిజర్వేషన్‌ను లోక్‌సభ ఆమోదించింది. లోక్‌సభ కేంద్రపాలిత ప్రాంతాల (సవరణ) బిల్లు, జమ్మూ కాశ్మీర్‌ పునర్వ్యవస్థీకరణ (రెండవ సవరణ) బిల్లుని మూజువాణి ఓటుతో ఆమోదించింది. అలాగే 2023-2024కి మొదటి బ్యాచ్‌ – గ్రాంట్స్‌ కోసం అనుబంధ డిమాండ్లను కూడా లోక్‌సభ మూజువాణి ఓటుతో ఆమోదించింది. అదేవిధంగా, కన్సాలిడేటెడ్‌ ఫండ్‌ నుండి నిర్దిష్ట మొత్తాల చెల్లింపులు, 2020-2021కి అదనపు గ్రాంట్ల డిమాండ్‌లను ముజువాణి ఓటుతో లోక్‌సభ ఆమోదించింది.
లోక్‌సభలో మూడు క్రిమినల్‌ చట్టాల సవరణ బిల్లులు
మూడు క్రిమినల్‌ లా బిల్లులను మార్పులు చేసిన తరువాత మంగళవారం తిరిగి లోక్‌సభలో కేంద్ర హౌం మంత్రి అమిత్‌ షా సవరణ బిల్లుల్ని ప్రవేశపెట్టారు. ఆగస్టులో లోక్‌సభలో ప్రవేశపెట్టిన మూడు కొత్త క్రిమినల్‌ లా బిల్లులను ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ బిల్లులు ఆగస్టు 18న హౌం వ్యవహారాల పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ పరిశీలనకు పంపారు. పార్లమెంటరీ ప్యానెల్‌ చేసిన సిఫారసులలో కొన్నింటిని చేర్చడం కోసం ఇప్పుడు బిల్లులను ఉపసంహరించుకున్నట్టు కేంద్ర హౌంమంత్రి అమిత్‌ షా సభకు తెలిపారు. అయితే పునర్నిర్మించిన బిల్లులను మంగళవారం ప్రవేశపెట్టారు.
ఇండియన్‌ పీనల్‌ కోడ్‌ (ఐపీసీ), ఇండియన్‌ ఎవిడెన్స్‌ యాక్ట్‌ (ఐఈఎ), క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌ (సీఆర్పీసీ)లను మార్చుతూ భారతీయ న్యాయ సంహిత (బిఎన్‌ఎస్‌) బిల్లు, భారతీయ సాక్ష్యా అధినియం (బిఎస్‌) బిల్లు, భారతీయ నాగరిక్‌ సురక్ష సంహిత (బిఎన్‌ఎస్‌ఎస్‌) బిల్లుగా తీసుకొచ్చారు. ఈ సందర్భంగా అమిత్‌ షా మాట్లాడుతూ ”మూడు బిల్లులలో ప్రధాన మార్పులు 3-4 ఉపవిభాగాలలో ఉన్నాయి. ఇతర మార్పులు ప్రధానంగా వ్యాకరణ స్వభావాన్ని కలిగి ఉంటాయి. బిల్లుల మార్పులపై గురువారం 12 గంటల పాటు చర్చ జరుగుతుంది. అప్పుడు సమాధానం చెబుతాం” అని ఆయన పునరుద్ఘాటించారు. బిల్లులను కూలంకషంగా అధ్యయనం చేసేందుకు తగిన సమయం ఇవ్వాలని ప్రతిపక్ష ఎంపీలు డిమాండ్‌ చేశారు.