
నవతెలంగాణ – ఆళ్ళపల్లి
మండల కేంద్రంతో పాటు మర్కోడు, అనంతోగు, కాచనపల్లి, మామకన్ను, మర్రిగూడెం, తదితర గ్రామాల్లో ముస్లింలు రంజాన్ (ఈదుల్ ఫితర్) పర్వదినాన్ని గురువారం ఘనంగా జరుపుకున్నారు. ఈ ఏడాది రంజాన్ మాసంలో 30 రోజుల పాటు కఠిన ఉపవాసాలు పాటించి బుధవారం నింగిలో నెలవంక కనిపించడంతో ముస్లింలు రంజాన్ పండుగ భక్తిశ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు. అందులో భాగంగా ఆళ్ళపల్లి, అనంతోగు, మామకన్ను గ్రామాల ముస్లింలు మండల కేంద్రంలోని ఈద్గాలో, మర్కోడు, కాచనపల్లి, మర్రిగూడెం గ్రామాల్లో మసీదులో మత పెద్దలు షామినాలు ఏర్పాటు చేసి గురువులతో సామూహికంగా ప్రత్యేక నమాజ్ లు నిర్వహించారు. దీనికి గాను స్థానిక పోలీస్ స్టేషన్ ఎస్సై ఈ.రతీష్ ఆదేశాల మేరకు ఏఎస్ఐ వెంకట్ రెడ్డి సిబ్బందితో గస్తీ చర్యలు చేపట్టారు. నమాజ్ అనంతరం ఈద్గాలో ముస్లిం సోదరులు పరస్పరం ఆలింగనం (అలైబలై) చేసుకుని పర్వదిన శుభాకాంక్షలు తెలుపుకున్నారు. తదనంతరం స్థానిక ఎంపీపీ కోండ్రు మంజు భార్గవి, అక్షర సమిధ వ్యవస్థాపకులు ఊకె కిశోర్ బాబు దంపతులు పలువురు ముస్లింల ఇండ్లను సందర్శించి, పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఎంపీపీ దంపతులు వారి ఆతిథ్యాన్ని స్వీకరించారు. వారి వెంట టీఆర్ఎస్ నాయకులు ప్రవీణ్, నరేష్, కిరణ్ ఉన్నారు. ఈ రంజాన్ వేడుకల్లో కమిటీ పెద్దలు, సభ్యులు హఫీజ్, హైమద్, అతహార్, నయీమ్, యూనిస్, ఖయ్యుం, ఉమర్, అయ్యుబ్, సాబీర్, ఖాలీద్, బాబా, అలీం, ఖదీర్, తౌహిద్, ఫయీమ్, మత గురువులు ముజాహిద్, హామద్, ఉమర్, సాదిఖ్, తదితరులు పాల్గొన్నారు.