ప్రశాంత వాతావరణంలో నూతన సంవత్సర వేడుకలు జ‌రుపుకోవాలి

– నూతన సంవత్సర వేడుకలు అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా ప్రశాంత వాతావరణంలో చేసుకొని ఒక చక్కటి సాంప్రదాయానికి నాంది పలకాలి
– వేర్వేరు ప్రకటనలో కోరిన గోదావరిఖని వన్‌టౌన్‌ సిఐ ప్రమోద్‌ రావు, ఎన్టీపీసీ ఎస్‌ఐ బి.జీవన్‌
నవతెలంగాణ-గోదావరిఖని/ గోదావరిఖని టౌన్‌:
నూతన సంవత్సర వేడుకలు అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా ప్రశాంత వాతావరణంలో చేసుకొని ఒక చక్కటి సాంప్రదాయానికి నాంది పలకాలని వేర్వేరు ప్రకటనలో గోదావరిఖని వన్‌టౌన్‌ సిఐ ప్రమోద్‌ రావు, ఎన్టీపీసీ ఎస్‌ఐ బి.జీవన్‌ కోరారు. ప్రతి సంవత్సరం డిసెంబర్‌ 31న అర్థ రాత్రి ప్రజలు ఆనందోత్సాహాలతో కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఉండడం మనం గమనిస్తున్నామని, ఈ క్రమంలో తీపి జ్ఞాపికగా ఉండవలసిన నూతన సంవత్సర వేడుకలు శతి మించితే చేదు జ్ఞాపకంగా జీవితాంతం మిగిలిపోయిన సందర్భాలు కోకొల్లలున్నాయని ముత్తారం ఎస్‌ఐ మధుసూదన్‌ రావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అందుకే ఈ సంవత్సరం నూతన సంవత్సర వేడుకలు శతి మించకుండా పోలీసుల సూచనలు తప్పకుండా పాటించ వలసిందిగా సూచించారు. నూతన సంవత్సర వేడుకలను ప్రజలు తమ కుటుంబ సభ్యుల సమక్షంలో ఇంటివద్దనే ఆనందంగా జరుపుకోవాలని తెలిపారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలు ఇంట్లో తమతో వేడుకలు జరుపుకునేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. యువకులు తమ తల్లిదండ్రులతో, మిత్రులతో నూతన సంవత్సర వేడుకలు జరుపుకుంటామని, బయటకు వెళ్లి మిత్రుల గదుల్లో మద్యం సేవించి అర్ధరాత్రి దాటిన తర్వాత మోటార్‌ సైకిల్‌లను మితిమీరిన వేగంతో నడిపి ప్రమాదాల బారన పడిన సంఘటనలు గతంలో మనకు తెలుసునని, తమ కొడుకు ఇంటికి వస్తాడని ఎదురు చూసే తల్లిదండ్రులకు కడుపు శోకం మిగిలే అవకాశం ఉందని, కావున యువకులు ఎవరు కూడా అర్ధరాత్రి దాటిన తర్వాత మద్యం సేవించి వాహనాలు నడిపే ప్రయత్నం చేయ రాదని పేర్కొన్నారు. నూతన సంవత్సర వేడుకలు జరుపుకొనుటకు ఎక్కడ కూడా ఎటువంటి ప్రత్యేక కార్యక్రమాలకు అనుమతి లేదని, శబ్దకాలుష్యముకు కారణమయ్యే డీజేలు మొదలైన వాటిని వినియోగించరాదని పేర్కొన్నారు. టపాసులు పేలుస్తూ ఇతరులకు అసౌకర్యం ఇబ్బంది కలిగించ రాదని తెలిపారు. వేడుకలలో శతి మీరి ప్రవర్తించే వారిపై కొరడా ఝలిపించడాని ఈ నెల 31వ తేదీ రాత్రి 9 గంటల నుండి డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీలు చేయుటకు ప్రత్యేక బందాలను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఎవరైనా శృతిమించి మితిమీరిన వేగంతో వాహనాలు నడుపుతూ కనిపిస్తే, వారిపై చట్ట పరమైన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. యువకులు మోటార్‌ సైకిల్‌ సైలెన్సర్‌ తీసివేసి పెద్దగా శబ్దం చేస్తూ మోటార్‌ సైకిల్‌ను ప్రమాదకరంగా నడుపుతూ కేరింతలు కొడుతుంటారని, అలా ఎవరైనా చేస్తే, వారిపై కఠిన చర్యలు తీసుకోబడునని తెలిపారు. కొంతమంది యువకులు అర్ధరాత్రి దాటిన తర్వాత కాలనీల్లో మోటార్‌ సైకిల్‌ పై తిరుగుతూ యువతులు, మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన సందర్భాలు దష్టికి వచ్చినని, అలా ప్రవర్తించే ప్రయత్నం ఎవరైనా చేస్తే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మైనర్లు మోటార్‌ సైకిల్‌ నడుపుతూ రోడ్లపై కనిపిస్తే ఆ మోటార్‌ సైకిల్‌ యజమానిపై, తల్లిదండ్రుల పై చర్యలు తీసుకోబడునని హెచ్చరించారు.