ప్రతి సంవత్సరం నవంబర్ 17న జరుపుకునే అంతర్జాతీయ విద్యార్థుల దినోత్సవం, విద్యార్థుల కషిని గుర్తించేందుకు, వారిని ప్రోత్సహించేందుకు ఒక ముఖ్యమైన రోజు. విద్యార్థులు మన సమాజానికి భవిష్యత్తు. వారి ఆలోచనలు, కలలు, కషి మన దేశాన్ని అభివద్ధి పరుస్తాయి. ఈ రోజు విద్యార్థులందరికీ అభినందనలు తెలుపుతూ, వారికి ప్రేరణగా ప్రపంచ దేశాలు ప్రణాళికలను రూపుదిద్దాలి.
విద్యార్థులు సమాజంలోని అతిపెద్ద శక్తి. వారి ఆలోచనలు, కొత్త ఆవిష్కరణలు సమాజాన్ని మార్చగలవు. విద్యార్థులు దేశాన్ని అభివద్ధి చేయడంలో కీలక పాత్ర పోషిస్తారు. విద్యార్థులు మన భవిష్యత్తు నిర్మాతలు. వారి చేతుల్లోనే మన దేశం అభివద్ధి ఆధారపడి ఉంటుంది. నేడు విద్యార్థులకు అన్ని రకాల విద్య… అంటే ఆన్‌లైన్ విద్య, విదేశీ విద్య వంటి అనేక అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులు తమకు నచ్చిన రంగంలో ఉద్యోగాలు పొందే అవకాశాలూ ఉన్నాయి. తమ కొత్త ఆలోచనలతో స్టార్టప్‌లను ప్రారంభించి ఉద్యోగదాతలుగా మారవచ్చు. సమాజ సేవలో పాల్గొని తమ సామాజిక బాధ్యతను నిర్వర్తించవచ్చు.
నేటి ప్రపంచంలో పోటీ ఎక్కువగా ఉంది. విద్యార్థులు ఈ పోటీని ఎదుర్కోవడానికి కష్టపడాలి. సాంకేతిక పరిజ్ఞానం వేగంగా మారుతోంది. విద్యార్థులు ఈ మార్పులతో తమను తాము అనుసంధానించుకోవాలి. సోషల్ మీడియా వల్ల తప్పుడు సమాచారం విస్తరిస్తోంది. విద్యార్థులు నిజమైన సమాచారాన్ని గుర్తించడం నేర్చుకోవాలి. విజయం కోసం కష్టపడటం చాలా ముఖ్యం. విద్యార్థులు భవిష్యత్తులో ఏమై ఉండాలనుకుంటున్నారో స్పష్టంగా తెలుసుకోవాలి. ఎదురయ్యే అడ్డంకులను అధిగమించి మీ లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రయత్నించండి. ఎప్పుడూ కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఆసక్తి చూపాలి. అంతర్జాతీయ విద్యార్థుల దినోత్సవం, విద్యార్థులందరికీ ఒక ప్రేరణాత్మక రోజు. విద్యార్థులు తమలోని శక్తిని గుర్తించి, భవిష్యత్తును నిర్మించేందుకు కషి చేయాలి. మనందరం వారికి అండగా ఉండాలి.
అంతర్జాతీయ విద్యార్థుల దినోత్సవం
అంతర్జాతీయ విద్యార్థుల దినోత్సవం గౌరవం, ఉన్నత విద్యా హక్కు కోసం పోరాడి తమ ప్రాణాలను త్యాగం చేసిన వేలాది మంది విద్యార్థుల ధైర్యసాహసాలను నేటి విద్యార్థులు గుర్తు చేసుకోవాలి. ఇది 1939లో జరిగింది. అంతర్జాతీయ విద్యార్థుల దినోత్సవం ప్రేగ్‌లోని విద్యార్థుల వర్ధంతి సందర్భంగా జరుపుకుంటారు. అనేక దేశాలలో శాంతియుత నిరసన కూడా ఒక పోరాటం అయినందున తరువాత విద్య కోసం నిరసన హక్కు కోసం జరుపుకుంటారు. అంతర్జాతీయ విద్యార్థుల దినోత్సవం 1933లో అడాల్ఫ్ హిట్లర్ అధికారంలోకి వచ్చినప్పుడు, థర్డ్ రీచ్ జర్మనీ సరిహద్దుల వెలుపల ఉన్న భూభాగాలపై దూకుడు వాదనలు ప్రారంభించింది. 1938లో హిట్లర్ స్వదేశమైన ఆస్ట్రియాను నాజీలు మొదట స్వాధీనం చేసుకున్నారు. తరువాత, వారు చెకోస్లోవేకియా తన భూభాగాల్లో సగం లొంగిపోయేలా బలవంతం చేశారు. జర్మనీ చెక్ ప్రాంతాలను ఆక్రమించింది. చెకోస్లోవేకియాను ఉపగ్రహ రాష్ట్రంగా విభజించవలసి వచ్చింది. 1939లో, ప్రేగ్‌లోని చార్లెస్ విశ్వవిద్యాలయంలోని మెడికల్ ఫ్యాకల్టీ విద్యార్థులు స్వతంత్ర చెకోస్లోవాక్ రిపబ్లిక్ ఏర్పాటు జ్ఞాపకార్థం ఒక సమావేశాన్ని నిర్వహించారు. నాజీలు ఈ సమావేశాన్ని క్రూరంగా అణిచివేశారు. ఫలితంగా విద్యార్థి జాన్ ఓప్లెటల్ మరణించారు. ఫలితంగా, విద్యార్థులు నాజీల వ్యతిరేక ప్రదర్శనను ఏర్పాటు చేశారు. నవంబర్ 17, 1939న, నాజీలు తొమ్మిది మంది నిరసనకారులను చుట్టుముట్టి, విచారణ లేకుండా ఉరితీశారు. 1,200 మంది విద్యార్థులను అరెస్టు చేసి నిర్బంధ శిబిరాలకు పంపారు. శిబిరంలో కొద్దిమంది మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. ప్రేగ్ విశ్వవిద్యాలయంలో 1939 నాజీ దాడి సమయంలో విద్యార్థి కార్యకర్తల ధైర్యాన్ని గుర్తుచేసుకోవడానికి నవంబర్ 17న అంతర్జాతీయ విద్యార్థుల దినోత్సవం జరుపుకుంటారు. మొదటిసారి 1941లో లండన్‌లోని ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కౌన్సిల్‌లో జరిగింది. అక్కడ విద్యార్థులు ప్రతి నవంబర్ 17న అంతర్జాతీయ విద్యార్థుల దినోత్సవాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. అంతర్జాతీయ విద్యార్థుల దినోత్సవంలో భాగంగా ప్రపంచ దేశాల మధ్య యుద్ధాలను నివారించి విద్యార్థుల విద్య వైపు ప్రపంచ దేశాలు దష్టి పెట్టాల్సిన అవసరం, ఆవశ్యకత ఎంతైనా ఉంది.
(నవంబర్ 17 అంతర్జాతీయ విద్యార్థుల దినోత్సవం సందర్భంగా)
– పూసపాటి వేదాద్రి, 9912197694
భవిష్యత్తు నిర్మాతల వేడుకలు
10:39 pm