ఘనంగా రాహుల్‌గాంధీ జన్మదిన వేడుకలు

– గాంధీభవన్‌లో భారీ కటౌట్‌
– రక్తదానం శిబిరాలు, పిల్లలకు పుస్తకాల పంపిణీ
– కేక్‌ కట్‌ చేసి సంబరాలు జరుపుకున్న పార్టీ శ్రేణులు
– కేంద్రంలో బీజేసీ సర్కారు ఎక్కువ కాలం ఉండదు:మల్లు రవి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌ గాంధీ జన్మదిన వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఎంపీ అనిల్‌కుమార్‌యాదవ్‌ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన భారీ కటౌట్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. నాయకులు, కార్యకర్తలు భారీ కేక్‌ కట్‌ చేసి పెద్ద ఎత్తున జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షులు శివ సేనారెడ్డి ఆధ్వర్యంలో రక్త దాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రారంభించారు. ఫిషర్మెన్‌ కాంగ్రెస్‌ అధ్యక్షులు మెట్టు సాయికుమార్‌ నేతృత్వంలో పేద విద్యార్థులకు పుస్తకాలను పంపిణీ చేశారు. మహిళా కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షులు సునీతా రావు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత క్యాన్సర్‌ ఆస్పత్రిలో రోగులకు మందులను పంపిణీ చేశారు. ఖైరతాబాద్‌ జిల్లా మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు శంభుల ఉషశ్రీ శ్రీకాంత్‌ గౌడ్‌, సికింద్రాబాద్‌ జిల్లా మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు పుస్తకాల కవితతోపాటు బ్లాక్‌, డివిజన్‌ అధ్యక్షులు, ఆఫీస్‌ బేరర్స్‌, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ మల్లు రవి మాట్లాడుతూ దేశ ప్రజల సంక్షేమం కోసం రాహుల్‌గాంధీ సుదీర్ఘ పాదయాత్ర చేశారని తెలిపారు. అధికారంలోకి వచ్చిన బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఎక్కువ కాలం నిలవబోదని వ్యాఖ్యానించారు. నితీష్‌ కుమార్‌, చంద్రబాబు దయాదక్షిణ్యాలపై ఆధారపడి అది నడుస్తున్నదని గుర్తు చేశారు. వారికి ఎప్పుడు కోపం వస్తే అప్పుడే ప్రభుత్వం కూలిపోతుందన్నారు. బీజేపీ ప్రభుత్వం పేద ప్రజల నమ్మకాన్ని కోల్పోయిందని విమర్శించారు. రాహుల్‌ గాంధీ జన్మదినం సందర్భంగా రక్తదానం చేసిన 300మంది యువకులను మల్లు రవి అభినందించారు.
న్యూడిల్లీలో సైతం వేడుకలు
కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ జన్మదినం సందర్భంగా బుధవారం న్యూఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో రాహుల్‌ గాంధీని మాజీ ఎంపీ వి హనుమంతరావు కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఢిల్లీ తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన సంబరాల్లో ఆయనతోపాటు కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్‌, ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌ కుమార్‌, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అర్‌.లక్ష్మణ్‌ యాదవ్‌ వేడుకలు నిర్వహించారు.