– ప్రజాపంథా రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
తెలంగాణ ఆవిర్భవించి పదేండ్లు అవుతున్న సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం దశాబ్ద సంబరాలను జరుపుతున్నదని సీపీఐ(ఎంఎల్) ప్రజాపంథా రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. సంబరాలు సరే కానీ రాష్ట్రం కోసం పోరాడిన ప్రజల ఆశలు, ఆకాంక్షల మాటేమిటని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. నీళ్లు, నిధులు, నియామకాలు, ఆత్మగౌరవం, స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం కోసమే ప్రజలు పోరాడారని గుర్తు చేశారు. ఆ ఆశలు నిరాశలుగా మిగిలాయని పేర్కొన్నారు. త్యాగాలు ఒకరివిగా, భోగాలు మరొకరివిగా పరిస్థితి మారిందని తెలిపారు. ఖాళీ పోస్టులను నింపలేదని, నోటిఫికేషన్లు అవినీతి, అక్రమాలకు నిలయమయ్యాయని విమర్శించారు. విద్యాలయాలు, విశ్వవిద్యాలయాలు నిధుల్లేక కొడిగట్టి పోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. పదేండ్ల కాలంలో ఒక్కరికీ ఇండ్ల జాగా ఇవ్వలేదని పేర్కొన్నారు. డబుల్ బెడ్రూం ఇండ్ల పథకం పడకేసిందని తెలిపారు. పోడు భూములన్నింటికీ పట్టాలిచ్చే అవకాశం లేదని పేర్కొన్నారు. కార్పొరేట్ కంపెనీలకు, బడా పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వ భూములను కట్టబెడుతున్నారని విమర్శించారు.