వర్గీకరణపై ఆదిలాబాద్ లో మాదిగల సంబరాలు

నవతెలంగాణ-ఆదిలాబాద్ టౌన్
వర్గీకరణ ముప్పై ఏండ్ల పోరాటంలో అనేక మంది ప్రాణాలతో రాష్ట్ర ప్రభుత్వం కేటగిరీలను విభజించడం హర్షణీయమని మాదిగ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు చందాల రాజన్న అన్నారు. అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి వర్గీకరణకు సంబంధించి 1, 2, 3 కేటాగిరిలను విభజించడాన్ని స్వాగతిస్తూ బుధవారం పట్టణంలో సంబరాలు జరుపుకున్నారు. పట్టణంలోని అంబేద్కర్ చౌక్ లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి, మందకృష్ణమాదిగ ఫ్లెక్సీకి పాలాభిషేకం చేసి టపాసులు కాల్చారు. ఈ సందర్భంగా చందాల రాజన్న మాట్లాడుతూ… 30 ఏండ్లుగా మాదిగలు ఎస్సీ వర్గీకరణ కోసం ఉద్యమించారన్నారు. అసెంబ్లీ సాక్షిగా వర్గీకరణ చేయడానికి సీఎం రేవంత్ రెడ్డి కేటాగిరిలను విభజించడం హర్షణీయమన్నారు. ఇందులో మాదిగలకు 9, మాలలకు 5 శాతం ఇచ్చారన్నారు. కానీ 18 శాతం రిజర్వేషన్ కల్పించాలని కోరారు. వర్గీకరణ అంశాన్ని అసెంబ్లీలో ప్రస్తావించి కేటాగిరిలను ఏర్పాటు చేసిన సీఎం రేవంత్ తో పాటు మంత్రులకు మాదిగల తరపున ధన్యవాదలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు బిక్కి గంగాధర్, అశోక్, సంజయ్, గాలినెల్లి నాగన్న, మల్యాల మనోజ్, నర్కరాందాస్, దయాకర్, నవీన్, సాగర్ పాల్గొన్నారు.