ఘనంగా ఐలమ్మ జయంతి వేడుకలు

Celebrations of Ailamma Jayantiనవతెలంగాణ – తిరుమలగిరి
తిరుమలగిరి మున్సిపాలిటీ కార్యాలయంలో గురువారం భూమికోసం, భుక్తి కోసం,వెట్టి చాకిరి విముక్తి కోసం పోరాడి తెలంగాణ తెగువను  ప్రపంచానికి చాటిచెప్పి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం చేసిన వీర మహిళా,మహిళలందరికీ స్ఫూర్తినిచ్చిన ధీర వనిత చాకలి ఐలమ్మ 129 వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ శాగంటి అనసూయ రాములు ఐలమ్మ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ తొలి భూ పోరాటానికి నాంది పలికిన వీరమాత సామాజిక ఆధునిక పరిణామానికి నాంది పలికిన స్త్రీ ధైర్యశాలి ఐలమ్మ అన్నారు. అగ్రకులాలు స్త్రీలు దొరసానులు తమను కూడా దొర అని ఉత్పత్తి కులాల చేత పిలిపించుకునే సంస్కృతికి చరమగీతం పాడిన వారిలో ఐలమ్మ ముందంజలో ఉన్నారన్నారు. ఈ భూమి నాది… పండించిన పంట నాది తీసుకెళ్లడానికి దొర ఎవ్వడు నా ప్రాణం పోయాకే ఈ పంట భూమి దక్కించుకోగలరు.. అంటూ మాటలను తూటాలుగా మలుచుకుని దొరల గుండెల్లో బడబాగ్నిల రగిలిన తెలంగాణ రైతాంగ విప్లవాగ్ని చాకలి ఐలమ్మ అన్నారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ బుచ్చిబాబు తోపాటు  సీనియర్ అసిస్టెంట్ రాజు, మరియు మున్సిపల్ సభ్యులు  తదితరులు పాల్గొన్నారు.