దేశ నిర్మాణం, ఉద్యోగ కల్పన, ఆర్థిక వృద్ధికి సిమెంట్ పరిశ్రమ కీలకం

– సీఎంఏ అధ్యక్షుడు, శ్రీ సిమెంట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ నీరజ్ అఖౌరీ 
నవతెలంగాణ హైదరాబాద్: దేశ నిర్మాణం, ఉద్యోగ కల్పన, ఆర్థిక వృద్ధికి సిమెంట్ పరిశ్రమ కీలకం భూమిక పోషించనుందని సిమెంట్ తయారీదారుల సంఘం (సీఎంఏ) అధ్యక్షుడు, శ్రీ సిమెంట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ నీరజ్ అఖౌరీ తెలిపారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన 2025-26 కేంద్ర బడ్జెట్‌ను స్వాగతిస్తున్నామన్నారు. ప్రజలు, ఆర్థిక వ్యవస్థ, వినూత్నత (ఇన్నోవేషన్) వంటి కీలక రంగాల్లో పెట్టుబడులు పెంచే దిశగా ఉన్న ప్రణాళికలు దేశాభివృద్ధికి దోహదం చేయనున్నాయని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఈ బడ్జెట్ సమగ్ర అభివృద్ధిని లక్ష్యంగా చేసుకోవడం అభినందనీయం అన్నారు. ఈ బడ్జెట్ బలమైన ఆర్థిక వ్యవస్థను నిర్మించడానికి మార్గదర్శకంగా నిలవనుందన్నారు.
ప్రభుత్వ సహకారంతో చేపట్టిన అనేక కార్యక్రమాలు ప్రజల ఆకాంక్షలను, భవిష్యత్తు ఆర్థిక వృద్ధి అవసరాలను సమతుల్యం చేస్తాయన్నారు. రాష్ట్రాలలో మౌలిక సదుపాయాల పెంపునకు పెట్టుబడులు పెంచడంపై దృష్టి కేంద్రీకరించడంతో, సిమెంట్ రంగానికి పెరుగుదల అవకాశాలు విస్తరిస్తాయని పేర్కొన్నారు. మౌలిక సదుపాయాలపై దృష్టి పెట్టినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ.. దేశ పురోగతిలో భాగస్వాములుగా మా పాత్రను కొనసాగిస్తామని హామీ ఇస్తున్నామన్నారు. పెద్ద స్థాయిలో గృహ, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులపై పెరుగుతున్న ఖర్చు నిర్మాణ సామగ్రిపై డిమాండ్‌ను పెంచుతుందన్నారు. సవాళ్లు ఉన్నప్పటికీ, ఈ చర్యలు సిమెంట్ పరిశ్రమకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో స్థిరంగా ఆరు శాతం కంటే ఎక్కువ వార్షిక వృద్ధి రేటు సాధించేందుకు అవకాశం ఉందన్నారు. సిమెంట్ పరిశ్రమ తయారీ, రవాణా, నిర్మాణ రంగాలతో పలు రంగాల్లో నేరుగా, పరోక్షంగా ఉపాధిని కల్పిస్తూ మిలియన్ల మంది జీవనోపాధిని మద్దతుగా ఉందన్నారు. ఈ రంగం ద్వారా పన్నులు, సుంకాలు, ఇతర ఆర్థిక బాధ్యతల ద్వారా ప్రభుత్వ ఖజానాకు కీలకంగా దోహదం చేస్తూ, దేశ ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేస్తుందన్నారు.
ఈ సందర్భంగా సిమెంట్ తయారీదారుల సంఘం (సీఎంఏ) ఉపాధ్యక్షుడు, జేఎస్డబ్ల్యు సిమెంట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ పార్ధ్ జిందాల్ మాట్లాడుతూ ఈ బడ్జెట్ భారత సిమెంట్ పరిశ్రమ భవిష్యత్తును రూపకల్పన చేసే దిశగా ఉందన్నారు. 2047 నాటికి ‘వికసిత భారత్’ లక్ష్యాన్ని సాధించేందుకు ఇది కీలకంగా నిలుస్తుందన్నారు. మౌలిక సదుపాయాలు, తయారీ, సాంకేతికత రంగాల వృద్ధికి ఇది ప్రాధాన్యం ఇస్తుందన్నారు. గణనీయమైన కేటాయింపులలో ఆవిష్కరణకు ఇరవై వేల కోట్ల నిధులు, మౌలిక సదుపాయాల అభివృద్ధికి రాష్ట్రాలకు 50 సంవత్సరాల పాటు వడ్డీ లేకుండా రూ.1.5 లక్షల కోట్ల రుణాలు ఉన్నాయన్నారు. ఇవి ప్రాథమిక రంగాల వృద్ధిని పెంపొందించడంలో సిమెంట్ రంగం అభివృద్ధికి, కీలకమైన పాత్ర పోషించనున్నాయని పేర్కొన్నారు. పబ్లిక్-ప్రైవేట్ పార్టనర్‌షిప్ (పీపీపీ) మోడల్‌లో మూడు సంవత్సరాల ప్రాజెక్ట్ పైప్‌లైన్‌ను ప్రాధాన్యత ఇచ్చిన ఈ బడ్జెట్, ప్రైవేట్ రంగ పెట్టుబడులకు ప్రోత్సాహం ఇచ్చి, మౌలిక సదుపాయాల రంగంలో విప్లవాత్మక మార్పులకు దారితీయనుందని తెలిపారు. ‘మేక్ ఫర్ ఇండియా’, ‘మేక్ ఫర్ ది వరల్డ్’ కింద స్థాపించనున్న ఐదు జాతీయ నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు భారత అభివృద్ధి చెందుతున్న పని బలగాన్ని వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థ అవసరాలను తీర్చేందుకు సన్నద్ధంగా ఉంచుతాయన్నారు. సిమెంట్ పరిశ్రమ భారతదేశ అభివృద్ధిని, ఆర్థిక స్థిరత్వాన్ని ముందుకు తీసుకెళ్లడంలో కీలకంగా నిలుస్తుందని తెలిపారు.