వజ్రాయుధ కవికి శత జయంతి

వజ్రాయుధ కవికి శత జయంతికవిత్వం ఒక ఆయుధమే ఎప్పటికీ. అందుకే గన్ను కంటే కూడా పెన్ను గొప్పది అంటుంటారు సాహిత్యాభిలాషులు. అలా నిరూపితం అయిన కావ్యమే ‘వజ్రాయుధం’. సోమసుందర్‌ ‘వజ్రాయుధం’ సమాజం దుర్మార్గం, దురాగతాలపై, దుష్టపాలనపై ఎక్కుపెట్టిన వజ్రాయుధం. ఈ పుస్తకం మొదటిసారి విరోధి ఉగాది మార్చి, 1949వ సంవత్సరంలో కళాకేళి ప్రచురణగా సామల్‌కోట నుండి ప్రచురింపబడినది. సోమసుందర్‌ పుట్టింది 18 నవంబర్‌ 1924 నాడు. ఈ పుస్తకం ప్రచురించేనాటికి సోమసుందర్‌కు పాతిక సంవత్సరాలు మాత్రమే. నవయవ్వనంలో ఉండి అభ్యుదయ భావాలతో దుష్ట పాలనపై వీరావేశంతో రాసిన కావ్యం ‘వజ్రాయుధం’.
ఈ పుస్తకాన్ని నైజాం పైశాచిక నిర్బంధాల నుంచి తెలుగు జాతిని విముక్తం చేయడానికి అకుంఠిత దీక్షతో పోరాడి తమ సర్వస్వాన్నీ సమర్పించిన అమరవీరులందరికీ, తెలంగాణ పోరాట జ్యోతిగా భాసించిన శ్రామిక జన మహానాయకులు శ్రీ రావినారాయణ రెడ్డికి హృదయపూర్వక నీరాజనంగా అంకితం చేశారు సోమసుందర్‌. ఇలా ఈ కావ్యం యొక్క ఆత్మ, నేపథ్యం తెలంగాణ నేల, తెలంగాణ ఉద్యమ నేపథ్యం అని ఇట్టే తెలుస్తుంది. ఈ పుస్తకం ప్రచురణ అయ్యేనాటికి తెలంగాణ సాయుధ పోరాటం ఇంకా నడుస్తూనే ఉంది నిరంకుశ నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా.
ఇందులో మూడు భాగాల్లో కవిత్వముంది. మొదటి భాగంలో సమధర్మం పేరిట ముప్పయి పేజీల్లో 9 కవితా ఖండికలున్నాయి. రెండవ భాగంలో ‘బానిసల దండయాత్ర’. ఇది అప్పటికి సాగుతున్న తెలంగాణ సాయుధ పోరాటం నేపథ్యంగా ఎనిమిది విభాగాల్లో రాసిన 26 పేజీల్లో కవితా ఖండికలున్నాయి. మూడవ భాగంలో అంతర్జాతీయ నేపథ్యంలో రాసిన మలయా ప్రభంజనం, ఇందులో 10 విభాగాల్లో 10 పేజీల్లో కవితా ఖండికలున్నాయి. ఈ మూడు కవితా విభాగాల నేపథ్యం సూత్రం ఒకటే. స్వేచ్ఛ, విముక్తి, పోరాటం, సమానత్వం.
సమధర్మం మొదటి కవితా ఖండికలో ఇలా అంటారు సోమసుందర్‌… ”తన చరిత్ర తనే పఠించి/ ఫక్కున నవ్వింది ధరణి/ తన గాథను తనే స్మరించి/ బోరున ఏడ్చింది ధరణి”
చరిత్ర కాలగమనంలో ఇప్పటికినీ నిరంకుశ ప్రభుత్వాల కింద ప్రజలు నలిగిపోతూనే ఉన్నారు ప్రపంచంలో ఎక్కడో ఒక దగ్గర. అందుకే తన చరిత్రను తెలుసుకొని తనే నవ్విందట ధరణి. ఇంకా తన దీన గాథను స్మరించి బోరున ఏడ్చిందట ధరణి. ఈ ప్రశ్నలకు సమాధానమే ఈ కవిత్వం, వాటి పరిష్కారం, విముక్తి సాధనకే ఈ కవిత్వం.
”వద్ధ జగతి సమాధిపై సమధర్మం ప్రభవించును నిద్దుర చీకటి వెలుపల వేకువ మెళకువ పుట్టును” అని ఆశాభావం వ్యక్తం చేస్తాడు కవి.
”ఓ లెనిన్‌!… మా లెనిన్‌!!/ నిరాశానలమ్మునపడి
అణగారే మా ఎదలన్‌,/ నీ వచస్సుధా లహరిన్‌
ముంచిన మహనీయ లెనిన్‌” అని ఈ రష్యా విప్లవాన్ని సాధించిన లెనిన్‌ ను కీర్తిస్తాడు.
మూడవభాగం ‘ఖరార్‌ నామా’లో… ”రక్తం అర్పించుము నరుడా!/ నీ త్యాగం వృథా కాదు/ నీ త్యాగం వృథా కాదు” అని చేయవలసిన కర్తవ్యమును ప్రబోధిస్తాడు.
నాల్గవ భాగం ‘మౌన ఘోష’లో ”ఆకలి వేస్తోందమ్మ!/ అన్నం పెట్టమ్మా!!” అంటూ… ”నరులందరికీ సరిపోయే/ సరిపోయే సిరి సంపదలతో/ తులతూగే ఈ దేశం నాదమ్మ!/ తల్లీ! విడువలేను/ నా, మీ అందమైన లోకం!/ అమ్మా! ఆకలి… ఆకలి..” అని అంటాడు కవి.
లక్షలాది పీడిత జన/ సందోహమ్మదిగదిగో!/ కదులుతోంది బారులుగా. కార్మిక కోపాగ్నిచ్ఛటలకు/ తాళలేని శలభం వలె/ ధనస్వామి తపతపమని పాదాంతం వణికిపోయి/ విప్లవశక్తికి/ పాదాక్రాంతుడయే శుభ సమయమ్మిదె” అంటాడు.
ఏడవ కవితా ఖండిక, ‘బాడుగ గోడీలు’ లో…
”పాపం/ లోకం కోపం/ విసిరిన శాపం అంటూ…/ పాపం పండిన/ ఈ లోకం/ నెత్తిమీద నిండు కుండ/ రేపో ఎల్లుండో / భళ్ళున బద్దలవక మానదు” అంటాడు.
సమధర్మం, చివరి ఎనిమిదవ కవితా ఖండిక ‘ఆకలి నాలుకలన్నీ..’
”ఆకలి నాలుకలన్నీ/ ఏకంగా, ఉప్పెనలా, ఉప్పొంగుచు/ దుశ్శాసన రాజ్యంలో…/ ధనస్వామ్య కఠోర పరిపాలనలో/ కుబేర దుర్గాలను/ గుభిల్లు గుభిల్లుమని కూలుస్తున్నవి” అని సమధర్మాన్ని కాంక్షిస్తాడు కవి.
‘వజ్రాయుధం’లో 2వ భాగం కవితా ఖండికల భాగం ‘బానిసల దండయాత్ర’. అందులో ఎనిమిది విభాగములు, అది తెలంగాణ ఉద్యమ నేపథ్యంగా రాయబడింది. కవిది ఎప్పుడైనా ధర్మాగ్రహమే, అవినీతిపై, అక్రమంపై, అన్యాయాలపై, ఉద్యమాల గడ్డ తెలంగాణ గురించి,
”తెలగాణ ! తెలగాణ!!/ ధీరులకు మొగసాల/ తెలగాణ! తెలగాణ!/ విప్లవోజ్వల గాథ” అంటాడు.
నిరంకుశ నిజాం పాలకున్ని… ”హైదరాబాద్‌ ఖిల్లా/ లోని తొర్రలో, పుర్రెలో/ దాచుకున్నడంట!/ రాక్షసుడు ప్రాణాలు/ దేశముఖ్‌ కుక్కలను/ కాపలాలుంచాను” అంటాడు.
”ఒక వీరుడు మరణిస్తే/ వేలకొలది ప్రభవింతురు!/ ఒక నెత్తుటి బొట్టులోనె/ ప్రళయాగ్నులు ప్రజ్వరిల్లు” అనే, అజరామమైన అమరమైన కవితా వాక్యాలు అందించిన అవంత్స సోమసుందర్‌ చిరస్మరణీయులు.
”అతడెవరు? అతడెవరు??/ జనగామలో జమ్మి/ కొమ్మపై ఎక్కాడు./ అతడెవరు? అతడెవరు??”
………….
”అతడా? తెలంగాణ/ గెరిల్లా నాయకుడు” అని తెలంగాణ సాయుధ పోరాట వీరున్ని ఘనంగా కీర్తిస్తాడు.
ఇంకా, ”తెలుగు తల్లి ముద్దుబిడ్డగా వీరుడు/ పేదల శ్రమజీవుల కన్నతండ్రి/ ఆంధ్రమాత దివ్యచరిత/ ప్రసవించిన ధీరగెరిల్లా!/ తెలుగుతల్లి నోము పండి ప్రభవించిన వీరగెరిల్లా!!/ బాలచంద్రునికి సోదరుడట!/ రుద్రమాంబ తోబుట్టినవాడట” అని కీర్తిస్తాడు.
రక్తం పారిన తెలంగాణ సాయుధ పోరాట త్యాగాలకు ప్రతీకారంగా… ”నాజీ నైజాం రాక్షస రజాకార్ల పోలీసుల, ద్రోహుల రక్తంతో/ మన తమ్ముల ఆత్మల శాంతికి/ దోసిళ్ళతో తర్పణమిద్దాం” అంటాడు.
ఇంకా నైజాం రాజ్యం దుష్టపాలనకు చరమగీతం వస్తుందంటూ… ”తెలుగుతల్లి పసిడి కాన్పు/ కొత్తపంట ధరిస్తుంది/ నవజీవం సుమిస్తుంది/ ఈ యాగం ఫలిస్తుంది” ఆశిస్తాడు కవి.
”ఎగరేరు! ఎగరేరు!/ ఎర్రెర్ర జెండా!/ మన ఎర్ర జెండా!”
”సర్వజన సౌభాగ్య త్రాతా!/ అభ్యుదయ శాంతి ప్రదాతా!” అంటూ అభ్యుదయాన్ని కాంక్షిస్తూ తెలంగాణ విముక్తి గీతాన్ని ఆలపిస్తాడు, సమ సమాజాన్ని కాంక్షిస్తాడు. తెలంగాణ నాటికీ నేటికీ ఒక కావ్య వస్తువు. ధన్యుడు సోమసుందర్‌ తెలంగాణ పై కవిత్వం రాసినందుకు.
‘వజ్రాయుధం’ కావ్యంలోని చివరి కవితా విభాగం ‘మలయా ప్రభంజనం’ అది పది చిన్న విభాగాల్లో ఉన్న పది పేజీల కవిత!
కవి లోకానికి చెందినవాడు నిజంగా రవిలా! కవికి తన ప్రాంతం, తన దేశమే కాదు, విశ్వజనీన సత్యాలు తెలిసి అంతర్జాతీయ దక్పథం కూడా ఉండాలి! ప్రపంచంలో ఎక్కడ అన్యాయం, అక్రమం ఉంటుందో అక్కడ ఉండాలి కవి! సోమసుందర్‌ చేసింది అదే!
”ఓహో హో మలయా/ క్రాంతికల నిలయా/ ఏనాడో చికాగోలో – మాస్కోలో/ ఏనాడో పారిస్‌లో – బెర్లిన్‌లో/ ఏనాడో మీరట్‌ లో – క్వాన్టన్‌లో/ కరిగిన శ్రామిక విప్లవ మహానదులు నీలో/ నీ నాడులలో, నరాలలో ప్రవహిస్తున్నవి మలయా!” అని చెపుతూ…
”మాక్డొనాల్డు – నియన్తలను, చరిత్ర/ డస్టుబిన్‌లో పడేస్తుందిలే మలయా!” అంటాడు. ఒకనాటి ‘మలయా’ ద్వీప సముదాయం నేటి ‘మలేసియా’ ఒకనాటి బ్రిటిష్‌ వలస పాలనలో ఉన్న ప్రాంతం.
అలనాటి మలయా విప్లవం గురించి,
”నిప్పువంటి ఆకలి కీలల్లో కాలిన/ ఎర్రని నాలుక లూదిన గాలిదుమారం/ మలయా విప్లవం” అంటాడు కవి.
అవంత్స సోమసుందర్‌ ‘వజ్రాయుధం’ కావ్యం రాసేనాటికి (1949) అభ్యుదయ రచయిత సంఘంలో కార్యనిర్వాహక ప్రముఖుల్లో ఒకరు. ఆవేశం, ఆలోచన, అభ్యుదయం… వెరసి సోమసుందర్‌ ‘వజ్రాయుధం’ ఆనాటి కాలంలో అలాంటి రచన చేయడం ఒక సాహసమే! మార్చి 1949లో ప్రచురింపబడిన ‘వజ్రాయుధం’ ప్రతుల్ని 1950 ఫిబ్రవరిలో సోమసుందర్‌ కళాకేళి ప్రచురణాలయం మీద దాడి చేసి వజ్రాయుధం ప్రతుల్ని మొత్తం పట్టుకుపోయారు. అప్పటికే ఎందరో కవుల్ని, పాఠకుల్ని చేరుకుంది ఆ కావ్యం. ఆ కావ్యాన్ని అందుకొని ఉత్తేజితులై ఆరుద్ర ‘త్వమేవాహం’, అనిశెట్టి ‘అగ్నివీణ’, దాశరథిలు ‘అగ్నిధార’లు, ‘రుద్రవీణ’లు, రమణారెడ్డి ‘అడవి’ లాంటి కావ్యాలు వెలువరించారు.
కొన్ని రచనలు సామాజిక ప్రయోజనం ఆశించి పుడతాయి, రాయబడతాయి! అలాంటిదే ‘వజ్రాయుధం’! ధన్యుడు అవంత్స సోమసుందర్‌. అణగారిన నేలకోసం, ప్రజల కోసం కవిత్వం రాసినందులకు! అది ప్రాంతీయం, జాతీయం, అంతర్జాతీయ పరంగా కూడా తన ఆలోచనా ధారల్ని కురిపించి, ఆవేశపూరితంగా, ఆలోచనా పూరితంగా తన ఇరువది ఐదేండ్ల వయసులో రాసిన కావ్యమే ‘వజ్రాయుధం’.

– సబ్బని లక్ష్మీనారాయణ 8985251271