న్యూఢిల్లీ : కాశ్మీర్ వేర్పాటువాద సంస్థ తెహ్రీక్-ఎ- హురియత్ (టిఇహెచ్)పై కేంద్ర ప్రభుత్వం ఆదివారం నిషేధం విధించింది. జమ్ముకాశ్మీర్‌లో ఈ సంస్థ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోందని, భారత్‌కు వ్యతిరేకంగా ప్రచారాన్ని, తీవ్రవాద కార్యకలాపాలను కొనసాగిస్తోందని గుర్తించినట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. ”చట్టవ్యతిరేక కార్యకలాపాల (నివారణ) చట్టం కింద తెహ్రీక్-ఎ-హురియత్ జెకెను చట్టవిరుద్ధ సంఘంగా ప్రకటించారు. భారత్ నుండి జమ్ముకాశ్మీర్‌ను వేరుచేసి ఇస్లామిక్ పాలనను స్థాపించేందుకు ఈ సంస్థ నిషేధిత కార్యకలాపాలలో పాల్గొంటోంది” అని అమిత్‌షా ఎక్స్ లో పేర్కొన్నారు. టిఇహెచ్‌కి గతంలో సయ్యద్ అలీ షా గిలానీ నాయకత్వం వహించారు. ఆయన మరణానంతరం మసరత్ ఆలం భట్ బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం భట్ జైలులో ఉన్నారు. ఆయన పార్టీ ముస్లిం లీగ్ ఆఫ్ జమ్ముకాశ్మీర్‌ను డిసెంబర్ 27న కేంద్రం నిషేధిత సంస్థగా ప్రకటించిన సంగతి తెలిసిందే.