– తెలుగు రాష్ట్రాల పట్ల వివక్ష
– రెండు రాష్ట్రాల్లో తగ్గిన బియ్యం కొనుగోళ్లు
– తెలంగాణలో 28 , ఆంధ్రప్రదేశ్‌లో 36 శాతం తగ్గుదల
– దేశవ్యాప్తంగా ఏడుశాతం
న్యూఢిలీ: వాతావరణ అననుకూల పరిస్థితుల రీత్యా బియ్యం ఉత్పత్తి ఏటికేడు తగ్గుతోంది. దేశవ్యాప్తంగా బియ్యం ఉత్పత్తిలోనే వివిధ రాష్ట్రాల మధ్య వ్యత్యాసం ఉంటే.. పండిన ధాన్యాన్ని సేకరించడంలో కూడా కేంద్రం ఉత్తరాది రాష్ట్రాలకు, దక్షిణాది రాష్ట్రాలకు మధ్య వివక్ష చూపుతోంది. ప్రత్యేకించి తెలంగాణ, ఆంధ్రా రెండు తెలుగు రాష్ట్రాల్లో బియ్యం సేకరణకు కేంద్రం భారీగా కోత విధిస్తోంది. ఈ రెండు రాష్ట్రాల్లో బియ్యం కొనుగోళ్లలో కూడా భారీ వ్యత్యాసముంది. ఈ ఏడాదిలో తెలంగాణాలో 28 శాతం, ఆంధ్రప్రదేశ్‌లో 36 శాతం మేర కొనుగోలు పడి పోయిందని స్వయానా ఎఫ్‌సీఐ నివేదికే వెల్లడిచింది. తెలుగు రాష్ట్రాల పట్ల కేంద్రం వివక్ష చూపుతోందనడానికి ఈ నివేదికే సాక్ష్యంగా నిలుస్తోంది. ఈ ఏడాది బియ్యం సేకరణ విషయాలకొస్తే.. (2023-24 ఖరీఫ్ మార్కెట్ సీజన్ ప్రారంభమైన అక్టోబర్ 1 నుంచి ఈ ఏడాది మార్చి 31కి) 454 లక్షల టన్నులు మాత్రమే సేకరించినట్లు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌సీఐ) తెలిపింది. గతేడాది కంటే ఈ ఏడాది బియ్యం సేకరణ 7.3 శాతం తగ్గింది. గతేడాది 4 కోట్లా 90 లక్షల టన్నులు సేకరిస్తే ఈ ఏడాది టాప్‌గా 454 లక్షల టన్నులను మాత్రమే సేకరించినట్టు ఎఫ్‌సీఐ తెలిపింది. అయితే ప్రభుత్వం 52.5 మెట్రిక్ టన్నుల లక్ష్యంగా ఉంది.
గతేడాది 587 లక్షల టన్నులు సేకరించిన ఛత్తీస్‌గఢ్ ఈ ఏడాది తన లక్ష్యాన్ని మించి 782 లక్షల టన్నులు సేకరించింది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లోని బియ్యం కొనుగోళ్లను పరిశీలిస్తే.. పశ్చిమ బెంగాల్ బియ్యం ఉత్పత్తి గల ప్రధాన రాష్ట్రంగా ఉంటుంది. కాగా, గతేడాది 2 కోట్ల టన్నులు సేకరణ అయితే, ఈ ఏడాది కేవలం పది లక్షల లోనికి టన్నులకు పడిపోయింది.
2022-23 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఖరీఫ్, రబీ, జైడ్ సీజన్లలో కలిపి 56.87 మిలియన్ టన్నులను కొనుగోలు చేసింది. వ్యవసాయ ఆరోగ్యమంత్రిత్వశాఖ అంచనా ప్రకారం.. ఖరీఫ్, రబీ సీజన్లతో కలిపి గతేడాది కంటే ఈ ఏడాది ఒక శాతం తగ్గిందని అంచనా వేసింది. 2022-23లో 125.52 మిలియన్ టన్నులు ఉత్పత్తి కాగా 2023-24 (జూలై- జూన్) నాటికి 123.82 మిలియన్ టన్నులు ఉత్పత్తి అయ్యే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. జైడ్ (దాల్వా) సీజన్‌లో వచ్చే పంట ఉత్పత్తిని అంచనా వేయలేదు. 2022-23వ సంవత్సరంలో జైడ్ సీజన్లో సుమారు 10.24 మిలియన్ టన్నులు ఉత్పత్తి అయింది. తెలంగాణాలో బియ్యం సేకరణ బాగా పడిపోయింది. 436 లక్షల టన్నులు నుంచి 317 లక్షల టన్నులకి పడిపోయింది. ఒడిశాలో కూడా బియ్యం ఉత్పత్తి బాగా తగ్గింది.
గతేడాది 4.42 మిలియన్ టన్నుల సేకరణ జరుగగా, ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌లో 3.95 మిలియన్ టన్నులు మాత్రమే సేకరించారు. ఆంధ్రప్రదేశ్‌లోనూ భారీ వ్యత్యాసం కనిపిస్తోంది. కేంద్ర బియ్యం సేకరణ ముగిసేనాటికి ఏపీలో దాదాపు 36 శాతం తగ్గింది. గతేడాది 2.1 మిలియన్ టన్నులు సేకరించగా, ఈ ఏడాది 1.34 మిలియన్ టన్నులకి పడిపోయింది.