కేంద్రం ఈడీనీ దుర్వినియోగం చేస్తోంది

కేంద్రం ఈడీనీ దుర్వినియోగం చేస్తోంది– సుప్రీంకోర్టులో కేజ్రీవాల్‌ అఫిడవిట్‌
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ)ని కేంద్రం దుర్వినియోగం చేస్తోందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ పేర్కొన్నారు. మద్యం పాలసీ కేసులో తన అరెస్టును సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టులో కేజ్రీవాల్‌ పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో కోర్టు ఈడీకి సమాధానం కోరింది. తాజాగా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ దాఖలు చేసిన అఫిడవిట్‌పై ఢిల్లీ ముఖ్యమంత్రి రిజాయిండర్‌ దాఖలు చేశారు. కోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్‌లో ఈడీని కేంద్రప్రభుత్వం ఏవిధంగా దుర్వినియోగం చేస్తుందనడానికి.. తన అరెస్టే నిదర్శనమన్నారు. ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలకు సమాన పోరాట స్థాయి కల్పించాలన్న ఆయన.. లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించకముందే, మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌ అమల్లోకి రాకముందే తనను అరెస్టు చేసిన తీరు ఈడీ ఏకపక్ష వైఖరిని తెలియజేస్తుందన్నారు. ఇదే సమయంలో కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ ఎన్నికల్లో అక్రమ పద్ధతుల్లో పైచేయి సాధించినట్టుగా ఆరోపించారు. మద్యం పాలసీ కేసుపై ముఖ్యమంత్రి స్పందిస్తూ దక్షిణాదికి చెందిన ఏ గ్రూప్‌ నుంచి ఆమ్‌ ఆద్మీ పార్టీ నిధులు తీసుకున్నట్టుగా ఆధారాలు లేవన్నారు. గోవా ఎన్నికల ప్రచారంలో ఈ డబ్బును ఉపయోగించామనడం విడ్డూరంగా ఉందన్నారు. ఆమ్‌ ఆద్మీ పార్టీకి ఒక్క రూపాయి కూడా రాలేదని, ఎలాంటి కచ్చితమైన ఆధారాలు లేకుండా ఆరోపణలు చేశారన్నారు. తనపై వచ్చిన ఆరోపణలు నిరాధారమన్నారు.
జైలులో కేజ్రీవాల్‌ ఆరోగ్యంగానే : ఎయిమ్స్‌ మెడికల్‌ టీమ్‌
ఎక్సైజ్‌ పాలసీకి సంబంధించిన మనీ లాండరింగ్‌ కేసులో తీహార్‌ జైలులో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ పూర్తి ఆరోగ్యంతో ఉన్నట్టు ఎయిమ్స్‌కు చెందిన ఐదుగురు సభ్యుల మెడికల్‌ బోర్డు ధ్రువీకరించింది. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కేజ్రీవాల్‌ ఆరోగ్య పరిస్థిని మెడికల్‌ బోర్డు శనివారం పరిశీలించింది. సుమారు అరంగంట సేపు సీఎంతో మాట్లాడిన ఎయిమ్స్‌ వైద్యులు ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకోవడంతో పాటు రెండు యూనిట్ల ఇన్సులిన్‌ డోసును కొనసాగించాలని సూచించింది. మెడిసిన్‌లో మార్పులు చేయాల్సిన అవసరం లేదని కూడా పేర్కొంది. ఇటీవల ఢిల్లీ హైకోర్టు ఆదేశాల మేరకు కేజ్రీవాల్‌ ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించేందుకు ఐదుగురు సభ్యులతో కూడిన మెడికల్‌ బోర్డు ఏర్పాటైంది.